భాగవత కథల్లోని శ్రీకృష్ణుని బాల్యం. అతనివల్ల తన ప్రాణాలకు ముప్పు ఉందని తెలిసిన మేనమామ కంసుడు కృష్ణుని అంతమొందించటానికి చేసిన ప్రయత్నాలు, వాటిని బాలకృష్ణుడు తిప్పి కొట్టి అసుర సంహారం చేయటం. గోపికలతో సరససల్లాపాలు, స్నేహితులతో కలిసి వెన్న దొంగలించి వినోదించటం. యశోదమ్మకు తన నోట పదునాల్గుభువనాలు చూపటం, క్లయిమాక్స్లో మేనమామను సంహరించి దుష్టశిక్షణ చేయటం కథావస్తువు.
ఈ కథను 1920లో J.V.సేన్ తొలిసారిగా మూకీ చిత్రంగా తీశారు. టాకీలు వచ్చిన తరువాత 1934లో ఏంజెల్ పిక్చర్స్ వారు తమిళంలోనూ, 1935లో తెలుగులో వేల్ పిక్చర్స్ చిత్రపు నర్సింహారావు దర్శకత్వంలోనూ, 1946లో హిందీ లో దేవకీ బోస్. 1947లో కన్నడంలో డాక్టర్ C.V.రాజు, 1953లో బెంగాలీలో అరుణ్ చౌదరి దర్శకత్వంలోనూ, 1959లో మళ్ళీ తెలుగులో రాజ్యం పిక్చర్స్ జంపన చంద్రశేఖరరావు నిర్ధేశికత్వంలోను నిర్మించారు.
చిత్రపు నరసింహరావు నేతృత్వంలో తయారైన ‘శ్రీకృష్ణలీలలు’ బాక్సాఫీస్ వద్ద ఆనాడే విజయభేరి మ్రోగించింది. కథా సంవిధానం A.T. రాఘవాచారి సమకూర్పగా, సంగీతాన్ని గాలిపెంచల నరసింహారావు అందించారు.

బాలకృష్ణుని పాత్రలో ప్రముఖ సంగీత దర్శకుడు సాలూరు రాజేశ్వరరావు ఈ చిత్రంతోనే సినీరంగ ప్రవేశం చేసారు. అప్పటికి ఆయన వయస్సు కేవలం 13 సంవత్సారాలు. కంసునిగా దుష్టభూమికలో ప్రముఖ రంగస్థలనటుడు. వేమూరి గగ్గయ్య విశ్వరూపాన్ని ప్రదర్శించారు. “ధిక్కారమును సైతునా” అనే పద్యం విన్నవారికి వాళ్ళు జలదరించకమానదు.
ఇతర పాత్రల్లో సీనియర్ శ్రీరంజని, రామతిలకం, పారుపల్లి సుబ్బారావు, పారుపల్లి సత్యనారాయణ నటించారు. అదే సంవత్సరం (1935) C. పుల్లయ్య గారి ‘శ్రీ కృష్ణతులాభారం ద్వారా సినీ రంగప్రవేశం చేసిన నటి లక్ష్మీరాజ్యం ఈ చిత్రంలో రాధ పాత్రను పోషించారు.
అవి స్వాతంత్ర్య పోరాటం ముమ్మరంగా జరిగినరోజులు కావటంవల్ల నాటి నిర్మాతలు తమ చిత్రాల్లో దేశభక్తి భావాలను ప్రతిబింబించే గీతాలు వినిపించటానికి ప్రయత్నించారు. అందుకు ఉదాహరణగా ‘శ్రీ కృష్ణలీలలు’ పౌరాణిక చిత్రం లో కొద్దిగా చరణాలు మార్చి ‘వందేమాతరం’ గీతాన్ని వినిపించారు. అయితే దానిని తెరపై ఇంద్రుడు, అగ్ని మొదలైన దేవతలు ‘దేవి’ని స్తుతిస్తూ పాడిన గీతంగా మలచటం విశేషం!
Click here to go to Sri Krishna Leelalu (1935) movie page.
నటి లక్ష్మీరాజ్యంకు తాను తొలి రోజుల్లో రాధా పాత్ర పోషించిన “శ్రీ కృష్ణలీలలు” అంటే ఎంతో ఇష్టం. అందుకే 1959లో తన సొంత కంపెనీ రాజ్యం పిక్చర్స్ పతాకంపై “కృష్ణలీలలు: నిర్మించింది. ఆ చిత్రానికి ముందుగా పుల్లయ్య దర్శకత్వంలో కొంత షూటింగ్ జరిగాక నిర్మాతల పద్దతి నచ్చకపోవటంతొ పుల్లయ్య తప్పుకున్నారు. అప్పుడు జంపన చంద్రశేఖరరావు దర్శకత్వంలో ఆ చిత్రాన్ని పూర్తి చేసారు.
Source: 101 C, S V Ramarao