February 15, 2020

Gruhapravesam (1946): Legendary L V Prasad’s Debut Film #TeluguCinemaHistory

Gruhapravesam (1946): Legendary L V Prasad’s Debut Film #TeluguCinemaHistory

తీవ్రమైన సాంఘిక సమస్యకు పంచదారపాకం వంటి హాస్యాన్ని రంగరించి, చేదు మాత్రకు తీపి కోటింగ్ ఇచ్చి సినిమాల్ని తీయటంలో సిద్ధహస్తుడు యల్. వి. ప్రసాద్. ఇందుకు పెళ్లి చేసి చూడు (వరకట్న సమస్య), మిస్సమ్మ (నిరుద్యోగ సమస్య) మంచి ఉదాహరణలు. కాగా ఈ తరహా ట్రీట్మెంటుకు బీజం ఆయన మొదటి చిత్రం ‘గృహప్రవేశం’ తోనే ప్రారంభమైంది.

అనగనగ ఓ సోమలింగం కథానాయకుడు, అతడు మహిళాద్వేషి, స్త్రీలకు హక్కులు ఉండరాదంటాడు. ఇందుకు హీరోయిన్ జానకి పూర్తి వ్యతిరేకం. హాయిగా బాడ్మింటన్ ఆడుతూ, అటు సవతితల్లి ఆరళ్ళను ఎదురిస్తూ, ఇష్టం లేని పెళ్లి తప్పించుకోవటం కోసం ఇల్లు వదిలివచ్చి హీరో ఇంట్లో ఆశ్రయం కోసం ప్రవేశిస్తుంది. ఆ తరువాత ఆ ఇద్దరి మధ్య కావలిసినంత డ్రామా. చివరకు ఆ కథానాయకుడు జానకితో పాణిగ్రహణం. సంసారిగా గృహప్రవేశం చేయటం. ఈ కథతోబాటు సవతితల్లి తమ్ముడు ఫారిన్ మనిషిగా ఫోజులు పెట్టె రమణారావు. అతనికొక ప్రియురాలు,.అయినాసరే అక్క వత్తాసుతో జానకిని పెళ్లి చేసుకోవాలనే ప్రయత్నం. అందులో భాగంగా పాటలు పాడటం, చివరికి భంగపడటం. ఈ ఉపకథ కూడా అసలు కథతో మిళితమై నడుస్తుంది.

Click Here to go to Gruhapravesam (1946) Movie Page.

ఈ సినిమాకు రచయిత గోపీచంద్. ఆయనే దర్శకత్వం వహించి ఉండాల్సింది. అయితే చిత్రేవ్యాపారానికి చెందిన ఒక వర్గంనుంచి అభ్యంతరం ఎదురవ్వటంతో బొంబాయి నుంచి యల్. వి. ప్రసాద్ ను రప్పించి ఈ చిత్ర బాధ్యతలు అప్పజెప్పారు. అంతేకాదు, అంతకముందు కొన్ని సినిమాల్లో నటించి ఉండటంచేత హీరో పాత్ర కూడా ఆయనే నిర్వహించారు. కథానాయిక భానుమతి, ఇతర పాత్రల్లో హేమలత, శివరావు, జూనియర్ శ్రీ రంజని నటించారు. హాస్యం కలగలిసిన విలన్ రమణారావుపాత్రను సి. ఎస్. ఆర్. ఆంజనేయులు వైవిధ్య సామర్థ్యంతో పోషించటమేగాక ‘జానకి నాదేనోయ్’ అంటూ స్టైల్గా పాట పాడారు కూడా! 

జతిన్ బెనర్జీ  ఛాయాగ్రహణం నిర్వహించగా పాటల్ని రాసి స్వరపరిచిన ఘనుడు బాలాంత్రపు రజనికాంతరావు. అయితే కారణాంతరాలవల్ల  అతని సోదరుడు ‘నళినికాంతరావు’ పేరు వేశారు. ఈ చిత్రానికి పెండ్యాల నాగేశ్వరరావు సహాయ సంగీత దర్శకులుగా పనిచేశారు.

భానుమతి పాడిన ‘అమ్మా నీ నయనమ్ముల ఆశాజ్యోతులు నిండుగా వెలిగే నమ్మా, మేలుకో ఓ భారతనారి’ యం.ఎస్. రామారావుతో కలిసి పాడిన ‘హాలాహలమే ఎగయునో’ అన్న గీతాలు ప్రాచుర్యం పొందాయి.

చలం, శ్రీ పాద సుబ్రమణ్యశాస్త్రీ వంటి ఎందరో రచయితలు, సంస్కర్తలు కోరిన మహిళాభ్యుదయానికి ఈ చిత్రం వత్తాసు పలికింది. ఈ చిత్రంలో పాత్రలు, సన్నివేశాలు తరువాత వచ్చిన అనేక చిత్రాల్లో మరోరూపంలో దర్శనమిచ్చాయి. సాంఘిక ప్రయోజనంతోపటు ఆర్ధిక విజయాన్ని సాధించిన సారధి చిత్రం ‘గృహప్రవేశం’!

Source: 101 C, S V Ramarao

Spread the love:

Comments