స్టేజీమీద రేఖా&మురళీ పతాకంపై పద్మనాభం, వల్లం నరసింహారావు విజయవంతంగా ప్రదర్శించిన పాలగుమ్మి పద్మరాజు నాటకం “శాంతినివాసం”.
దాని ఆధారంగా సుందరలాల్నహతా శ్రీ ప్రాడక్షన్స్ పతాకంపై సి.యస్.రావు దర్శకత్వంలో నిర్మించిన క్విక్మూవీ “శాంతినివాసం” 1960లో సంక్రాంతి కానుకగా విడుదలయి శతదినోత్సవం జరుపుకుంది. విశేషమేమిటంటే “శ్రీలక్ష్మమ్మకథ” తర్వాత అతితక్కువ రోజులలో రేయింబవళ్ళు షూటింగ్ జరిపి మూడు నెలలలోపులో భారీ తారాగణంతో పూర్తిచేసిన విడుదల చేసిన చిత్రం “శాంతినివాసం”.
Click Here to go to Santhi Nivasam (1960) Movie Page.
లక్షాధికారి రామదాసు (నాగయ్య) గారికి ముగ్గురు కొడుకులు. పెద్దకొడుకు యాక్సిడెంట్లో మరణించగా కోడలు, మనవలు అక్కడే వుంటున్నారు. రెండో కొడుకు రాజు (కాంతారావు), కోడలు లక్ష్మి (దేవిక), మూడో కొడుకు గోపి (నాగేశ్వరరావు), కూతురు చిట్టి (బాలసరస్వతి) ఆమె భర్త రేలంగి.
గోపీ, సవతితల్లి పోరుతో సతమతమవుతున్న రాధను (రాజసులోచన) ప్రేమిస్తారు. తన ప్రేమ సఫలం చేయమని తన ప్రేమకథను వదినతో వివరిస్తాడు గోపీ.
వారి చనువుకు విపరీతర్ధాలు కల్పించి రాజు మనసును వికలం చేస్తోంది ఆమెతల్లి (సూర్యకాంతం). వికల మనస్కుడైన రాజు తన స్నేహితురాలు రాగిణి (కృష్ణ కుమారి) వద్ద స్వాంతన పొందటానికి ప్రయత్నించి, అతిగా ప్రవరించి భంగపడతాడు.
కుటుంబంలో అపార్ధాలను, యజమాని రామదాసు అలసత్వమేనని గ్రహించిన గోపీ తండ్రి యెదుటే సిగరెట్ కాలుస్తాడు. ఆగ్రహించిన రామదాసు కొడుకుపై చేయి చేసుకొంటాడు. ఎత్తిన ఆ చేయి దించవద్దని గోపీ అసలు పరిస్థితిని తండ్రికి వివరిస్తాడు. అంతే; రామదాసు భార్యను అదుపాజ్ఞలలో పెడతాడు. చిట్టి కూడ భర్తను ఆదరిస్తుంది. అందుకు సహకరిస్తాడు మిలట్రీ మామ పరమానందం.
భార్య లక్ష్మి తమ్ముడు గోపీ చనువుగా ప్రవర్తించటాన్ని అనుమానించిన రాజా తన పొరపాటును గ్రహిస్తాడు.అశాంతితో
అల్లాడిన ఆ ‘శాంతినివాసం’లో శాంతి సౌభ్యాలు వెల్లివిరయడంతో కథ సుఖాంతమౌతుంది.
అన్నదమ్ములుగా బెస్ట్ కాంబినేషన్ అనిపించేలా నటించారు కాంతారావు, నాగేశ్వరరావు, హుషారు సన్నివేశాల్లోనూ, సీరియస్ సన్నివేశాల్లోనూ అందుకు తగ్గ విధంగా నటించారు అక్కినేని. ఆయనకు జోడిగా రాధ పాత్రలో హోయలొలికించారు రాజసులోచన.
ఈ సినిమా విజయానికి మూలం జూనియర్ సముద్రాల మాటలు పాటలు,ఘంటసాల అందించిన సంగీతం. హిందీ మూలంనుంచి అనుకరించబడిన ట్యూ్న్ “రావేరాధా రాణీవి నీవే, కంకం కంగారునీకేలనో, చక్కనిదానా చిన్నదాన యింకా అలుకేలా” పాటలు హిట్ అయ్యాయి. ఘంటసాల స్వంత ట్యూన్స్ ‘శ్రీరఘురాం కలనైనా నీవలపే’ గీతాలు ప్రాచుర్యం పొందాయి.
వీటిన్నిటి సమన్వయం చేసుకొంటూ రికార్డు టైంలో చిత్రాన్ని పూర్తి చేసి హిట్ చేసిన సి.యస్.రావు ప్రశంసనీయుడు.
Source: 101 C, S V Ramarao