April 9, 2020

Parivartana (1954): Reminiscence of Telugu Cinema #TeluguCinemaHistory

Parivartana (1954): Reminiscence of Telugu Cinema #TeluguCinemaHistory

1950 ప్రాంతాల్లో పినిశెట్టి శ్రీరామమూర్తి నాటకం ‘ అన్నా చెల్లెలు’ ఆంధ్ర దేశంలో విరివిగా ప్రదర్శింపబడి ప్రజాదరణకు నోచుకుంది. ఆ కథను ఆధారంగా చేసుకుని జనతా పతాకంపై తాతినేని ప్రకాశరావు దర్శకత్వంలో నిర్మించబడి 1. 9. 1954న విడుదలైన చిత్రం ‘పరివర్తన’. ఇందులో అక్కినేని, ఎన్టీఆర్., సావిత్రి సహజసిద్ధమైన పాత్రల్లో ఒకరికొకరు పోటీ పడి నటించారు. మానవతా విలువలకు, నీతి నియమాలకు, ఆదర్శాలకు చిత్ర కథలో ఎంతో విలువనిచ్చారు.

Click Here to go to Parivartana (1954) Movie Page.

మా ఊరు జమీందారుకు పిల్లలు లేక అనాధాశ్రమం నుంచి ఒక కుర్రాణ్ణి తెచ్చి పెంచుకుంటాడు. ఆ కుర్రాడు ఆనందరావు టౌన్ లో చదువుకుని గ్రామానికి తిరిగి వస్తాడు. ఈలోగా జమిందారు మరణిస్తూ ఎస్టేట్ వ్యవహారాలు రామయ్యకు అప్పచెబుతాడు. రామయ్యకు గ్రామంలో మంచి ఆదరణ, కీర్తి లభిస్తాయి. అతనికి పెద్ద కొడుకు సత్యం, కూతురు సుందరమ్మ, మరో చిన్న కొడుకు ఉంటారు. గ్రామానికి వచ్చిన ఆనందరావు రామయ్యకు లభించే గౌరవం చూసి అసూయపడతాడు. ఇందుకు అగ్నికి ఆజ్యం పోసినట్టు చలపతి, పిచ్చయ్య అనే ఇద్దరు నీచులు ఆనందరావుని రెచ్చగొడతారు.

అంతకు ముందు జమీందారు పేరున అన్నదాన సమాజానికి రామయ్య చందాలిచ్చేవాడు. దానిని ఆనందరావు నిలిపివేసి రామయ్యను అవమానిస్తాడు. సత్యం ఉద్యోగం కోసం ప్రయత్నించి చివరకు ఓ కండక్టర్ పని సంపాదించుకుంటాడు. కలెక్టర్ అవుతాడని ఆశించిన సత్యంను కండక్టర్ గా చూసి జరిగిన దురదృష్ట పరిణామాలకు రామయ్య గుండెపగిలి మరణిస్తాడు. సత్యం కండక్టర్గా పని చేస్తున్న బస్సును కొన్న ఆనందరావు సత్యంను ఉద్యోగం నుంచి తొలగిస్తాడు. దుష్టుడైన చలపతి సుందరమ్మను అవమానించగా సత్యం అతన్ని చావగొట్టి జైలుకు వెళతాడు. వేరే దిక్కులేక సుందరమ్మ అన్నదాన సమాజం పంచన చేరుతుంది.

ఈ పరిస్థితుల్లో చలపతి, పిచ్చయ్య కలిసి ఆనందరావు దత్తు పత్రాలు కాజేసి అతని ఆస్తికి ఎసరు పెడతారు. ఫలితంగా ఆనందరావు బికారిగా మిగిలిపోయి అన్నదాన సమాజం లో చేరుతాడు. అక్కడ అతనికి పరివర్తన కలిగి తన అహంకారం వల్ల రామయ్య కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని గుర్తించి పశ్చాత్తాపం చెందగా, అక్కడే ఉన్న సుందరమైన అతనిలో మార్పు గమనించి ప్రేమిస్తుంది. జైలు నుంచి తిరిగివచ్చిన సత్యం, ఆనందరావు- సుందరమ్మల అనురాగం గుర్తించి పిచ్చయ్య నుంచి దత్తు పత్రాలను సంపాదించి ఆనందరావు కోర్టులో న్యాయం కలిగేలా చేస్తాడు. చలపతి, పిచ్చయ్య జైలుకు పోగా ఆనందరావు, సుందరమ్మ ల వివాహంతో కధ ముగుస్తుంది.

ఇందులో విలన్ టచ్ ఉన్న అహంకారి ఆనందరావు పాత్రను ఎన్. టి. రామారావు, భంగపడ్డ కుటుంబానికి చెందిన కథానాయకుడు సత్యంగా అక్కినేని, అతని సోదరి సుందరమ్మగా సావిత్రి ఎంతో సహజంగా నటించారు. రామయ్యగా దొరస్వామి, చలపతిగా రమణారెడ్డి, పిచ్చయ్యగా చదలవాడ, అన్నదాన సమాజం యజమానిగా మిక్కిలినేని, సత్యాన్ని ప్రేమించి భంగపడ్డ పాత్రలో సురభి బాలసరస్వతి, ఇతర పాత్రల్లో పెరుమాళ్ళు, రామకోటి, జైలు సన్నివేశంలో గెస్టుగా జోగారావు పాత్రోచితంగా నటించారు.

జంట కవులు సుంకర- వాసిరెడ్డి మాటలు రాయగా అనిశెట్టి పాటలు రాశారు. టి. చలపతిరావు సంగీత సారథ్యంలో ” కలికాలం ఇది కలికాలం ఆకలి కాలంరా, నందారే లోకమెంతో చిత్రమురా, అమ్మా అమ్మా  అవనీమాత, ఇంత చల్లనివేళ వింత తలుపులీవేళ, ఔనంటారా కాదంటారా’ వంటి పాటలు జనాదరణ పొందాయి.

ఎన్. టి. ఆర్., అక్కినేని ఎదురుపడ్డ ప్రతి సన్నివేశాన్ని ఎంతో రసవత్తరంగా తెరపై ఆవిష్కరించారు దర్శకులు తాతినేని ప్రకాశరావు. అక్కినేని సరసన అంతకముందు ‘ దేవదాసు, బ్రతుకు తెరువు’ చిత్రాల్లో నాయికగా నటించి ప్రశంసలందుకున్న సావిత్రి ఈ చిత్రంలో సోదరిగా నటించినా ప్రేక్షకులు రిసీవ్ చేసుకోవడం చెప్పుకోదగ్గ విశేషం.

Source: 101 C, S V Ramarao

Spread the love:

Comments