1942లో వచ్చిన ‘భక్తపోతన’ నాగయ్యను గొప్ప నటుడుగా నిరూపిస్తే ఆయన నటజీవితాన్నిధన్యం చేసిన మరో రెండు చిత్రాలు త్యాగయ్య (1946). యోగివేమన (1947). నాగయ్య స్వీయదర్శకత్వంలో రేణుక పిక్చర్స్ పతాకంపై నిర్మించిన చిత్రం త్యాగయ్య అయితే అంతకు ముందు ఆ చిత్రకథ గూర్చి ఆయన రెండేళ్లు శ్రమించి విషయసేకరణ చేశారు.
తిరువయ్యారు వెళ్లి త్యాగయ్య జీవితవిశేషాన్ని సేకరించి, తంజావూరు గ్రంధాలయంనుంచి మరిన్ని వివరాలు తెల్సుకొని పవిత్ర కావేరినదిలో స్నానమాచరించి, నిష్ఠతో స్క్రిప్టును సిద్ధం చేసుకున్నారు. ‘ఎమిలీజులా’ చిత్రంకోసం నటుడు పాల్ ముని అంతగానూ శ్రమించాడు. అందుకే నాగయ్యను ఇండియన్ పాల్ మునిగా అభివర్ణించారు.
Click Here to go to Tyagayya (1946) Movie Page.
ఈ చిత్రానికి సంగీతం భాధ్యతను కూడా నాగయ్య స్వీకరించి అజరామరమైన స్వరాల్ని అందించారు. సముద్రాల రాఘవాచార్య రచన చేయగా ఎం.ఎ. రెహ్మాన్ ఛాయాగ్రహణం సమకూర్చారు. ఈ చిత్రనిర్మాణం జరిగినన్ని రోజులు రేణుకా ఆఫీసు సంగీతపరమయిన చర్చలలో ద్వారం వెంకటస్వామినాయుడు, విశ్వనాధ్ అయ్యర్, మణి అయ్యర్, బెంగళూరు నాగరత్నమ్మ వంటి హేమాహేమీలు పాల్గొనేవారు.
తంజావూరు మహారాజు సర్పోజీ ఆహ్వానాన్ని తిరస్కరించిన త్యాగయ్య ‘ నిధి కన్నా రాముని సన్నిధి సుఖమని’ యొంచి ఆ అవతార పురుషుని కీర్తిస్తూ 24 వేల కీర్తనలు రచించి, స్వరపరచి గానం చేశాడు. దీనికి కినుక వహించిన మహారాజు ప్రోత్సాహంతో త్యాగయ్య సోదరుడు జపెశం రాముని విగ్రహాన్ని కావేరీ నదిలో పారవేస్తాడు . రాముని కీర్తిస్తూ త్యాగయ్య జీవితాన్ని అంకితం చేసుకుంటాడు. ఈ చిత్రంలో ఇతర ముఖ్య పాత్రల్లో లింగమూర్తి, జయమ్మ, హేమలత, రాజ్యం, సబితా దీవి పోషించారు.
అజరామరమైన సంగీతంతో ఈ చిత్రం ఆబాలగోపాలాన్ని అలరించడమేకాక ఆర్థికంగా అఖండ విజయాన్ని సాధించింది. మైసూర్ మహారాజా తన భవనంలో ప్రత్యేకంగా ఈ చిత్రాన్ని చూసి నాగయ్యను వెండి శాలువాతో , బంగారు నాణాలతో శ్రీరామచంద్రుడి బొమ్మ ఉన్న బంగారు నెక్లెస్తోను సత్కరించారు. అలాగే తిరువనురు మహారాజు నాగయ్య ను ఆహ్వానించి పాదపూజ చేసి ‘ అభినవ త్యాగరాజు’ బిరుదుతో సన్మానించారు. నిజంగా ఇది ఏ తెలుగు నటుడికి దక్కని అపూర్వ గౌరవం. ” ఆర్టిస్టుగా నేను ఇంతకంటే కోరుకునేది ఏముంటుంది” అని ఆనందించిన నాగయ్య తిరువయ్యురులోని సంగీత కళాశాలకు తన ఆస్తిలో చాలా భాగాన్ని దానం చేశారు. ‘త్యాగయ్య’ చిత్రానికి ముందు తెలుగు సినిమాలో ఎక్కువగా హిందుస్తానీ సంగీతం వినిపించేది. ఇది సంగీతపరంగా ‘త్యాగయ్య’ సాధించిన ఘనవిజయం.

Source: 101 C, S V Ramarao