May 23, 2020

Mooga Manasulu (1964): Tollywood’s First Reincarnation Epic Film #TeluguCinemaHistory

Mooga Manasulu (1964): Tollywood’s First Reincarnation Epic Film #TeluguCinemaHistory

బాబూ మూవీస్ కోసం ఉదాత్త సాంఘీక చిత్రాల విశిష్ట దర్శకుడు సుబ్బారావు ప్రోత్సాహం, ప్రేరణలతో మనసు కవి ఆచార్య ఆత్రేయ, సినీ సాహితీ సవ్యసాచీ ముళ్ళపూడి వెంకట రమణలు రూపొందించిన విశిష్టమైన, నూటికి నూరుపాళ్ళు తెలుగుదనం ఉట్టిపడే కత మూగ మనసులు చిత్రానికి అలంబన. సంభాషణలు కూడా వారిద్దరే రాశారు. తెలుగు నేలపై ప్రవహించే జీవనది గోదావరినీ, ప్రకృతి అందాలు పరచుకొన్న కోనసీమ సోయగాలను కథాపరంగా జరిగే సన్నివేశాలకు నేపథ్యంగా తీసుకొన్నారు కథకులు.

అరుదైన, అపురూపమైన ప్రేమకథ. దీనికి ప్రేరణ పూర్వజన్మ పరిజ్ఞానం అనీ చావు – పుట్టుక అనేవి శరీరానికే కానీ, ఆత్మకు కావనీ చిత్ర ప్రారంభంలో నేపథ్యంలో చెప్పిస్తారు. కొత్త దంపతులు గోపీనాథ్, రాధ హనీమూన్ కోసం బయలుదేరడంతో కథ ప్రారంభమై, గోదావరిలో పడవ ప్రయాణిస్తుండగా – కొద్ది దూరంలో ప్రాణాంతకమైన సుడిగుండాలు ఉన్నాయంటూ పడవను ఆపమని విలపిస్తాడు గోపీనాథ్. నాయిక రాధ కూడా కోరడంతో పడవను ఆపుతాడు సరంగు.

గోపీనాథ్ అన్యమనస్కంగా ఆల్లంతదూరాన ఉన్న పాడుపడ్డ మేడ వద్దకు వెళ్ళి గతజన్మ స్మృతులు గుర్తుకు రాగా, ఆక్కడ ఒక ముసలివాడు తారసిల్లి అది జమీందారు భవంతి అని చెప్పి, అమ్మాయిగారు రాధ, గోపిల సమాధుల దగ్గరకు తీసుకువెళతాడు. అక్కడ ఆ సమాధులకు దీపం పెడుతూ చావు కోసం నిరిక్షిస్తున్న వృద్ధురాలు గౌరిని చూసి తాను గోపీని అని చెప్పగా, గౌరీ తృప్తిగా నిట్టూర్చి, గోపీనాథ్ చేతుల్లో తుదిశ్వాస విడుస్తుంది. (కాలగమనంలో గౌరి చస్తే నీ చేతుల్లోనే చస్తామ మావా’ అంటూ గోపీతో అనడం గమనార్హం). ఆ గౌరిని గురించి గోపీనాథ్, రాధకు వివరించడంతో అసలు కథ మొదలౌతుంది.

గోపీ గోదావరిపై పడవ నడిపేవాడు. ఆవ్వ చెప్పిన ప్రకారం అతడి జన్మ వృత్తాంతం ఎవరికీ తెలియదు. గోదావరి తల్లి వాణ్ణి పెంచి పెద్దచేసిందిట. జమీందారుగారమ్మాయి రాధ. ఆమె ఆవలి గట్టున ఉన్న కాలేజీలో చదువుకొంటుంటుంది. ప్రతిరోజూ ఆమెను తన పడవపై నది దాటించే గోపికి ఆమె అంటే వల్లమాలిన అభిమానం. అందుకనే ఆమె నిండుగా ఉండాలని తన ఇంటప్రాంగణంలో పూచిన ముద్దబంతి పుప్వును ప్రతిరోజూ ఆమెకు ఇస్తాడు (ఆమె పెళ్లి సందర్భంలో ఈ పువ్వును బహుమతిగా ఇవ్వడానికి సంకోచించగా, ఆమె ఆప్యాయంగా తీసుకొని సిగలో తురుముకొంటుంది. ముద్దబంతిపుప్వుకు, ఈ చిత్రానికి అవివాభావ సంబంధం ఉందనడానికి ఆ పల్లవి గల పాట కూడా ఉంది. కారణం-అది తెలుగువారి పువ్వు). అయితే, ఈ అభిమానంలో ఆప్యాయత తప్ప అన్యచింతన కాగడా వేసి వెతికినా ఆ అమాయకుడిలో కనిపించదు.

అక్కడే మేకలు తోలుకొనే పిల్ల గౌరి. గోపీ మాటల్లో చెప్పాలంటే, గౌరి ‘జలపాతంలా దూకుతూ, లేడి పిల్లలా గెంతుతూ, ఆడవి పుప్వులా నవ్వుతూ ఉండేది (అదరణకు నోచుకోని అడవి పువ్వులా ఆమె జీవితం అంతమౌతుందని ఒక సూచన కాబోలు). ఆ గౌరి గోపిని ప్రేమిస్తుంది. ప్రేమించమని వెంటపడుతుంది. అమ్మాయిగారు కాలేజీ పాటల పోటీల్లో ఓడిపోకూడదని ఆమెకు పల్లె పదాలు నేర్పుతాడు గోపీ. ఆమె కూడా అతని పుట్టిన రోజున కొత్త బట్టలు పెట్టి, పాట నేర్పిన గురువుగా అభిమానిస్తుంది. ఆమెను ప్రేమించిన రామరాజు ‘ఒక లెటర్’ ఇమ్మంటే గోపీ అమాయకంగా ఇచ్చి, అది ఆమెకు నచ్చదని తెలిసి – ఆమె ఏం చేసేదో విని రామరాజు చెంప వాయకొడ్తాడు.

రాధ మేనమామ రాజేంద్ర స్వలాభాపేక్షతో పన్నిన పథకం వల్ల రాధకు రామరాజాతో పెళ్ళపుతుంది. దీనికి ముందు జరిగే సన్నివేశంలో వర్షంలో రాధ తడిసిపోగా- ఆమెను సురక్షితంగా ఒక పాక వద్దకు గోపీ తీసుకెళ్లడం, ఉరుములు మెరుపులు చూసి రాధ కంగారుపడగా – అవి దేవుడి బాజాలు అని గోపీ చెప్పడం వారిద్దరికీ ఏ జన్మాంతర సంబంధం ఉందేమోనని ఊహించడం జరుగుతుంది.

విధి వక్రించి రామరాజు మరణించడంతో రాధ విధవరాలుగా గ్రామానికి రావడంతో కథ మరో మలుపు తిరుగుతుంది. విధి ఆమెకు చేసిన అన్యాయానికి గోపి తల్లడిల్లిపోతాడు. ఆమెకు సాంత్వన చేకూర్చడానికి ‘లాలి’ పాడుతాడు, గోపీ ధోరణి గౌరికి నచ్చక వారిద్దరికీ అక్రమ సంబంధం అంటగడుతుంది. అది గ్రామంలో దావానలంలా వ్యాపిస్తుంది. ఇందుకు రాజెంధ్ర దోహదం చేస్తాడు, ఈ కల్మష వాతావరణానికి దూరంగా వెళ్ళిపోయిన గోపిని వెతుక్కుంటూ రాధ వెళుతుంది. ఇద్దరు సుడులు తిరిగే వరద గోదారిలో సుదూర తీరాలకు పయనమై సాగిపోతుండగా వాళ్ళను చంపాలని తుపాకీ తీసుకొన్న రాజేంద్రకు తన శీలాన్ని అర్పించి గౌరి వాళ్ళను రక్షిస్తుంది. ఇది “గౌరి’ పాత్రకు రచయితలు ఇచ్చిన అద్భుతమైన ‘ఫినిషింగ్ టచ్’ అయితే రాధ. గోపీ ఇద్దరూ సుడిగుండాల్లో చిక్కుకుని బతుకులో ఏకం కాలేనివాళ్ళు చావులో ఏకమౌతారు.

ఈ కథ చెప్పాక, గోపీనాథ్ చేతుల్లో మరణించిన గౌరికి గత జన్మ కథలోని గోపీ- రాధల సమాధుల పక్కనే సమాధి కట్టి నవదంపతులు ఆమెకు నివాళులర్పిస్తారు. పకడ్బందీగా సినేరియో రూపొందించుకొని, సన్నివేశాలను, పాత్రలను సహజంగా తీర్చిదిద్దడంలో అందవేసిన చేయి ఆదుర్తి సుబ్బారావుది. ఆయన సహజంగా ఎడిటర్ కావడం వల్ల చిత్రంలో అనవసరమైన ప్రేమ్ కనిపించదు. దర్శకునిగా ఆదుర్తి విశ్వరూపాన్ని చూపిన చిత్రం “మూగమనసులు”, ఆయన ఒరవడిలోనే రెండో యూనిట్ కు దర్శకత్వ బాధ్యతల్ని నిర్వహించిన నేటి కళాతపస్వి కె.విశ్వనాథ్ కూడా ప్రశంసార్హులు.

భాషకు అందని విషాద భావ ప్రకటనలో తనకు తానే సాటియని అక్కినేని మరోసారి నిరూపించుకొన్న పాత్ర గోపి. కళ్ళతో, చూపుల కదలికతో వేయి భావాల్ని పలికించగల మహానటి సావిత్రి. ఆమె నటించడం వల్ల ఆ పాత్రకు అమరత్వం సిద్దించిందని చెప్పాలి. పొగరు, వగరు, అమాయకత్వం కలగలసిన గౌరి పాత్రలో జమున జీవించారు. ఇక జమీందారుగా గుమ్మడి, ఆయన రెండో భార్యగా సూర్యకాంతం,తమ్ముడు విలన్ రాజేంద్ర భూమికలో నాగభూషణం, రాధ ఆరాధకుడిగా పద్మనాభం వారి పాత్రలకు పరిపూర్ణ న్యాయం చేకూర్చారు.

మూగమనసులులోని ప్రతి పాటా తెలుగువాళ్ళ హృదయాల్లో నేటికి నాట్యమాడుతుంటాయి. అందుకు స్వరబ్రహ్మ కె.వి.మహదేవన్ మెలొడీకి పెద్దపీట వేసి కూర్చిన బాణీలు నవ నవోన్మేషితాలు. మనసు కవి ఆత్రేయ పాటల పరంగా వేదాంత ధోరణిని జోడించి జీవితానికి విలువైన ఎన్నో అంశాలను వివరించారు.

“మనిషి తోటి యేలాకోలం ఆడుకొంటే బాగుంటాది

మనసుతోటి ఆడకు మావా, సితికిపోతే అతకదు మల్లా!”

“పోయినోళ్ళు అందరూ మంచోళ్ళూ

ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గురుతులు”, “చావు పుట్టుక లేనిదమ్మ నేస్తమన్నది జనమ జనమ కది మరీ గట్టిపడతది” ఇలా ఎన్నో ఎన్నో ఉదాహరణలు. గోదావరి నదీ పరీవాహక సౌందర్యాల్నీ కోనసీమ సోయగాల్ని అందమైన కోణాల్లో చూపించారు కెమేరామెన్ పి.ఎల్.రాయ్. నా పాట నీనోట పలకాల సిలక పల్లవి గల పాటలో కలవాల, యెన్నెల్లు కాయాలా, యెన్నెలకే మనమంటే కన్ను కుట్టాల –  ఈ చరణం చిత్రీకరణలో రాత్రి వేళ వెన్నెల గోదావరి మీద పడి – ఆ కాంతి పడవ నడిపే గోపీ అనాచ్చాదిత శరీరంపై ప్రతిబింబించటం అద్భుతం.

ఏ ఫ్రేమ్ను ఎంతవరకూ ఉంచాలో చాకచక్యంగా కూర్చి చూపించారు. ఎడిటర్ టి.కృష్ణ (ఈయన ఈ చిత్రానికి సహాయ దర్శకులు కూడా) హారంలో పూలు రాలిపోయినా, దారం మిగిలేటట్లు, ఎన్నో సంవత్సరాలు గడిచిపోయినా కాలపరీక్షకు నిలబడిన మూగమనసులు వేదన తెలుగు ప్రేక్షకుల భావస్రవంతిలో చిరంజీవిగా మిగిలిపోయింది.

‘మూగమనసులు’ చిత్రానికి కేంద్రప్రభుత్వ యోగ్యత పత్రం లభించింది.

ఈ చిత్రం తమిళంలో ‘ప్రాప్తం’ పేరుతో సావిత్రి దర్శకత్వంలోనూ, హిందీలో ‘మిలన్’ పేరిట ఆదుర్తి దర్శకత్వంలోనూ నిర్మించబడింది.

Spread the love:

Comments