అంతకుముందు 1956లో అక్కినేని, యన్.టి.ఆర్ కాంబినేషన్ లో రసవత్తర చారిత్రాత్మక చిత్రం “తెనాలి రామకృష్ణ” తీసిన బి.యస్. రంగా నిర్మంచిన మరోవిశిష్ట చారిత్రాత్మక చిత్రం “అమరశిల్పి జక్కన్న”.
Click Here to go to Amara Silpi Jakkanna (1964) Movie Page.
మల్లన్న (నాగయ్య) గొప్ప శిల్పి. ఆయన కొడుకు జక్కన్న (అక్కినేని) తండ్రిని మించిన తనయుడు, అతడు నాట్యమయూరి మంజరి (బి.సరోజాదేవి)ని ప్రేమించి వివాహమాడతాడు. అయితే మంజరి అందచందాలను, నాట్య విన్యాసాన్ని అభిమానించిన రాజు గోపదేవుడు కుట్రపన్ని వారిద్దరినీ వేరు చేస్తాడు.
దాని ఫలితంగా మంజరి తప్పనిసరి పరిస్థితుల్లో గొపదేవుని ముందు నృత్యం చేస్తుంది, దానిని చూసిన జక్కన్న, భార్యను అనుమానించి, వికల మనస్కుడై, విరాగియై దేశాటన చేస్తాడు. తుదకు శ్రీరామానుజాచార్యుల సన్నిధిలో స్థిరపడతాడు.
మంజరి గోపదేవుని కుట్ర నుంచి బైటపడి, ఆత్మహత్యా ప్రయత్నంగా నీటిలో దూకి జాలరులచే రక్షింపబడి మగబిడ్డకు జన్మనిస్తుంది. అతడే డంకన్న (హరనాథ్). విరాగియైన జక్కన్న హోయాసలరాజు విష్ణువర్ధనుడు పాలించిన బేలూరులో శిల్పాలకు ప్రాణం పోస్తాడు. అతని శిల్పాలలో ఆతని భార్య మంజరి ప్రతిరూపం కననిపిస్తుంది.
అయితే జక్కన్న తీర్చిదిద్దిన ఒక శిల్పంలో లోపంవుందని సవాలు చేస్తాడు డంకన్న. ఫలితంగా ఆ శిల్పంలో కప్ప కనపడటం, అందుకు పరిహారంగా జక్కన్న తన చేతుల్ని నరుక్కొంటాడు.
పతాక సన్నివేశంలో తాత మల్లన్న, తండ్రి జక్కన్నా, భార్య మంజరి, కొడుకు పరస్సరం తెలుసుకోవటం, ఆ దేవదేవుడు కరుణించి జక్కన్నకు తిరిగి చేతులు ప్రసాదించటంతో కథ పరిసమాప్తమౌతుంది
ప్రధాన పాత్రల్లో నాగేశ్వరరావు, బి. సరోజాదేవి రాణించగా, సహాయపాత్రల్ని కన్నడం నటుడు ఉదయకుమార్, ధూళిపాళ, రేలంగి, గిరిజ, సూర్యకాంతం, పుష్పవల్లి సమర్ధవంతంగా నిర్వహించారు.
ఈ చిత్రం పేరు చెప్పగానే గుర్తుకు వచ్చేది యస్.రాజేశ్వరరావు సమకూర్చిన సుమదుర సంగీతం. సి.నా.రె వ్రాసిన “ఈ నల్లని రాలలో ఏకన్నులు దాగెనో” దాశరధి వ్రాసిన “అందాల బొమ్మతో ఆటాడవా”, సముద్రాల (ఈయనే సంభాషణలు వ్రాసారు) వ్రాసిన ‘నిలువుమా నిలుపుమా నీలవేణి” గీతాలు సంగీత ప్రియుల్ని ఆహ్లాదపరుస్తాయి. నిర్మాత, దర్శకుడు, ఛాయాగ్రాహకుడు బి. యస్.రంగా యీ చిత్రాన్ని తెలుగు, కన్నడ భాషల్లో నిర్మించారు.
తెలుగు చిత్రానికి రాష్ట్రపతి యోగ్యతాపత్రం లభించింది. బి.యస్. రంగా స్వతహాగా ఛాయాగ్రాహకులు. తెలుపు నలుపు చిత్రాల్లో అద్భుతమైన ఎఫెక్ట్ను కెమెరా ద్వారా సాధించారు. అందుకు భరణీ వారి “లైలా మజ్ను”, వినోదా వారి “దేవదాసు” చెప్పుకోవాలి. ప్రత్యేకించి దేవదాసులో పాటలు అంతగా ప్రాచుర్యం పొందటానికి తెరపై ఎఫెక్టివ్గా కనిపించటానికి బి.యస్. రంగా ఛాయాగ్రహణం ఎంతో దోహదం చేసింది. ఆయన విక్రమ్ స్టూడియోస్ అధినేత కూడా. విక్రమ్ పతాకంపై తెలుగు, తమిళ, కన్నడ, హింధీ భాషల్లో స్వీయ దర్శకత్వంలో పలు చిత్రాలు నిర్మించారు. “అమర శిల్పి జక్కన్న” చిత్రాన్ని కన్నడంలో కళ్యాణ్కుమార్ హీరోగా అమరశిల్పి జక్కనాచారి” పేరుతో నిర్మించారు.
తెలుగులో వీరు స్వీయదర్శకత్వంలో నిర్మించిన చారిత్రాత్మక చిత్రాలు “తెనాలి రామకృష్ణ”, “అమరశిల్పి జక్కన్న” లకు ప్రభుత్వ బహుమతులు రాగా “వసంత సేన” చిత్రం నిరాశను మిగిల్చింది. తెలుగులో రంజన్ కథానాయకుడుగా వీరు తీసిన “రాజా మళయసింహ”. హిందీలో షమ్మీకపూర్ హీరోగా “ప్యార్ కియాతో డర్నా క్యా” నిర్మించారు.
Source: 101 C, S V Ramarao, The Hindu