1941లో రోహిణీ పతాకంపై దర్శక నిర్మాత హెచ్.ఎం.రెడ్డి రూపొందించిన ‘తెనాలి రాముకృష్ణ’ చిత్రం ప్రజాదరణ పొందింది. అందులో యస్.పి.లక్ష్మణస్వామి ప్రధాన పాత్ర పోషించగా యల్.వి.ప్రసాద్ మంత్రి తిమ్మరుసుగానూ, పెళ్ళిళ్ళ పేరయ్యగాను రెండు పాత్రల్ని సోషించారు. హాస్యానికి పెద్దపీటవేసి ఆ చిత్రాన్ని నిర్మించారు.
Click Here to go to Tenali Ramakrishna (1956) Movie Page.
కాగా, 12.1.1956న సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ రెండో చిత్రాన్నిదర్శక నిర్మాత బి.ఎస్.రంగా విక్రం ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించగా ఘననిజయం సాధించటమేగాక రాష్ట్రపతి రజిత పతకాన్ని కూడా అందుకుంది. ఈ చిత్రాన్ని తెలుగు,తమిళ, కన్నడ భాషల్లో నిర్మించారు. తెనాలి రామకృష్ణ కృష్ణదేవరాయలు పాత్రల్ని తెలుగులో అక్కినేని, యన్.టి.ఆర్, తమిళంలో శివాజిగణేశన్, టి.ఎస్.దొరైరాజ్, కన్నడలో రాజ్ కుమార్, బాలకృష్ణ పోషించగా ఇతర ప్రధాన భూమికల్ని భానుమతి, జమున, సంధ్య మూడు భాషల్లోనూ నిర్వహించారు.
సి.కె.వెంకటరామయ్య రాసిన నాటకం ఆధారంగా సముద్రాల రాఘవాచార్య రచన చేసిన ఈ చిత్రానికి మధురమైన సంగీతాన్ని అందించారు విశ్వనాధన్. రామమూర్తి దర్శకుడు, బి.ఎస్.రంగా ఛాయాగ్రహణాన్ని సమకుూర్చారు. కృష్ణాతీరంలో పండిత వంశంలో జన్మించిన రామకృష్ణుడు మంచి కవి. అయితే అతని గ్రామంలో కవిత్వానికి ఆదరణ లభించక కవి వండిత పోషకుడైన శ్రీకృష్ణదేవరాయల దర్శనంకోసం సతీసుత సమేతంగా గ్రామం విడిచి పెడతాడు. దారిలో మేకపిల్లను అమ్మవారికి బలి యివ్వబోయిన ఆటవికుల ప్రయత్నాన్ని విరమింపజేస్తాడు.
రాత్రివేళ ఆమ్మవారు ప్రత్యక్షమై ఏదో ఒకటి సేవించమని రెండు పాయస పాత్రలు(ఒకటి విద్య, రెండు సంపద) ఇవ్వగా, ఆ రెండింటినీ తాగేస్తాడు రామకృష్ణుడు. ఆగ్రహించిన శక్తిస్వరూపిణి రామకృష్ణుని వికటకవిగా బతకమని శపిస్తుంది.
అతికష్టంమీద తన తెలివితేటలతో రాజసభ ప్రవేశించి రాయలవారి అభిమానాన్ని పొందిన రామకృష్ణుడు అష్టదిగ్గజాలలొ ఒకడుగా స్థానం పొందుతాడు. నిత్యం జరిగే కవితాగోష్ఠులలో తన పాండిత్యంతో సభను రంజింపజేస్తాడు. పొగరుతో వచ్చిన పరదేశ కవులను ఓడిస్తాడు. ఆ పరంపరలో ‘మేకతోకకు మేకమేకతోకా మేకతోక మేక’ అంటూ తన వికటకవిత్వంతో ఆటపట్టిస్తాడు.
ఇలా వుండగా రామకృష్ణుని భ్రష్టుపట్టించాలని ప్రయత్నించిన తాతాచార్యులవారికి గుణపారం చెబుతాడు. దక్కనులో వున్న బహమని, బీజాపూర్ సుల్తానులు, మరికొందరు కలసి విజయనగరసామ్రాజ్య విచ్చిత్తికి రాయలును లొంగదీసుకోవటానికి కృష్ణసాని ఆనే నెరజాణను పంపుతారు. ఆమె మోజులో పడి రాజ్యాన్ని, పరిపాలనను విస్మరిస్తాడు. మహామంత్రి తిమ్మరుసు సహాయంతో రామకృష్ణుడు ఆమె ఆటకట్టిస్తాడు బీజాపూరు, గోల్కొండ సుల్తానులు బాబర్ సహాయంతో విజయనగరసామ్రాజ్యాన్ని ముట్టడించాలని ప్రయత్నిస్తారు. రామకృష్ణుడు బాబరు వచ్చిన దోవలో తోటమాలిగా పరిచయమై ఆయన అభిమానం పొంది పరిస్థితిని వివరించి మొగలాయి సైన్యాలను నిలువరించి రాయలుకు మేలుచేస్తాడు. రాయలు రామకృష్ణుని దేశభక్తిని, సమయస్ఫూర్తిని ప్రశంసిస్తాడు.
కవితాపరమైన రామకృష్ణుని కథను రాజకీయ వ్యవహారం జోడించటంతో కథ పట్టుగా నడుస్తుంది. నటీనటులందరూ హేమాహేమీలు గావడంతో అద్యంతం నవరసభరితంగా అలరిస్తుంది. సహాయ పాత్రల్లో ముక్కామల, నాగయ్య, మిక్కిలినేని, వంగర, డాక్టర్ కామరాజు, సురభి బాలసరస్వతి, లక్ష్మికాంత పాత్రోచితంగా నటించారు.
చిత్రంలోని పద్యాలు, పాటలు రసవత్తరంగా వుంటాయి. కపట సన్యాసి వేషంలో అక్కినేని, శిష్యుని వేషంలో నాగయ్యలపై చిత్రీకరించిన ‘కొండ ఎలుక లిచట రెండు కొలువు చేరి వుండెరా, పతాక సన్నివేశంలో అక్కినేనిపై చిత్రీకరించిన ‘చేసేది ఏమిటో చేసేయ్ సూటిగా’ సన్నివేశపరంగానూ, నటనపరంగానూ కనువిందు చేస్తాయి.కృష్ణదేవరాయల దేవేరిగా సంధ్యపై చిత్రీకరించిన ‘చందన చర్చిత’ పాట హాయిగొలుపుతుంది. చాకలి పాత్రలో రామకోటి స్వయంగా పాడిన ‘ఆకతాయి పిల్లమూక’ గిలిగింతలు పెడుతుంది.
చిక్కని సాహిత్యం, చక్కని నటన గిలిగింతలు పెట్టే హాస్యం, సుమధుర సంగీతం ఇవన్నీ కలబోతగా రూపొందిన కమనీయ చిత్రం ‘తెనాలి రామకృష్ణ’ నాటికీ నేటికీ ప్రేక్షకుల్ని అలరిస్తూనే వుంది.

Source: 101 C, S V Ramarao