April 16, 2020

Jayasimha (1955): National Art Theatre’s First Blockbuster #TeluguCinemaHistory

Jayasimha (1955): National Art Theatre’s First Blockbuster #TeluguCinemaHistory

యన్.టి.రామారావు గుంటూరులో కాలేజీ విద్యార్థిగా పున్నప్పుడే నేషనల్ ఆర్ట్ థియేటర్స్ అనే సంస్థ పేరిట పలు నాటకాలు ప్రదర్శించారు. సినీరంగ ప్రవేశం జరిగి హీరోగా నిలదొక్కుకున్నాక స్వయంగా చిత్రనిర్మాణాన్ని చేపట్టినప్పుడు అదే బేనరును చిత్రసంస్థకు కూడా ఎన్నుకున్నారు. అయితే ఉత్తమ అభిరుచితో సామాజిక స్పృహతో నిర్మించిన తొలిచిత్రం ‘ పిచ్చిపుల్లయ్య’. మలిచిత్రం ‘తోడుదొంగలు’ ఆర్థికంగా నిరాశనే మిగిల్చాయి. ఒకదశలో చిత్రనిర్మాణానికి మంగళం పాడాలని కూడా యన్.టి.ఆర్ నిర్ణయించుకున్నారు. సోదరుడు, నిర్మాత ఎన్.త్రివిక్రమరావు, బావమరిది పుండరీకాక్షయ్యలతో సంప్రదించి మూడో ప్రయత్నంగా కత్తి చేతబట్టి ఓ జానపద చిత్రం తీయాలని నిర్ణయించుకున్నారు. అంతకుముందే ‘పల్లెటూరిపిల్ల’, ‘పాతాళభైరవి చిత్రాల్లో జానపద హీరోగా ఒక ఇమేజ్ ను రామారావు సంపాదించుకున్నారు.

Click Here to go to Jayasimha (1955) Movie Page.

పై నిర్ణయం మేరకు ‘జయసింహ’ చిత్ర నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. వెంకట పార్వతీశ్వర కవుల ‘వీరపూజ’ నవల ఛాయలతో ఈ చిత్రకథ రూపొందించారు. కాగా ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి.

తోడుదొంగలు’ చిత్రానికి సముద్రాల జూనియర్ (రచయిత), యోగానంద్ (దర్శకుడు), టి.వి.రాజు (సంగీతం) పనిచేశారు. ఆ చిత్రానికి కేంద్రప్రభుత్వ అవార్డు లభించినా ఆర్థికంగా దెబ్బతింది. అయినా అదే టీంతో ‘జయసింహ’ ప్రారంభించడం యన్.టి.ఆర్. ఆత్మీయతకు, ఆత్మవిశ్వాసానికి  నిదర్శనం.

మాళవదేశ మహారాజు మరణించగా (చంపబడ్డాడు). ప్రస్తుతం ఆ మహారాజు తమ్ముడు రుద్రసింహుడు (యస్.వి. రంగారావు) పరిపాలిస్తున్నాడు. గతించిన రాజు కుమారుడు రాజ్యనికి వారసుడు జయసింహుడు (యన్.టి.రామారావు). రుద్రసింహుని కుమారుడు విజయసింహుడు (కాంతారావు). రాజ్యాన్ని పూర్తిగా కబళించే దిశగా వారసుడైన జయసింహుని అంతమొందించడానికి రుద్రసింహుడు రెండుసార్లు ప్రయత్నిస్తాడు. ఇది తెల్సిన జయసింహుడు రాత్రికిరాత్రి దేశం విడిచి వెళ్ళిపోతాడు. సోదరుడు విజయసింహుడు ఎంతో బాధపడతాడు.

పొరుగుదేశపు రాజు (డాక్టర్. వి.కామరాజు)ను బంధిస్తారు శత్రువులు. అంతేకాదు… అతని కుమార్తెను దొంగలు అపహరిస్తారు. ముందుగా రాకుమారిని (వహిదా రెహమాన్)ని, ఆ తరువాత మహారాజుని రక్షిస్తాడు జయసింహుడు. పరదేశం కనుక తన పేరు భవానీ అని చెప్పుకుంటాడు. ఆ రాజ్యంలో రణధీర్ (గుమ్మడి) అనే వీరుని ఇంట ఆశ్రయం పొందుతాడు జయసింహుడు. రణధీర్ కొడుకు సుబుద్ధి (రేలంగి) కూతురు కాళింది (అంజలిదేవి), కాళింది తన ఇంటవున్న జయసింహుని ప్రేమిస్తుంది. జయసింహుడు, రాజకుమారి అంతకుముందే ప్రేమించుకున్నారు. రాకుమారిని చేజిక్కించుకోవాలని ప్రయత్నిస్తాడు సేనాధిపతి (రాజనాల). రుద్రసింహుడు పంపిన ప్రచండుడు, సేనాధిపతి ఇద్దరూ కలిసి వ్యూహం పన్ని మహారాజును బంధిస్తారు. వారిని రక్షించడానికి వెళ్ళిన జయసింహుని కూడా బంధిస్తారు. జయసింహుడు తనను సోదరిలా భావిస్తున్నాడని తెలుసుకున్న కాళింది త్యాగబుద్ధితో జయసింహుని రక్షించి ఆ ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోతుంది. విజయసింహుని సహాయంతో జయసింహుడు శత్రుసంహారం చేస్తాడు. రాజద్రోహి అయిన రుద్రసింహుడు కూడా కొడుకు చేతిలో మరణిస్తాడు. జయసింహుడు రాజ్యాధికారాన్ని చేపడతాడు. క్లుప్తంగా ఇదీ కథ.

ఈ కథలో ‘జయసింహ’గా యన్.టి.రామారావు హీరోయిజానికి పెద్దపీట వేశారు చిత్రం మొదట్లో స్టంట్ డైరెక్టర్ సోముతో గండ్రగొడ్డలి పోరాటం, ఆ తరువాత వచ్చే కాగడాల యుద్ధం. అన్నిటా రామారావు తన ప్రతిభను నిరూపించుకున్నారు. పైన ఉదహరించిన నటీనటులందరూ ప్రధాన పాత్రలకు న్యాయం చేశారు. ఇతర సహాయపాత్రల్లో వంగర, సీత, మహంకాళి వెంకయ్య, మద్దాళి కృష్ణమూర్తి, బాలకృష్ణ పద్మనాభం నటించారు.

ఇందులోని ఊహాసన్నివేశంలో సుభద్ర, అర్జునుల యుగళగీతం ‘ఈనాటి ఈ హాయి, కలకాదోయి నిజమోయి’ కోసం సంగీత దర్శకుడు టి.వి.రాజు పద్దెనిమిది వరసలు సమకూర్చారు. ‘జయజయ శ్రీరామా’, ‘మదిలోని మధురభావం’ వంటి పాటలు హిట్ అయ్యాయి. ఎం.ఏ.రెహమాన్ ఛాయాగ్రహణం చిత్రానికి నిండుదనాన్ని తెచ్చింది. 21.10.1955న విడుదలైన జయసింహ’ చిత్రం ఆర్థికంగా ఘనవిజయం సాధించి ఎన్.ఏ.టి. సంస్థకు కొత్త ఊపిరిపోసింది.

Source: 101 C, S V Ramarao

Spread the love:

Comments