తెరముందు కాంతారావు (శ్రీకృష్ణుడు), గుమ్మడి (ధర్మజ), యన్.టి.ఆర్. (భీమ), బాలయ్య (అర్జున), సావిత్రి (ద్రౌపది), యస్.వి.రంగారావు (దుర్యోధన, మిక్కిలినేని (దుశ్శాసన), ప్రభాకరరెడ్డి (కర్ణ), లింగమూర్తి (శరుని), సంధ్య (భానుమతి), హరనాథ్ (అభిమన్యుడు), ఎల్.విజయలక్ష్మి (శశిరేఖ), పద్మనాభం (లక్ష్మణకుమారుడు), సత్యనారాయణ (ఘటోత్కచుడు), ధూళిపాళ (చిత్రసేనుడు) నవరసభరితంగా ఆయా పాత్రల్ని అద్భుతంగా పోషిస్తే, తెరవెనుక సముద్రాల (రచన), సి.నాగేశ్వరరావు (కెమెరా) పసుమర్తి కృష్ణమూర్తి (నృత్యం), ఘంటసాల (సంగీతం), యస్.కృష్ణారావు(కళ) తమ సమిష్టి కృషితో “పాండవవననవాసం” అనే అద్భుత దృశ్యకావ్యాన్ని సృష్టించారు. వీటన్నిటినీ సమస్వయ పర్చుకొన్న ధన్యజీవి దర్శకులు పౌరాణిక బ్రహ్మగా వినుతికెక్కిన కమలాకర కామేశ్వరరావు, దీనిని నిర్మించిన ఘనుడు మాధవీ అధినేత ఏ.ఎస్.ఆర్. ఆంజనేయులు.
Click Here to go to Pandava Vanavasamu (1965) Movie Page.

మయ సభలో దుర్యోధనునికి జరిగిన పరాభవం, పాండవులు పొందిన ప్రశంసలను గుర్తుకు తెచ్చుకొని శ్రీకృష్ణని సహాయానికి కృతజ్ఞత తెలుపుతారు పాండవులు, జరిగిన పరాభావాన్ని తల్చుకొని కృంగిపోతూన్న దుర్యోధనునికి ధైర్యం చెప్పి మాయా జూదంలో పాండవుల సంవదను హరిస్తానని ధైర్యం చెబుతాడు శకుని. పాండురాజు ఆహ్వానంపై పచ్చిన ధర్మరాజు జాదములో పాల్గొని సర్వస్వం వోడిపోయి చివరకు అరణ్య వాసం అజ్ఞాతవాసం చెయ్యాల్సిన పరిస్థితి వస్తుంది.
అరణ్యవాస సమయంలో పాండవుల్ని దుర్వాసుడు పరీక్షించటం, ద్రౌపతి కోరికపై భీమసేనుడు సౌగంధికా కమలాలను సాధించితేవటం, ఘోషయాత్రకు వచ్చిన దుర్వోధనుడు చిత్రసేనుని చేతిలో పరాభవం పొందటం, పాండవుల దాతృత్వంతో ప్రాణాలు దక్కించుకున్న సుయోధనుని ఆత్మహత్యాయత్నం. శశిరేఖ వివాహ సమయంలో లక్ష్మణకుమారుని పరాభవం, అభిమన్యునితో వివాహం; ఈ సంఘటనలన్నీరసవత్తరంగా ఏర్చికూర్చి ‘పాండవవనవాసం’ కథను రూపొందించారు.
సముద్రాల – ఘంటసాల కాంబినేషన్లో (ఆరుద్ర, కొసరాజు కూడా వ్రాసారు) రూపొందించి గీతాలన్నీ బాగా ప్రాచుర్యంపొందాయి. ముఖ్యంగా లీల పాడిన సోలో “దేవా దీనబాందవా”, యుగళగీతాలు “హిమగిరి సొగసులు”, “నా చందమామ నీవెభామ, రాగాలు మేళవింప’; చెప్పుకోదగ్గవి. రాజసులోచన నృత్యగీతం “ఉరుకుల పరుగుల దొరా” అందుకు నృత్యదర్శకులు పసుమర్తి రూపొందించిన భంగిమలు ప్రశంసనీయం. మరో నృత్యగీతం ద్వారా సినీరంగానికి పరిచయమయ్యారు హేమమాలిని. ఘంటసాల ఆలపించిన ఆంజనేయ స్తుతి భక్తి ప్రపూరితం.
నటీనటులందరూ హేమాహేమీలే! వారి అభినయ ప్రజ్ఞకు అవకాశం యిచ్చిందీ చిత్రం. దుర్యోధనుని దర్బారు సెట్పై దాదాపు ముప్పది అయిదు నిముషాలు జరిగిన జూదఘట్టం. భీమసేనుని ప్రతిజ్ఞ (తిక్కన వ్రాసిన మహాభారతంలోని పద్యాలు ‘ధారుణి రాజ్య సంపద, కురువృద్ధుల్ ‘) ద్రౌపది వస్త్రాపహరణ ఘట్టం- యివన్నీ అద్భుత భీభత్స, కరుణ, వీర రసాల్ని ఆవిష్కరించాయి.
మరపురాని, మరవలేని మహోన్నత భారతగాధ “పాండవవనవాసము”, అజరామర దృశ్యకావ్యం.
1965లో సంక్రాంతి కానుకగా విడుదలైన యీ చిత్రానికి నేటి ప్రముఖ దర్శకులు కె. రాఘవేంద్రావు సహాయ దర్శకులుగా పనిచేశారు. బెంగాలీ భాషలోకి యీ చిత్రాన్ని డబ్ చేయగా అక్కడ కూడా ఘన విజయం సాధించింది.
Source: 101 C, S V Ramarao