1947లో వాహినీ పతాకంపై కె.వి.రెడ్డి అందించిన ‘యోగివేమన’ చిత్రం నాగయ్య నటజీవితంలో కలికితురాయిగా నిలిచిపోయింది.
కథాంశం 17వ శతాబ్దానికి చెందినది రెడ్డిరాజుల వంశానికి చెందిన అనవేమారెడ్డి ఒక పరగానాకు సామంతప్రభువు. అతని తమ్ముడు (వేమన) చిత్రకథకు నాయకుడు. అన్న కూతురు జ్యోతి అంటే వేమనకు పంచప్రాణాలు. మోహనాంగి అనే వేశ్యతో వేమన సంపర్కం పెంచుకుంటాడు. వదినగారి బంగారుహారాన్ని దొంగలించి మోహనాంగికి బహుమతిగా ఇస్తాడు. అక్కడితో ఆగక అన్నగారు ప్రభుత్వానికి చెల్లించవలసిన ధనాన్ని కైంకర్యం చేస్తాడు. ఫలితంగా అన్న జైలుపాలవుతాడు.ఇలా ఉండగా వేమన మిత్రుడైన అభిరాముని సహాయంతో బంగారం తయారుచేయడంలో సఫలీకృతుడౌతాడు. అయితే కథ ఇక్కడే అద్భుతమైన మలుపు తిరుగుతుంది.
Click Here to go to Yogi Vemana (1947) Movie Page.
వేమన ప్రాణప్రదంగా భావించిన చిన్నారి జ్యోతి మరణిస్తుంది. అంతే… వేమన జీవితంలో నిర్వేదం ఆవహిస్తుంది. ఫలితంగా ఇహలోక బంధాలకు దూరమై లోకంలోని సత్యాలను పండిత పామరులకు అర్థమయ్యేరీతిలో ‘విశ్వదాభిరామ వినురవేమ’ అనే మకుటంతో వందలాది పద్యాలు వ్రాసి చివరకు సమాధిలోకి వెళతాడు. సూక్ష్మంగా ఇది కథ.
వేమన పాత్రలో తాదాత్మ్యం చెంది నటించారు నాగయ్య. ఆయన సమాధిలోకి వెళ్లిన దృశ్యం చిత్రీకరిస్తున్నప్పుడు అందరూ సన్నివేశంలో లీనమైపోయారు. దర్శకులు కె.వి.రెడ్డి ‘కట్’ చెప్పలేదు. బిలం లోపల్నుంచి నాగయ్య కేకవేయగా, అప్పుడు దర్శకులు తెప్పరిల్లి ‘కట్’ చెప్పారట! ఇతర ముఖ్యపాత్రల్లో లింగమూర్తి యం.వి. రాజమ్మ, పార్వతీబాయి, కాంతమ్మ, రామిరెడ్డి, దొరస్వామి, బేబీ కృష్ణవేణి నటించారు.
సముద్రాల రాఘవాచార్య రచన చేయగా నాగయ్య సంగీతాన్ని సమకూర్చారు. ఓగిరాల రామచంద్రరావు సహకరించారు. మార్క్స్ బార్ట్లేయ్ ఛాయాగ్రహణం ముఖ్యంగా పతాక సన్నివేశంలో (వేమన మహాభినిష్క్రమణ) ఫోటోగ్రఫీ పరంగా తెరకు మలిచిన తీరు అపూర్వం. ‘ఇదేనా, ఇంతేనా’ అంటూ వేమనతత్వం రీతిలో పాడినపాట, జ్యోతికి జ్వరం వచ్చినప్పుడు ‘అందాలు చిందేటి జ్యోతి, ఆ కంటిలో, ఈ కంటిలో జ్యోతి’ అన్నపాట, ‘ఆపరాని తాపమాయెరా, వదలజాలరా, నా వలపు దీరుపురా’ అంటూ యం.వి.రాజమ్మ చేసిన నృత్యగీతాలు చెప్పుకోదగ్గవి.
కామిగాక మోక్షగామికాడు అన్న సూక్తిని అక్షరసత్యం అని నిరూపించిన మహత్తర జీవితం వేమనది. దానిని అసామాన్య చిత్రంగా మలచి ధన్యులయ్యారు కె.వి.రెడ్డి.
తెలుగువారి అదృష్టంకొద్దీ మహానటుడు నాగయ్యకు నటరాజ వరంలా లభించిన మూడు మహత్తర పాత్రలు పోతన, త్యాగయ్య, వేమన. వాటిని అనితరసాధ్యం అనేవిధంగా పోషించారు నటయోగి నాగయ్య. ఈ విషయాన్ని ఆ తరువాత అదే పేరుతో వచ్చి పరాజయం పొందిన మూడు చిత్రాలు నిజమని నిరూపించాయి.

Source: 101 C, S V Ramarao