April 10, 2020

Todu Dongalu (1954): Award Winning Feature #TeluguCinemaHistory

Todu Dongalu (1954): Award Winning Feature #TeluguCinemaHistory

గ్లామరస్ పాత్రల్లో హీరోగా రాణిస్తున్న తరుణంలో వయసు మళ్ళిన డీగ్లామర్, అందునా నెగటివ్ టచ్ ఉన్న పాత్ర పోషించడం, మెప్పించటం సాహసమే! ఆ సాహసాన్ని చేసి పరిశ్రమ చేత, ప్రేక్షకుల చేత, విమర్శకుల చేత ఆహా అనిపించుకున్న విశిష్ట నటుడు ఎన్. టి. రామారావు, ఆ చిత్రం ఎన్. ఎ. టి. పతాకం పై నిర్మించిన ‘ తోడుదొంగలు’. ఇందులో రామారావు సరసన ఆయనకు ధీటుగా గుమ్మడి వెంకటేశ్వరరావు. వీరిద్దరే ‘ తోడుదొంగలు’. ఆ చిత్రాన్ని ప్రత్యేకంగా చూసిన అక్కినేని రామారావుతో ‘ అదేమిటి బ్రదర్ ఆ టైటిల్ మనిద్దరికీ సరిపోతుందిగదా’ అని చమత్కరించారట.

Click Here to go to Todu Dongalu (1954) Movie Page.

ఇహ అసలు కథ విషయానికొస్తే అన్నపూర్ణ రైస్ మిల్ కు యజమాని లోకనాథం (గుమ్మడి). అతని వద్ద గుమాస్తా పరమేశం ( ఎన్. టి. ఆర్). వీరిద్దరూ తోడుదొంగలు. ఒకరోజు కరెంట్ షాక్ వల్ల ఆ మిల్లు కార్మికులు రాముడు మరణిస్తాడు. వీళ్ళిద్దరూ రాముడు శవాన్ని ఎవరికీ తెలియకుండా కారులో తీసుకెళ్లి కొండ మీద నుంచి కిందకిపడేస్తారు. ఆ తరువాత గిల్టీ గా ఫీలయ్యే పరమేశం కు గుండె జబ్బు వస్తుంది. చచ్చిన రాముడు ప్రేతాత్మ గా పరమేశం అంతరాత్మను పీడిస్తాడు. వైద్యులు, జ్యోతిష్కులు అంతా పరమేశం ఒక నెల కంటే ఎక్కువ కాలం బతకడని హెచ్చరిస్తారు. ఆ నెల రోజులు హాయిగా బతకాలని పట్నానికి వెళతాడు పరమేశం. అక్కడ ఆదర్శంగా జీవిస్తున్న ఒక యజమానికార్మికున్ని చూస్తాడు. దీనితో పరివర్తన చెందిన పరమేశం తన ఊరికి తిరిగి వచ్చి తన యజమానికి నచ్చచెప్పి చనిపోయిన రాముడు కుటుంబానికి రెండు వేలు  నష్టపరిహారం ఇప్పిస్తాడు. యజమాని కూడా మిల్లు తాళం చెవులు పరమేశా నికిఅప్పగిస్తాడు.

ఈ కథలో అంతర్లీనంగా నడిచే నీతికి, అంతరాత్మ సంఘర్షణకు ప్రాధాన్యత ఎక్కువ. అవినీతికి ఒడిగట్టాక సుఖశాంతులకు దూరమై ఏ విధంగానూ ఆనందం పొందలేని పరమేశం కలలో నరలోక యాత్ర చేయటం, బాధితుని కుటుంబానికి సహకరించగానే మనసు కుదుటపడటం ఈ అంశాలన్నింటినీ తన అపూర్వ నటన ద్వారా అద్భుతంగా ఆవిష్కరించారు ఎన్. టి. రామారావు. ఆయనతో సమవుజ్జీగా నటించారు గుమ్మడి వెంకటేశ్వరరావు.

ఇతర సహాయ పాత్రల్లో టి. జి. కమలాదేవి, మద్దాలి కృష్ణమూర్తి, హేమలత, చలం, పుండరీకాక్షయ్య, డా. శివరామకృష్ణయ్య నటించారు.

డి. యోగానంద్ దర్శకత్వంలో రూపొందిన ఈ విలక్షణ చిత్రానికి జూనియర్ సముద్రాల మాటలు, పాటలు రాయగా టీవీ రాజు సంగీతాన్ని సమకూర్చారు. ఎం.ఎ. రెహమాన్ ఛాయాగ్రహణం నిర్వహించారు.

ఎన్. టి. పతాకంపై నందమూరి సోదరులు నిర్మించిన తొలి చిత్రం ‘పిచ్చి పుల్లయ్య’. మరో చిత్రం ‘తోడుదొంగలు’ ఆర్థికంగా చేదు అనుభవాన్ని మిగల్చగా మూడవ ప్రయత్నంగా ఎన్.టి.ఆర్. కత్తి చేతబట్టి విజయం సాధించిన చిత్రం ‘జయసింహ’. అయితే పరాజయం పొందిన ‘తోడుదొంగలు’ సాంకేతిక వర్గానికి ‘జయసింహ’లో అవకాశం కల్పించడం ఎన్.టి.ఆర్. విశాల దృక్పథానికి, ఉదాత్త సంస్కారానికి నిదర్శనం.

15.4. 1954 న విడుదలైన ‘తోడుదొంగలు’ చిత్రానికి రాష్ట్రపతి యోగ్యతాపత్రం లభించింది.

ఈ చిత్రాన్ని నాగేశ్వరరావు గారికి ప్రత్యేకంగా షో వేసి చూపించారు, ఎన్.టి. రామారావు. అది చూసి అక్కినేని, ఎన్.టి.ఆర్ తో ” మీరు, గుమ్మడి బాగా నటించారు కానీ ఇండస్ట్రీలో మనిద్దరం కదా తోడు దొంగలం” అని చమత్కరించారట.

Source: 101 C, S V Ramarao

Spread the love:

Comments