అటు వాహిని సంస్థకు, ఇటు దర్శకునిగా బి.ఎన్.రెడ్డి కి తొలి చిత్రము ‘వందేమాతరం’. ఈ చిత్రం అవుట్ డోర్ షూటింగ్ కొంత భాగం హంపిలో జరిగింది అప్పుడు విరూపాక్ష స్వామి ని దర్శించిన బి.ఎన్.రెడ్డి ‘ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని పాలించిన శ్రీ కృష్ణ దేవరాయలు ఈ స్వామిని దర్శించాడు గదా! నేను ఉన్న చోటే ఉండి పూజించాడు గదా! ఆయన మీద ఎప్పటికైనా చిత్రం తీయాలి’ అనే మధుర భావన ఆయన మదిలో మెదిలింది. ఇది 1939 లో జరిగింది. సరిగ్గా ఒక పుష్కర కాలానికి అంటే 1951 నాటికి బి. యన్. కల ఫలించి ‘మల్లీశ్వరి’ రూపంలో ఆంధ్ర ప్రేక్షక హృదయాలలో మనోహర దృశ్యకావ్యమై సాక్షాత్కరించింది.
Click Here to go to Vandemataram (1939) Movie Page.
ఇక అసలు విషయానికి వస్తే ‘వందేమాతరం’ టైటిల్ వినగానే ఇదేదో రాజకీయ వాసన ఉన్న చిత్రమని భ్రమించినా అందుకు తగ్గట్టుగా చిత్రంలో ఒక సన్నివేశంలో కథానాయకుడు ప్రభుత్వం ఇచ్చిన డిగ్రీని తగులబెట్టినా, నిజానికి ఇందులో రాజకీయ ప్రమేయం ఏమీలేదు. ఇందులో వరకట్న దురాచారాన్ని ఖండించే సామాజిక పరమైన అంశం ప్రధాన పాత్ర వహిస్తుంది.

రఘు డిగ్రీ పొందిన నిరుద్యోగి. కట్నం కోసం ఆశించే తల్లి మాటను లెక్కచేయక నిరుపేద యువతి జానకిని పెళ్లి చేసుకుంటాడు. ఉద్యోగం కోసం భార్యను వదిలి మద్రాస్ చేరి ‘వందేమాతరం’ అనే పేరు మీద లాటరీ టిక్కెట్టు కొనగా ఐదు లక్షలు వస్తుంది. ఈలోగా రఘు తల్లి, కోడల్ని నానా ఆరళ్ళు పెడుతుంది. ఫలితంగా జానకి పుట్టిన బిడ్డ తో సహా ఊరు వదిలి వెళ్ళిపోతుంది.
లాటరీలో గెలిచిన రఘు ఇంటికి రాగా భార్య కనిపించక నిరాశ ఎదురవుతుంది. తిరిగి మద్రాసు చేరి ఫ్యాక్టరీ పెట్టి నిరుద్యోగుల్ని ఆదుకుంటాడు. ఈ సందర్భంగా ఒక అమ్మాయి తో చనువుగా ఉంటాడు. పట్టణానికి వచ్చిన జానకి పూలు అమ్ముతూ భర్తను మరో యువతితో చూసి అపార్థం చేసుకుంటుంది. చివరకు దంపతులు ఏకమవుతారు.
‘మంగళ సూత్రం’ పేరుతో బి. యన్. రాసుకున్న చిన్న కథ ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. వాహినీలో భాగస్తుడైన కెమెరామెన్ కే. రామనాథ్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే రాయగా, సముద్రాల రాఘవాచార్య రచన చేశారు. నాగయ్య సంగీతాన్ని అందించారు.
ఇందులో నాగయ్య, కాంచనమాల ప్రధాన పాత్రలు పోషించగా లింగమూర్తి, కళ్యాణి, శేషమాంబ, ఉష, సీనియర్ శ్రీరంజని సహాయ పాత్రలు నిర్వహించారు. అప్పట్లో ఈ సినిమా కొన్ని చిన్న చిన్న సెన్సార్ సమస్యల్ని ఎదుర్కోవలసి వచ్చింది. అందం, అమాయకత్వం కలబోసిన కాంచనమాల నటన, నాగయ్య గారి కమనీయ సంగీతం చిత్ర విజయానికి దోహదం చేశాయి.

Source: 101 C, S V Ramarao