1950 ప్రాంతల్లో జెమినీ వాసన్ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నిర్మించిన చిత్రం “మంగళ”. కధానాయిక భానుమతి, హీరో రంజన్, ఇదే కథను అంతకు ముందే 1943లో టి.జి.రాఘవాచార్య దర్శకత్వంలో తమిళంలో నిర్మించారు. ఇతివృత్తం చాలా బలమైంది. దీనిని యింప్రవైజ్ చేసి బి.విఠలాచార్య దర్శకత్వంలో డి.వి.ఎస్ పతాకంపై నిర్మాత డి.వి.ఎస్.రాజు “మంగమ్మ శపథం” పేరుతో తెలుగులో నిర్మించారు.
Click Here to go to Mangamma Sapatham (1965) Movie Page.
ఆ రాజ్యాన్ని పాలించే రాజు కాముకుడు స్త్రీలోలుడు. పల్లెటూరిపిల్ల మంగమ్మ జలపాతంలా దూకుతూ హుషారుగా వుండే అందగత్తె, అంతేకాదు స్వాభిమానం, తెగువ గల మగువ. ఆమె పొందుకోరుతాడు రాజు, కానీ ఆమె తిరస్కరిస్తుంది. అప్పుడు ఆమెనే పెళ్ళాడతానని సవాలు చేస్తాడు రాజు. అదే జరిగితే, అతనివల్లే కుమారుణ్ణి కని, వాడిచేత రాజును కొరడా దెబ్బలు కొట్టిస్తానని సవాలు చేస్తుంది మంగమ్మ. మహారాజు మంగమ్మ మెడలో తాళిగట్టి తన పంతం నెరవేర్చుకొని మంగమ్మను బంధిస్తాడు. అయితే తెలివిగల మంగమ్మ, దొమ్మరివారి సహాయంతో నాట్యం నేర్చుకొని దొమ్మరసానిగా వేషం మార్చుకొని రాజును ఆకర్షించి అతనితో ఒక చీకటి గడుపుతుంది. ఫలితంగా ఆమె గర్భవతియౌతుంది. పుట్టిన విజయ్ పెరిగి పెద్దవాడౌతాడు. తల్లికి జరిగిన అవమానాన్ని తెల్సుకొన్న విజయ్ యుక్తిగా రాజును బంధించి కొరడాలతో కొట్టి తల్లి చేసిన శపధాన్ని నెరవేరుస్తాడు.
ఇందులో కధానాయకుడు ద్విపాత్రాభినయం. యన్.టి.ఆర్ తండ్రి, కొడుకులుగా నటనలో నైవిధ్యం చూపించారు. అయితే నాయకపాత్రను యెవర్ని యెంపిక చెయ్యాలి అని తర్జనభర్జనలు చేసిన నిర్మాత డి.వి.ఎస్.రాజు, దర్శకులు విఠలాచార్యులు సుదీర్ఘ చర్చలు జరిపారు. కారణం రెండవ ఎన్.టి.ఆర్ ‘అమ్మా’ అని పిలిస్తే ప్రేక్షకులు రిసీవ్ చేసుకోవాలి, ఈ మేరకు జమున మంగమ్మ పాత్రకు తగిన నటిగా ఎంపిక చేసారు. ఆమె ఆ పాత్రలో రాణించింది. రెండో కధానాయక విజయగా యల్.విజయలక్ష్మి చక్కని నాట్యాలు చేసింది. విలన్ గా రాజనాల, హాస్యపాత్రల్లో రేలంగి, గిరిజ, ఛాయాదేవి బాలకృష్ణ రమణారెడ్డి రాణించారు.
సంగీత దర్శకుడు టి.వి.రాజు – సి.నా.రె కాంబినేషన్లో రూపుదిద్దుకొన్న “రివ్వున సాగె రెపరెపలాడె,” సోలో గీతం “కనులీ వేళచిలిపిగనవ్వెను, నీరాజు పిలిచెను రేరాజు-పలికెను, ఒయ్యార మొలికే చిన్నది” యుగళగీతాలు యల్.విజయల్ష్మి పై చిత్రీకరించిన జావళి “అందాల నా రాజ అలుకేలరా” స్వరమాధుర్యంతో ప్రేక్షకుల్ని అలరించాయి.

ఈ చిత్రం ప్రారంభించబోతున్న తరుణంలో జెమినీ వాసన్, హీరో యన్.టి.ఆర్ కు ఫోన్ చేసి యేదో మాట్లాడాలి వస్తున్నా అన్నారట. అక్కడే వున్న నిర్మాత డి.వి.ఎస్.రాజు, త్రివిక్రమరావు కంగారు పడ్డారట- దానికి కారణం అంతకుముందు ఆ కథను వాసన్ తీశారు, హక్కుల విషయమై చర్చించటానికి వస్తున్నారేమోనని; అయితే వాసన్ వచ్చి తను తీస్తున్న ఆడబ్రతుకు” చిత్రం కాల్ షీట్ల విషయమై యన్.టి.ఆర్.తో ప్రస్తావించారట. అప్పుడు “హమ్మయ్య” అని రాజుగారు, మిగితా మిత్రులు తేలికపడ్డారట (ఈ విషయాన్ని శ్రీ డి.వి.యస్.రాజుగారు “అంతరంగతరంగాలు”లో వుదహరించారు.)
Source: 101 C, S V Ramarao