7.4.1950న విడుదలైన విజయావారి తొలి చిత్రం ‘షావుకారు’ అనూహ్య విజయం సాధించకపోయినా, పటిష్టమైన పునాదితో నిర్మితమైన ఆ వరవడిలో, విజయ సంస్థ పలు చిత్రాలు తీయడానికి దారి తీసింది. ఇందులో ముఖ్యంగా చెప్పుకోదగ్గది సహజత్వానికి, గ్రామీన వాతావరణానికి అతి దగ్గరగా ఉండేలా చక్రపాణి రూపొందించిన స్క్రిప్టు. ఆ నేటివిటీ పాత్రల్లోనూ, సంభాషణల్లోనూ అణువణువుగా కనిపిస్తుంది.
ఇది ఇరుగుపొరుగుల కథ. ఈ విషయాన్ని పబ్లిసిటీలో కూడా ఉదహరించారు. ‘ఊరివారి బిడ్డను తను కొడితే, తన బిడ్డను దైవం కొట్టాడు’ అని ఒక సామాన్య పాత్రచేత అనిపించిన మాటలు ఈ చిత్రకథా సారాంశం.
Click Here to go to Shavukaru (1950) Movie Page.

అసలు కథ విషయానికి వస్తే వడ్డీ వ్యాపారం చేసుకునే చెంగయ్య, రామయ్య ఇరుగుపొరుగు కుటుంబాలవారు. చెంగయ్య కొడుకు సత్యం. చెంగయ్య దగ్గర పనిచేసే రౌడీ సున్నం రంగడు బాకీలు వసూలు చేసి పెడుతుంటాడు. రామయ్య కొడుకు నారాయణ, కూతరు సుబ్బులు. నారాయణ భార్య శాంతమ్మ. ఈ రెండు కుటుంబాల మధ్య ఆప్యాయతలు వెల్లివిరిసేవి. సుబ్బుల్ని తన కోడలుగా చేసుకోవాలని చెంగయ్య కోరిక. నారాయణ కొంచెం దుడుకుమనిషి. ఎప్పుడో చెంగయ్య దగ్గర నారాయణ తీసుకున్న అప్పు తీర్చాల్సి వస్తుంది. ఈలోగా సత్రవ విషయంలో చెంగయ్యకూ రామయ్యకూ అభిప్రాయ బేధాలొస్తాయి. దాంతో చెంగయ్య బాకీ కోసం వత్తిడి చేస్తాడు. నారాయణ భార్య నగలు అమ్మి తీర్చబోతే అంతకముందు రామయ్య కొంత బాకీ తీర్చగా దానికి నోటు మీద చెల్లు వేయలేదు. ఆ విషయాన్ని దాచిపెట్టి పూర్తిగా చెల్లించమంటాడు చెంగయ్య. రాత్రివేళ రంగడు నారాయణ పంటను తగలబెట్టబోతే నారాయణ కొడతాడు. చెంగయ్య తప్పుడు కేసు పెట్టి నారాయణను జైలుకు పంపిస్తాడు. పట్నంలో కొడుకును చూడడానికి వెళ్లిన చెంగయ్య, తన కొడుకు సత్యం జైల్లో ఉండడాన్ని తెలుసుకుంటాడు. నిజానికి సత్యం కూడా చేయని నేరానికి స్నేహితుని కుట్రవల్ల జైలుపాలవుతాడు.
‘చెరపకురా చెడేవు’ అన్న నిజాన్ని చెంగయ్య తెలుసుకుంటాడు. ఈలోగా చెంగయ్యకు ఎదురు తిరిగిన రంగడు చెంగయ్య ఇంటిని దోచుకోవాలని పథకం వేస్తాడు. ఆ సంగతి తెలుసుకున్న సుబ్బులు, రామి సహాయంతో రంగడి ఆటకట్టిస్తుంది.
ఈ ప్రయత్నంలో రామయ్యకు దెబ్బలు తగులుతాయి. రామయ్య కుటుంబానికి ఎంతో అన్యాయం చేసినవారు తనను రక్షించినందుకు చెంగయ్య పశ్చాత్తాపంతో కుమిలిపోతాడు. సత్యం, నారాయణ జైలునుంచి వస్తారు. సత్యంతో సుబ్బులుకు పెళ్లికావడంతో కథ సుఖాంతమవుతుంది.
కథానాయకుడు (సత్యం)గా యన్. టి. రామారావుకు నాయికగా జానకికి ఇది తొలిచిత్రం. చాల ఫ్రెష్ గా సహజంగా నటించారు. ఇతర ముఖ్యపాత్రల్లో గోవిందరాజుల సుబ్బారావు, వల్లభజోస్యుల శివరాం, శ్రీ వాత్సవ, టి. కనకం, జోగారావు, యస్. వి. రంగారావు రాణించారు. హరికథ సన్నివేశంలో మాధవపెద్ది పాల్గొన్నారు.
సముద్రాల రాఘవాచార్య రచనతో ఘంటసాల స్వరపరచిన పాటలన్ని హాయిగా వీనులవిందుగా లలితగీతాలకోవాలో శ్రోతల్ని ఆకట్టుకున్నాయి. ‘ఏమనెనే చిన్నారి ఏమనెనే, పలుకరాదటే చిలుకా’ గీతాలు హాయిగొలుపుతాయి. మార్కస్ బార్ట్లే రాత్రి- పగలు ఎఫెక్టును చాలా అద్భుతంగా చిత్రీకరించారు.
కె. ఎస్. ప్రకాశరావు, రజనీకాంత్ సహాయ దర్శకులుగా పనిచేసిన ఈ చిత్రాన్ని సామాజిక విలువలకు ప్రాధాన్యతనిచ్చి రూపొందించిన దర్శకులు యల్. వి. ప్రసాద్. చక్రపాణి, నాగిరెడ్డి ద్వయం నిర్మాతలుగా ప్రారంభించిన విజయసంస్థకు మంచిపేరు తెచ్చిన తొలిచిత్రమే ‘షావుకారు’.

Source: 101 C, S V Ramarao