ఉమ్మడి కుటుంబాలు ఒకరు సంపాదిస్తే యావత్ కుటుంబం ఆ సంపాదనమీదే ఆధారపడటం, అన్నదమ్ముల అనుబంధాలు, అత్త ఆడపడుచులు కోడల్ని ఆరళ్ళుపెట్టడం- పల్లెటూరి బైతు టౌనుకువచ్చి ప్రయోజకుడిగా మారటం, ఇవ్వన్నీ కుటుంబ కథా చిత్రాలకు ప్రాణవాయువు వంటివి. విడివిడిగా వీటిల్లో ప్రతి సమస్యమీద ఒక చిత్రం వచ్చినా అన్నీ కలిపి తొలిసారిగా రూపుదిద్దుకున్న చిత్రం సంసారం! సి. వి. రంగనాథ్ దాస్ ఈ చిత్రాన్ని యల్. వి. ప్రసాద్ దర్శకత్వంలో నిర్మించారు.
Click Here to go to Samsaram (1950) Movie Page.
రఘు ప్రభుత్వ ఉద్యోగి, చాలా సామాన్యమైన గుమాస్తా బతుకు. భార్య మంజుల, ఇద్దరు పిల్లలు, ఒక తమ్ముడు వేణు, పల్లెటూళ్ళో నివాసం, అక్కడవుండేది తల్లి చెల్లెలు, బావ, బావను తల్లి, చెల్లెలు చెప్పుచేతల్లో ఉంచుకుంటారు. వీరందరి అవసరాలు తన జీతంతోనే రఘు తీర్చాల్సివస్తుంది. ఆ ప్రయత్నంలో ఎన్నో ఇబ్బందులు పడి సంసారాన్ని విడిచి ఎక్కడికో వెళ్ళిపోతాడు. అప్పుడు మంజుల పిల్లలచేత ముష్టి ఎత్తించి సంసారం నెట్టుకు వస్తుంది. ఒక చోట పనిమనిషిగా చేరి హత్యానేరంలో ఇరుక్కొంటుంది. పల్లెటూరిలో ఉన్న వేణు టౌనుకు వచ్చి జరిగింది తెలుసుకొని పరిస్థితులు చక్కదిద్దటానికి ప్రయత్నిస్తాడు. చివరకు తల్లి, చెల్లెలు కలిసి సంసారానికి చేసిన ద్రోహం బయట పడుతుంది. రఘు ఇంటికి వస్తాడు. అందరూ ఏకమౌతారు. ఈ కథలో ప్రేక్షకులని కంటతడి పెట్టించడానికి ఎన్ని అంశాలున్నాయో నవ్వించటానికి అన్ని సన్నివేశాలూ వున్నాయి. ఆ విధంగా ట్రీట్మెంట్ తయారు చేశారు యల్. వి. ప్రసాద్.
ఇంటల్లుడు రేలంగి- అతని మీద భార్యా, అత్తవారు అజమాయిషీ చేసే సన్నివేశాలు, అమాయకుడైన పల్లెటూరి రైతు వేణుకు పట్నం నుంచి వచ్చిన అమ్మాయిలు ఏడిపించబోయి భంగపడటం, తర్వాత ఆ నాయకురాలు వేణుతో ప్రేమలో పడటం – ఇందుకు సంబంధించిన సన్నివేశాలు పుష్కలంగా వినోదాన్ని అందించాయి.

అన్నగా యన్. టి. రామారావు, అతని భార్యగా లక్ష్మీరాజ్యం గంభీరమైన సన్నివేశాలకు ప్రాణం పోశారు. తమ్ముడు వేణుగా అక్కినేని నాగేశ్వరరావు నటించారు. ఆయనకు ఇది తొలి సాంఘిక చిత్రం. అంత వరకూ జానపద చిత్ర కథానాయకునిగా పేరొందిన అక్కినేని పల్లెటూరి అమాయకుడిగా, తరువాత ప్యాంటు షర్ట్ తో ప్రేమాయణం సాగించిన పాత్రలో చక్కగా రాణించి, సార్ధక హీరోగా ఓకే అనిపించారు. ఇతర పాత్రల్లో రేలంగి, సూర్యకాంతం, పుష్పలత, బాలసరస్వతి, దొరస్వామి నటించగా బాలనటుడిగా ఆనంద్, రఘు కొడుకుగా ఆర్ట్ డైరెక్టర్ కళాధర్ గారి అమ్మాయి అరుణ కూతురు గాను నటించింది.
సదాశివబ్రహ్మం రచన చేయగా సుసర్ల దక్షిణామూర్తి సంగీతం అందించారు. కల నిజమాయెగా కోరిక తీరేగా, ఇకపై నా గతేమి అన్న పాటలు రాజ కపూర్ నిర్మించిన ‘బర్సాత్’ లోని బాణీలను అనుసరించినా సంసారం సంసారం ప్రేమసుధాపురం నవజీవన సారం అన్న టైటిల్ సాంగ్, అక్కినేని పై చిత్రీకరించిన అందాల చందమామ, రెండో నాయిక బృందం (ఈ బృందంలో సావిత్రి తొలిసారిగా నటించారు) వేణుతో పోటీపడ్డ టకుటకు టమకాల బండి, రేలంగిపై చిత్రీకరించిన ‘సొగసైన క్రాపుపోయే- నగుమోము చిన్నదాయే’ అన్న పాటలు ప్రజాదరణ పొందాయి.
29.12.50 న విడుదలైన ఈ చిత్రం రజతోత్సవం చేసుకొని కుటుంబ కథాచిత్రాలకు ప్రజాదరణ ఉంటుందని నిరూపించింది. దర్శకులు యల్. వి. ప్రసాద్ చూపిన మార్గంలో తరువాత ఎందరో విజయాలు సాధించారు.
ఈ చిత్రంలో రెండో కథానాయికగా ముందు సావిత్రిని బుక్ చేశారు. ఆమె నటనతో సంతృప్తి చెందని దర్శకులు ప్రసాద్ ఆమె స్థానంలో పుష్పలతను నియమించారు. ఆమె స్నేహితురాలిగా సావిత్రి చిన్న వేషంలో నటించారు. ఐతే తరువాతి కాలంలో నటి సావిత్రి అదే ప్రసాద్ గారి దర్శకత్వంలో “పెంపుడు కొడుకు, మిస్సమ్మ, అప్పుచేసి పప్పుకూడు” చిత్రాలతొ కథానాయికగా నటించి మెప్పించారు.
Source: 101 C, S V Ramarao