అంతకుముందు ‘అనురాగం’ చిత్రంలో భాగస్వామిగా వున్న దగ్గుబాటి రామానాయుడు చిత్ర నిర్మాణం గూర్చి అవగాహన పొంది స్వంతంగా సురేష్ పతాకరపై నిర్మించిన తొలిచిత్రం “రాముడు-భీముడు”.
Click Here to go to Ramudu Bheemudu (1964) Movie Page.
రచయిత డి.వి.నరసరాజు యీ కథను కొందరు నిర్మాతలకు చెప్పగా వారెవ్వరూ ముందుకు రాలేదు. సాహసించి ముందడుగు వేసిన నిర్మాతను విజయలక్ష్మి వరించింది కనకవర్షం కురిపించింది. హీరో యన్.టి.ఆర్ కు యిది తొలి ద్విపాత్రాభినయ చిత్రం. చిత్రానికి దర్శకులు తాపీ చాణిక్య.
ఇహ కధ విషయానికి వస్తే..
రాముడు జమిందారు బిడ్డ, అయితే బావ పానకాలు అంటే హడల్. రాముణ్ణి అమాయకుణ్ని చేసి, ఆస్తిని అధికారాన్ని తన గుప్పెట్లో పెట్టుకోవాలనే పానకాలు అతన్ని భయపెట్టి చీటికి మాటికీ కొరడా దెబ్బలతో హింసిస్తాడు. ఇది భరించలేని రాముడు యిల్లు వదిలిపోతాడు.
ఓ పల్లెటూల్లో నాటికాలు వేసే ధైర్యవంతుడు, మొండివాడు భీముడు, అచ్చం రాముడి పోలికల్లో పుంటాడు. వాడు పల్లెటూరు వదిలి పట్నానికి వస్తాడు.
అంతకు ముందే రాముడికి రంగనాధం కుమార్తెతో పెళ్లిచూపులు జరిగాయి. రాముడిలో అమాయకుడ్ని చూసింది లీల. ఇప్పుడు లీల హ్యాండ్ బ్యాగ్ని ఎవరో దొంగతస్కరించగా టౌనుకు వచ్చిన భీముడు వాడికి దేహశుద్ధి చేస్తాడు. భీముడు రాముడు అనుకొని అతన్ని ప్రేమిస్తుంది లీల.
జమిందారు యింట్లో రాముడిగా ప్రవేశించిన భీముడు పానకాలరావుకు కొరడాతో బుద్ది చెబుతాడు, పల్లెటూరుకు చేరిన రామున్ని చూసిన గ్రామస్తులు భీముడనుకొంటారు, అక్కడ శాంతను ప్రేమిస్తాడు రాముడు, ఆ సన్నివేశాన్ని చూసిన లీల మనసు వికలమౌతుంది.
చివరకు రాముడు భీముడు యిద్దరూ కవల పిల్లలని, చిన్నప్పుడే తప్పిపోయారని నిజం తెలియటం భీముడు పానకాలరావుకు బుద్ధి చెప్పటం- రాముడికి శాంతతో,భీముడికి లీలతో వివాహం జరగటంతో కథ సుఖాంతంమౌతుంది.
రాముడు, భీముడుగా యన్.టి.ఆర్ ద్యిపాత్రాభినయం చేయగా లీలగా జమునా, శాంతగా ఎల్.విజయల్ష్మి, రంగనాథంగా యస్.వి.రంగారావు, విలన్ పానకాలుగా రాజనాల, రాముడి సోదరి సుశీలగా శాంతకుమారి పాత్రోచితంగా నటించారు.
రమణారెడ్డి, రేలంగి, గిరిజ మామా, అల్లుల్గుగా హాస్య ప్రహసనాన్ని సమర్ధవంతంగా నిర్వహించారు.

నరసరాజు పకడ్బందీగా రూపొందించిన స్క్రిప్ట్ చిత్రానికి ప్రాణం. పెండ్యాల స్వరకల్పనలో సి.నారాయణరెడ్డి వ్రాసిన యుగళగీతాలు “తెలిసిందిలే నెలరాజా నీ రూపు తెలిసిందిలే, అదేవింత నాకు తెలియకున్నది, తళుకు తళుకుమని గలగల సాగే” యుగళగీతాలు హిట్, శ్రీశ్రీ వ్రాసిన ప్రబోధగీతం “ఉందిలే మంచికాలం ముందుముందున” కొసరాజా సిగరెట్ పై వ్రాసిన “సరదా సరదా సిగరెట్టు, నాటక పద్యాల శైలిలో సాగిన తగునా ఇది మామా” గీతాలు కూడా ప్రేక్షకుల్ని రంజింపజేసాయి.
ఈ చిత్రానికి సంబంధించిన విశేషం ఏమిటంటే… దీన్ని హిందీలో నాగిరెడ్డి “రామ్ ఔర్ శ్యామ్” పేరిట దిలీప్ కుమార్తో తీసారు. హిందీ నిర్మాత జి.పి.సిప్పి యీ కథలోని ప్రధానమైన “రాముడు-భీముడు”లోని ద్విపాత్రల్ని హీరోయిన్స్ గా మార్చి హేమమాలినితో “సీతా ఔర్ గీతా” “పేరిట తీశారు. దాని హక్కులు కొని విజయావారే తెలుగులో వాణిశ్రీతో “గంగ-మంగ” పేరుతో తెలుగులో తీశారు. అయితే వాటన్నిటికీ స్పూర్తి ఆంగ్ల చిత్రం “ఫ్రిజనర్ ఆఫ్ జెండా”, మరో నవల ‘స్కేప్ గోట్’ అని డి.వి.నరసరాజు “తెరవెనుక కధలు”లో వివరించారు.
Source: 101 C, S V Ramarao