2.10.1952న అక్కినేని నాగేశవరరావు చైర్మన్గా, దుక్కిపాటి మధుసూదనరావు మేనేజింగ్ డైరెక్టరుగా, కె.శ్రీనివాసరావు, టి.వి.ఏ.సూర్యారావు, కొరటాల ప్రకాశరావు డైరెక్టర్లుగా ప్రారంభమయిన చిత్రనిర్మాణ సంస్థ అన్నపూర్ణా పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్. అది జరిగిన మూడు సంవత్సరాలకు అంటే 1.10.1955న ఆ సంస్థ నిర్మించిన తొలిచిత్రం ‘దొంగరాముడు’ విడుదలయింది. సంస్థ పేరు అన్నపూర్ణ, అక్కినేని అర్థాంగి పేరు మధుసూదనరావు తల్లిపేరు అన్నపూర్ణ కావడం యాదృచ్చికం.
Click Here to go to Donga Ramudu (1955) Movie Page.
చిత్ర నిర్మాణానికి మూడుసంవత్సరాలు పట్టిందంటే అశ్చర్యం కలగవచ్చు కానీ దీని నిర్మాణానికి ఒక సంవత్సరమే పడితే, ఆ చిత్ర దర్శకులు కె.వి.రెడ్డి కోసం రెండు నంవత్సరాలు ఆగాల్సొచ్చింది. అయితే ఆ కాలం స్క్రిప్ట్ వకడ్పందీగా రూపొందించుకోవడానికి ఉపయోగపడింది.
‘లవింగ్ బ్రదర్’ అనే చిన్న ఆంగ్లకథను తీసుకుని బ్రదర్ సెంటిమెంటును, సిస్టర్ సెంటిమెంటుగా మార్చి అన్నాచెల్లెళ్ళ అనుబంధంమీద వున్న కథకు దర్శకులు కె.వి.రెడ్డి నిర్మాత మధుసూదనరావు, రచయిత డి.వి.నరసరాజు ముగ్గురూ కలిసి స్క్రీన్ ప్లే రూపొందించారు.
రామూ, లక్ష్మి అన్నాచెల్లెళ్లు. చిన్నచిన్న అబద్దాలు చెప్పి పెద్ద చిక్కుల్లో పడడం రామూకి చిన్నప్పుడే అలవాటయింది. చెల్లెలంటే ఎంతో ప్రేమ. దీపావళి పండుగరోజున చెల్లెలికి అనందం కలిగిస్తాడు. ఆ టపాకాయల చప్పుడుతో తల్లి షాక్కు గురవుతుంది. తల్లి ఆరోగ్యంకోసం మందులు దొంగిలించిన నేరానికి పోలీసులు రామును అరెస్టు చేసి బాలనేరస్థుల జైలుకు పంపుతారు. తల్లి మరణించగా, చెల్లెలు లక్ష్మిని శరణాలయంలో చేర్పిస్తాడు టీచరు.

రాము పెద్దవాడై తిరిగి వచ్చి పరిస్థితి తెలుసుకుంటాడు. పిసినారి వీరభద్రయ్య కొడుకును రౌడీ బాబుల్ నుంచి రక్షించి, వారింట్లో నౌకరీ సంపాదించి, అక్కడకు వచ్చిన కూరలమ్యే కథానాయిక సీతను అల్లరి చేయబోయిన బాబుల్ను ఫ్రీ స్టయిల్ పోరాటంలో ఓడిస్తాడు. చిన్నప్పుడు చదువు చెప్పిన మాస్టారివల్ల చెల్లెలి జాడ తెలుసుకుని అక్కడకు అద్దె సూట్లో వెళ్ళి తాను భాగ్యవంతుడ్ని గొప్పలు చెప్పి చెల్లెలికి ఆర్థికంగా సహకరిస్తానంటాడు. ఆమాట నిలుపుకోవడంకోసం వీరభద్రయ్య ఇంట్లో డబ్బుని దొంగిలిస్తాడు. ఈ డబ్బుని దొంగిలిస్తాడు. ఈ విషయంలో బాబుల్కు, రాముడికి దోస్తి కుదురుతుంది.
తరువాత దొంగతనం బైటపడి రాముడు జైలుకు వెళతాడు. ఈ సంగతి తెలిసి సీత బాధపడుతుంది. శరణాలయంనుంచి బయటకు పంపబడ్డ లక్ష్మికి ఒక డాక్టర్ ఆశ్రయం లభిస్తుంది. విధివశాత్తూ ఆ డాక్టర్ వద్దే జైలునుంచి తిరిగివచ్చిన రాముడు డ్రైవర్ గా పనిచేస్తాడు.
ఒకసారి ఆ ఇంట్లో వాచీ పోగా ఆ నేరం పాత నేరస్థుడయిన రాముడు చేశాడని అతన్ని అవమానిస్తారు. ఇది చూసి లక్ష్మి బాధపడుతుంది. లక్ష్మికి డాక్టర్తో పెళ్లి నిశ్చయమవుతుంది. రాముడు మారువేషంలో పెళ్ళికి వెళతాడు. అదే సమయానికి బాబుల్ వీరభద్రయ్యను హత్య చేస్తాడు. ఆ నేరం కూడా రాముడిమీద పడుతుంది. సీత చాకచక్యంగా బాబుల్ చేత నిజం చెప్పించడంతో పోలీసులు బాబుల్ని అరెస్ట్ చేసి రాముణ్ణి విడుదల చేస్తారు. రాముడు, సీతల వివాహంతో కథ ముగుస్తుంది.
బరువైన కథను హాస్యంతో రంగరించి ట్రీట్మెంట్ తయారుచేయడంతో ఆధ్యంతం హుషారుగా సాగుతుంది. ముఖ్యంగా నరసరాజుగారి సరస సంభాషణలు చిత్రానికి ప్రాణం పోశాయి. పిసినారి వీరభద్రయ్యచేత ‘సంతర్పణ చేస్తే పదిమంది తినిపోతారు, ఆకు పూజయితే సరాసరి అమ్మవారికి దక్కుతుంది. ఆకుపూజే ఖాయం’ అనిపిస్తారు. అలాగే పూటకూళ్ళమ్మ భోజనం సీను, పొడుపుకథల సన్నివేశం చిత్రాన్ని రక్తి కట్టించాయి.
ప్రధాన పాత్రల్ని అక్కినేని, సావిత్రి నవరస భరితంగా పోషించి, హిట్ పెయిర్ అనిపించారు. లక్ష్మిగా జమున, డాక్టర్ గా జగ్గరయ్య, వీరభద్రయ్యగా రేలంగి, అతని భార్యగా సూర్యకాంతం, బాబుల్గాడి దెబ్బ అంటే గోల్కొండ అబ్బ అనాలి అనే మేనరిజమ్తో బాబుల్గా ఆర్.నాగేశ్వరరావు అద్భుతంగా నటించారు. ఇతర సహాయ పాత్రల్ని రామన్నపంతులు, బొడ్డపాటి, అల్లు రామలింగయ్య, వంగర, మాస్టర్ వర్మ బేబీ విజయలక్ష్మి హేమలతమ్మారావు, మద్దాలి కృష్ణమూర్తి, బాలకృష్ణ పద్మనాభం పోషించారు. మిక్కిలినేని, చలం అతిధిపాత్రల్లో కనిపించారు.
సముద్రాల రాఘవాచార్య రచనతో పెండ్యాల నాగేశ్వరరావు స్వరపరిచిన గీతాలన్నీ ఎంతో హాయిగా శ్రోతల్ని ఆకట్టుకున్నాయి. తెలిసిందా బాబు, అందచందాల సొగసరివాడు, చిగురాకులలో చిలకమ్మా, చెరసాల పాలయినావా, భలే తాత మన బాపూజీ, లేవోయి చిన్నవాడా’ నృత్యగీతం చెప్పుకోదగ్గవి. అయితే క్లైమాక్స్ సన్నివేశంలో సావిత్రి ఆర్.నాగేశ్వరరావులపై చిత్రీకరించిన ‘రారోయి మా యింటికి’ పాట మాస్ను ఆకట్టుకోగా సుశీల పాడిన ‘అనురాగము విరిసేనా’ పాట మెలోడీపరంగా ఎన్నదగింది. అది. యం.ఇరానీ ఛాయాగ్రహణం చెప్పుకోదగ్గదే! చిత్రంలోని ప్రతి సన్నివేశం కె.వి.రెడ్డి చేతిలో అద్భుతంగా మలచబడింది.
శతదినోత్సవం జరుపుకొన్న ఈ చిత్రాన్ని ‘తిరుట్టురామన్’ పేరుతో తమిళంలోకి డబ్ చేశారు. ‘మన్ మాజి’ పేరుతో కిశోర్ కుమార్, మీనాకుమారితో హిందీలో నిర్మించారు.
హీరో నాగేశ్వరరావు ఈ చిత్రంలో దొంగగా నటించారు. అయితే విజయవాడలో ఈ చిత్రం శతదినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన జేబులోని పర్సును ఎవరో దొంగ తస్కరించడం విశేషం!
Source: 101 C, S V Ramarao