ఉన్నత కుటుంబానికి చెందిన లైలా, పేదరికానికి చెందిన మజ్ను; వారి అమరప్రేమను మనోజ్ఞ దృశ్యకావ్యంగా ‘లైలామజ్ను’గా అందించి విజయం సాధించిన భరణీ సంస్థ వెంటనే తీసిన సాంఘీక చిత్రం ‘ప్రేమ’. అయితే అంతముందు చిత్రం తాలూకు పాత్రల్ని రివర్స్ చేసి ఈ చిత్రకథను రూపొందించారు నటి భానుమతి.
Click Here to go to Prema (1952) Movie Page.
పల్లెటూళ్ళో ఓ పేదకుటుంబం. ఒక విధంగా చెప్పాలంటే ఓ లంబాడి తండావంటి తెగకు చెందిన కథానాయిక మోతి. పల్లెటూరి అందాలు చూడటానికి వచ్చిన సంపన్నుడు రాజా. ఆమెను చూసి ఆ సౌందర్యాన్ని ఆరాధించిన ఫలితంగా ఇద్దరూ పరస్పరం ప్రేమిచుకుంటారు. పట్నానికి వెళ్లిన రాజా తిరిగి కొంతకాలం వరకూ పల్లెకు రాలకపోతాడు. ఈలోగా మోతి తండ్రి ఆమెకు పరశురామ్ అనే వ్యక్తితో పెళ్లి నిశ్చయించారు.

ఆ పెళ్లి తప్పించుకొని పట్నానికి పారిపోయిన మోతి ఒక నాట్యబృందంలో చేరి ప్రదర్శనలిస్తూ ఉంటుంది. ఒకసారి నాట్యం చేస్తుండగా అక్కడ ప్రేక్షకుల్లో రాజాను, అతని పక్కన లతను చూసి మూర్ఛ పోతుంది.
అయితే అంతముందే మోతి జాడ తెలియకపోవడంవల్ల రాజా,లతను పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. పరిస్థితులు అర్థమయి రాజా, మోతి చేరువయ్యే సమయంలో విలన్ పరశురామ్ మోతిని చంపేస్తాడు. మోతి స్నేహితురాలు పరశురాంను గొడ్డలితో సంహరిస్తుంది. రాజా, లత ఇద్దరు మోతీ సమాధివద్ద ప్రణమిల్లుతారు.
ఇందులో మోతిగా భానుమతి, రాజాగా నాగేశ్వరరావు, లతగా శ్రీరంజని, పరశురామ్ గా ముక్కామల నటించగా శివరావు, సూర్యకాంతం, సి.ఎస్.ఆర్., రేలంగి, సురభి కమలాబాయి, దొరస్వామి ఇతర సహాయ పత్రాలు పోషించారు. భరణీ రామకృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా కమల్ ఘోష్ కెమెరా నిర్వహించారు. కొంతమంది గోపాలరాయశర్మ మాటలు, పాటలు రాయగా, సి.ఆర్. సుబ్బరామన్ మధురమైన సంగీతాన్ని అందించారు.
రోజుకు రోజుకు మరింత మోజు, ఆగవోయి మారాజా, పెళ్ళియంట మా పెళ్ళియంట, నీతిలేని లోకమా, ప్రపంచమంతా ఝూటా, ముంత పెరుగోయ్ బాబు, దివ్య ప్రేమకు సాటియౌనే స్వర్గమే ప్రేమ వంటి మధురగీతాలతో ప్రేక్షకుల్ని అలరించిన కమనీయ ప్రేమ కథాచిత్రం ‘ప్రేమ;. ఇదే చిత్రాన్ని తమిళంలో “కాదల్” పేరుతో నిర్మించారు.

Source: 101 C, S V Ramarao