10.12.1954 న విడుదలైన చిత్రం విప్రనారాయణ. ఈ కథతో కాంచనమాల-కస్తూరి నరసింహారావు ప్రధాన పాత్రల్లో 1937లో ఓ చిత్రం వచ్చింది. దీనిని బి.ఎన్. రెడ్డి కూడా తీయాలనుకుని దేవులపల్లి చేత స్క్రిప్ట్ రాయించి తరువాత విరమించి ‘మల్లీశ్వరి’ తీశారు.
Click Here to go to Vipranarayana (1954) Movie Page.
విప్రనారాయణ శ్రీరంగని భక్తుడు. ఆ రంగనాథుడ్ని పూలదండలతో అలంకరించి, పూజించి తరించాలనే భక్తాగ్రగణ్యుడు. నర్తకి దేవదేవి అందించిన నమస్కారాన్ని అన్యమనస్కుడైన విప్రనారాయణుడు గమనించడు. దాంతో ఆమెలోని అహంకారం పడగ విప్పి ఎలాగైనా అతన్ని తన పాదదాసుణ్ణి చేసుకుంటానని తన సోదరితో పందెం వేస్తుంది. భక్తినెపంతో ఏకాకినని చెప్పి విప్రనారాయణుని ఆశ్రయం సంపాదిస్తుంది. అందుకు విప్రనారాయణుని ప్రియసచివుడు గంగరాజు అడ్డు తగిలినా లాభంలేకపోయింది.
ఇక అసలు కథ మొదలవుతుంది. దేవదేవి నెరజాణ… వేశ్య. నాట్యం, హొయలు, నయగారాలు. అమాయకంగా కళ్ళబాషతో కవ్వించటమే ఆమెకు వెన్నతో పెట్టిన విద్య. విప్రనారాయణునితో మెల్లగా సంచలనం కలిగిస్తూ అక్కడున్న మూడో వ్యక్తి రంగరాజుకు ఉద్వాసన కలిగిస్తుంది.
భక్తినుంచి రక్తివైపు విప్రనారాయణుని మళ్లించిన సన్నివేశం అపూర్వం. వర్షానికి తడిసిన జ్వరం సెగలతో రగిలిపోతున్న విప్రనారాయణునికి దేవదేవి శీతలగంధం రాసే ప్రయత్నంలో, తొలిసారి స్త్రీ స్పర్శ అనుభూతి పొందిన ఆ భక్తునితో రక్తి ప్రారంభమైన ఆమెకు దాసుడౌతాడు. ఆమె లేనిదే క్షణమయిన నిలవలేనిస్థితికి చేరతాడు.
దైవం ఆడిన నాటకంవల్ల విప్రనారాయణునిపై దొంగతనం మోపడం, రాజసభలో విచారణ, శిక్షపడగా, పతాక సన్నివేశంలో భక్తి పారవశ్యంలో నాయికానాయకులిద్దరు భగవంతునిలో ఐక్యమౌతారు.
అప్పట్లో విప్రనారాయణునిగా అక్కినేని ఎంపికకు కొందరు విమర్శించారు. దర్శకులు కె.వి. రెడ్డి కూడా “నువ్వు నాస్తికుడివి. విప్రనారాయణుని పాత్ర ధరిస్తే వెలితిగా ఉండొచ్చు” అని అక్కినేనితో అన్నారు. అయితే దేవదాసు ఇటువంటి సవాలును అధిగమించిన అక్కినేని పట్టుదలతో పాత్రను అటు నిష్టాగరిష్ఠుడైన తపోధనునిగాను, ఇటు దేవదేవి వియోగాన్ని భరించలేని పూజారిగాను అద్భుతంగా నటించి ఆ విమర్శలు చేతనే ‘ఔరా’ అనిపించుకున్నారు.
దేవదేవి పాత్రలో భానుమతి కపటభక్తురాలిగా, కథానాయకుణ్ణి మాటల్లోకి దింపే జానగా, చివరిభాగంలో పస్చాత్తాపంతో పరితపించే భక్తురాలిగా నిండుగా నటించారు. రంగరాజుగా రేలంగి, మహారాజుగా సౌండ్ ఇంజనీర్ పి. శివరాం, వేశ్యమాతగా రుషేంద్రమణి, సోదరిగా సంధ్య తమ పాత్ర పరిధులమేరకు న్యాయం చేశారు.
విప్రనారాయణ పేరు చెప్పగానే గుర్తుకువచ్చే సాలూరు రాజేశ్వరరావు, సముద్రాల కంబినేషన్లో రూపుదాల్చిన అమృతతుల్యమైన గీతామాలికలు. జయదేవుని అష్టపది ‘సావిరహేతవదినా’, ‘ఎందుకోయీ తోటమాలి’ గీతాలు భానుమతి గళంలో చిత్రవిచిత్ర గమకాలూ పలికిస్తే, ఏ.యం.రాజా ఆలపించిన ‘పాలించరా రంగా, చూడుమదే చెలియా’ గీతాలు, వారిద్దరూ ఆలపించిన ‘మధురమధురమీ చల్లని రేయి’ అన్న యుగళగీతం. ‘అనురాగాలు దూరములాయెనా’ అన్న విషాదగీతం సంగీతప్రియుల్ని ఎంతగానో అలరించాయి. రెహ్మాన్ ఛాయాగ్రహణం చిత్రానికి నిండుతనాన్ని తెచ్చింది. ఈ చిత్రానికి రాష్ట్రపతి యోగ్యతాపత్రం కూడా లభించింది.

Source: 101 C, S V Ramarao