“పూనుస్పర్థలు విద్యలందే – వైరముల్ వాణిజ్యమందే” అనేది ఆర్యోక్తి,దీనిసారాన్ని గ్రహించిన దర్శకులు కె.వి.రెడ్డి అభినయపరంగా యన్.టి.ఆర్. – ఏ.యన్నార్ పోటి పడితే ఎలా వుంటుందో వూహించి దానికి తెరరూపం కల్గించిన చిత్రమే “శ్రీకృష్ణార్జున యుద్ధం”.
Click Here to go to Sri Krishnarjuna Yuddhamu (1963) Movie Page.
చిత్ర ద్వితీయార్ధమంతా శ్రీకృష్ణుడు (యన్.టి.ఆర్), అర్జునుడు (అక్కినేని) గాయుణ్ణి అడ్డంగా పెట్టుకొని సవాళ్ళు, పెనుసవాళ్ళు, ప్రతిజ్ఞలు చేసి చివరకు పద్యాల రూపంలో ఒకర్నొకరు దెప్పి పొడుచుకొని ఆపైన అస్త్రప్రయోగాలతో అవనీతలాన్ని అతలాకుతలం చేస్తారు. దాంతో శివుడు కైలాసగిరి నుంచి భూలోకానికి తరలివచ్చి ప్రళయాన్ని నివారించటంతో శ్రీకృష్ణుడు దాన్ని తేలికగా తీసుకొని “రాబోయే కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడు ఏమాత్రం నిలవగలడో తెలుసుకోడానికి యిదొచిన్న టెస్ట్ అంటూ ట్విస్టివ్వడంతో చిత్రం పరిసమాప్తమౌతుంది.
ఈ చిత్రకథలోని ప్రధానాంశాలు మూడు: మొదటిది ముక్కతిమ్మన వ్రాసిన పారిజాతాపహరణం, నారదుడు బహూకరించిన పారిజాతపుష్పాన్ని శ్రీకృష్ణుడు రుక్మిణికి బహూకరించటం, అది తెలిసిన సత్యభామ అలకా గృహంచేరి, చేరవచ్చిన శ్రీ కృష్ణుని అనుకోకుండా కాలితో తన్నటం దాంతో “ననుభవదీయ దాసుని” అంటూ శ్రీకృష్ణుడు కమ్మని పద్యాన్ని ఆలపించు ఆమెను శాంతింప చేయటం….
రెండోది సుభద్రాపరిణయం. శ్రీకృష్ణుని సలహామేరకు అర్జునుడు యతిగా మారి బలరాముని అభిమానం పొంది సుభద్ర మనసు తెలుసుకొని ఆమెను మారువేషులో తికమకపెట్టి తుదకు వివాహం చేసుకోవటం.
మూడోది గయాపాఖ్యానం- ఇది చిలకమర్తి వారి నాటకం. గయుడను గంధర్వరాజు ఆకాశమార్గమున విహరిస్తూ విడిచిన నిష్టీననము సూర్యునికి అర్హ్యమిస్తున్న శ్రీకృష్ణుని దోసిట్లో పడటం- గయుణ్ని సంహరిస్తానని ప్రతిన పూనటం (ఇక్కడా పద్యాలున్నాయి) ఇది తెలియని అర్జునుడు గయుణ్ణి రక్షిస్తానని అభియమివ్వటం ఫలితంగా శ్రీకృష్ణార్జున యుద్ధం.
ఈ మూడు కధల్ని రసవత్తరంగా ఒకటిగా తీర్చిదిద్దిన ఘనత రచయిత పింగళి నాగేంద్రరావుకు, దర్శకులు కె.వి.రెడ్డికి దక్కుతుంది.
అటు కృష్ణునకు సోదరిగా యిటు అర్జునకు జంటగా సుభద్ర పాత్రలో ముద్దు ముద్దుమాటలతో ముద్దునటనతో ఆకట్టుకొంది అభినేత్రి బి.సరోజాదేవి. ఇద్దరు హీరోల మధ్య యిరుకున పడ్డ గయుడిగా ధూళిపాళ, నటన సూత్రధారి నారదునిగా కాంతారావు ఆహా అనిపించారు. హాస్య భూమికల్ని పోషించిన అల్లు రామలింగయ్య, బాలసరస్వతిపై అంచెలంచెలు లేని మోక్షం” అనే హాస్యగీతాన్ని (బి.గోపాలం, స్వర్ణలత) కూడా చిత్రీకరించారు. ఇతర పాత్రల్లో గుమ్మడి, నాగయ్య, మిక్కిలినేని, సత్యనారాయణ, శ్రీరంజని, యస్.వరలక్ష్మి చిత్రానికి నిండుతనాన్ని చేకూర్చారు.
పెండ్యాల కూర్చిన స్వరాలు సంగీత ప్రియులకు లభించిన అమూల్య వరాలు. హీరోలిద్దరికీ, నారదునికి ఘంటసాల పాడటం విశేషమైతే పతాక సన్నివేశంలో పద్యాలు అక్కినేని, యన్.టి.ఆర్ గాత్ర ధర్మానికి తగ్గట్టు ఆలపించటం ఘంటసాలకే చెల్లింది.
అలిగితివా సఖీ, తపము ఫలించిన శుభవేళ, చాలదా యీ పూజదేవీ, స్వాముల సేవకు వేళాయె, మనసు పరమశించెనే గీతాలు హాయిగొలుపుతాయి. పసుమర్తి కృష్ణమూర్తి సమకూర్చిన నృత్యరీతులు కనువిందుచేస్తాయి. అంత చక్కగ చిత్రీకరించారు ఛాయాగ్రాహకులు కమల్ ఘోష్.
1963 సంక్రాంతి కానుకగా విడుదలయి నిర్మాత, దర్శకునిగా కె.వి.రెడ్డికి ఫలప్రాప్తి అందించిన చిత్రం “శ్రీకృష్ణార్జున యుద్ధం”.
The story was originally made to Hindi movie in 1945 starring Shahu Modak, Prithviraj Kapoor, Shobhna Samarth, and again remade in 1971 as Shree Krishna Arjun Yudh by Babubhai Mistry starring Abhi Bhattacharya, Mahipal, Jayshree Gadkar, Helen, Jeevan.
Source: 101 C, S V Ramarao, Wiki