కళలు సామాజిక ప్రగతికి దోహదం చెయ్యాలని, జనాన్ని చైతన్య స్ఫూర్తితో ముందుకు నడిపించాలని, అందుకు కళలు కరదీపికలు కావాలని ప్రతికరణశుద్ధిగా నమ్మి ఆ లక్ష్య సాధనకు జీవితాన్ని అంకితం చేసిన మహోన్నత వ్యక్తి గరికపాటి రాజారావు.
మహిళా లోకం సముద్ధరణకు కంకణం కట్టుకొని దానికి దోహదం చేసే ఇతివృత్తం తో ఆయన రాజా ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించిన చిత్రమే ‘ పుట్టిల్లు’ (1953).
Click Here to go to Puttillu (1953) Movie Page.
స్త్రీ మొదటిదశలో తల్లిదండ్రుల చాటున, రెండో దశలో భర్త చాటున, మూడో దశలో బిడ్డల చాటున బతకాల్సివస్తుంది. ఇందుకు భిన్నమైన రీతిలో ఆమెకు కూడా వ్యక్తిత్వం ఉంది. స్వయంగా నిర్ణయం తీసుకుని తన జీవన గమనం నిర్దేశించుకునే శక్తి కూడా ఆమెకు ఉంది. ఈ అంశాన్ని అంతర్లీనంగా ప్రభావితం చేస్తూ డాక్టర్ రాజారావు రూపొందించిన కథ ‘ పుట్టిల్లు’.
సామాన్య కుటుంబీకుడు ధర్మయ్య, ఆయన కూతురు సుశీల. పాఠశాల రోజుల్లోనే భారతమాతను ప్రశంసిస్తూ మహిళ శక్తిని ప్రస్తుతిస్తూ పాటలు పాడుతుంది. యుక్త వయస్సు వచ్చాక, చదువుకోవాలన్న ఆమె కోరికను కాదని గొప్ప కుటుంబీకుడుగా కనిపించిన రాఘవరావుతో ఆమెకు వివాహం జరిపిస్తారు. కట్నంగా కొంత డబ్బు కూడా ముట్టచెబుతాడు.అత్తింటికి చేరిన సుశీలకు అత్త మహాలక్ష్మి నుంచి వేధింపులు మొదలవుతాయి. ఇంకా పుట్టింటి నుంచి డబ్బులు తెమ్మని ఒత్తిడి చేస్తుంది. ‘ జిమ్మీ’ అనే వేశ్య వలలో చిక్కిన రాఘవరావు తల్లి మాటకు వత్తాసు పలుకుతాడు. పుట్టింటికి చేరిన కూతురు కాపురం బాగుపడటం కోసం ఆస్తి తాకట్టు పెట్టి ధర్మయ్య డబ్బు అందజేస్తాడు. అయినా పరిస్థితిలో మార్పు రాలేదు. ఇంకా డబ్బు కోసం వత్తిడి మొదలవుతుంది. ఇంతలో సుశీల ఒక బిడ్డకు జన్మనిస్తుంది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో సుశీల నాజరు దళం వారి ‘రుద్రమదేవి’ బుర్రకథ వింటుంది. ఆమెలో నిద్రాణమై ఉన్న మహిళా శక్తి మేల్కొంటుంది.అసమర్ధుడైన భర్తకు దూరమై ఒంటరిగా ధైర్యసాహసాలతో బతకాలని నిర్ణయించుకుంటుంది.
ఒక విధంగా ఈ కథ ఆ రోజుల్లో తీయటం సాహసమే. అందులోనూ అందరూ కొత్తవారితో తీయటం మరింత సాహసం. రాజారావే నిర్మాత, దర్శకుడు, చిత్ర కథానాయకుడు. క్లిష్టమైన కథానాయిక సుశీల పాత్రలో జమున ను వెండితెరకు పరిచయం చేశారు. సహజసిద్ధమైన నటనతో ఆమె రాణించింది. కథానాయకుడు తల్లి పాత్రలో సురభి కమలాబాయి, వేశ్య జిమ్మి గా సూర్య శ్రీ నటించారు. ఇతర పాత్రల్లో ప్రజానాట్యమండలి కి చెందిన పెరుమాళ్లు, చదలవాడ కుటుంబరావు, మిక్కిలినేని, అల్లు రామలింగయ్య, రామకోటి నటించారు. తరువాతి కాలంలో వీరంతా ప్రముఖ నటులుగా వెలుగొందారు.
జంట కవులు సుంకర – వాసిరెడ్డి రచన చేయగా మోహన్ దాస్ సంగీతాన్ని అందించారు. యావత్ భారత స్థాయిలో ఖ్యాతినొందిన వి.యన్.రెడ్డి ఫోటోగ్రఫీ నిర్వహించారు. అజిత్ కుమార్ సహకరించారు. ఆర్థికంగా విజయవంతం కాలేదు కానీ ఎందరికో దారి చూపిన చిత్రం ‘పుట్టిల్లు’.
ఇక్కడ డాక్టర్ రాజారావు గురించి కొద్దిగా చెప్పుకోవాలి. ప్రజానాట్య మండలి ఆయన ఊపిరి. స్త్రీ పాత్రలు స్త్రీలే ధరించాలని ఎలుగెత్తి చాటారు. 1940-60 మధ్యకాలంలో కళాకారుల్ని సమీకరించి కళారంగాన్ని నవ చైతన్యంతో నింపారు. ఆయన మంచి నర్తకుడు, నటుడు. మా భూమి, భయం, అల్లూరి సీతారామరాజు నాటకాల్లో ఆయన దర్శకత్వంతో, నటనతో ఆంధ్రదేశాన్ని ఉర్రూతలూగించారు.
డాక్టరుగా పేదల పాలిట పెన్నిధి. నాటక రంగప్రయోగ శిక్షణాలయాన్ని నిర్వహించారు. పుట్టిల్లు తర్వాత జమున సహకారంతో జగ్గయ్య హీరోగా మరో చిత్రాన్ని ప్రారంభించి పూర్తి చేయలేక పోయాడు. నటుడిగా బొబ్బిలి యుద్ధం, ఆరాధన చిత్రాల్లో కూడా నటించారు. అనారోగ్యంతో బాధపడి 8.9.1963న కన్నుమూశారు. ఎందరినో నటులుగా తీర్చిదిద్దిన డాక్టర్ రాజారావును, ఎందరికో భవిష్యత్తు కల్పించిన ‘పుట్టిల్లు’చిత్రాన్ని కళాకారులు మరువలేరు.

This was debut movie for Jamuna as an actress and Devika aka Mohana Krishna.
Source: 101 C, S V Ramarao