అంతకుముందు పాతాళభైరవి, మాయాబజార్, దొంగరాముడు వంటి వైవిద్యమైన చిత్రాలకు దర్శకత్వం వహించిన కె.వి.రెడ్డి (కొందరు మిత్రులతో కలసి) నిర్మాతదర్శక హోదాల్లో జయంతి పిక్చర్స్ పతాకంపై అందించిన చిత్రం ‘పెళ్ళినాటి ప్రమాణాలు’.
Click Here to go to Pellinaati Pramanalu (1958) Movie Page.
గంభీర వ్యక్తిత్వంతోబాటు అంతర్యంలో అనురాగాన్ని నింపుకొన్న పెద్దమనసున్న మనిషి భీమసేనరావు (యస్.వి. రంగారావు). ఆయన కొడుకు (ఆర్.నాగేశ్వరరావు) మిలట్రీలో వుంటున్నాడు. కూతురు రుక్మిణి (జమున). ఆమెకు సంబంధాలు చూసే ప్రయత్నంలో వుంటాడు. భీమసేనరావుకు దగ్గర బంధువు, ఆత్మీయుడు సలహాలరావు (రమణారెడ్డి), ఇతనికి దగ్గర బంధువు కృష్ణారావు (అక్కినేని). రుక్మిణిని కృష్ణారావు తగిన వరుడని భావించి సలహాలరావు ఓ ఉత్తరాన్ని కృష్ణారావుకు ఇవ్వటం వలన భీమసేనరావు ముందుగా కృష్ణారావును వంటవాడిగా భావిస్తాడు. అయితే సలహాలరావు. వచ్చి వివరం చెబుతాడు. ఈలోగా తన ప్రవర్తనతో రుక్మిణిని ఆకర్షిస్తాడు కృష్ణారావు.
పూర్వాపరాలు చర్చించిన తరువాత భీమసేనరావు రుక్మిణిని కృష్ణారావుకు ఇచ్చి పెళ్ళి చేస్తాడు. ఒక రాజకీయ నాయకుడు పెళ్ళి సమయంలో దంపతులచేత ఒకరిని ఒకరు మోసం చేసుకోకూడదు అని ప్రమాణాలు చేయిస్తాడు.
టౌనులో కాపురం పెట్టిన కృష్ణారావుకు ‘అందాలు-అలంకారాలు’ అనే కంపెనీలో ఉద్యోగం దొరుకుతుంది. ఏడు సంవత్సరాలు గడిచేసరికి ఆ దంపతులకు నలుగురు పిల్లలు పుడతారు. (ఈ సినిమాకు మూలం “సెవన్ ఇయర్స్ ఇచ్’ సినిమా అనే ఓ అభిప్రాయం పుంది). ఆ తరువాత కృష్ణారావుకు పరాయి స్త్రీవల్ల ప్రేమ గండం దాపురిస్తుంది. అంటే ఆ ఆఫీసులో కొత్తగా చేరిన టైపిస్టు రాధారాణి (రాజసులోచన) పట్ల ఆకర్షితుడౌతాడు కృష్ణారావు, భార్య వూళ్లోలేని సమయంలో ఆమె ఇంటికి వెళ్లి ఊహల్లో తేలిపోతాడు.
ఈ సంగతి గ్రహించిన సలహాలరావు, రుక్మిణి అన్న చిన్న నాటకం ఆడి కృష్ణారావు కళ్లు తెరిపిస్తారు. కల్మషం లేని రాధారాణిని రుక్మిణి అన్న పెళ్లి చేసుకొంటాడు. సహజమైన పద్ధతిలో సన్నివేశాల్ని నడిపించారు రచయిత పింగళి నాగేంద్రరావు.
నటనాపరంగా ప్రధాన పాత్రల్లో అక్కినేని, జమున అత్యంత సహజంగా నటించారు. కూతురిపట్ల ప్రేమను గుండెలో దాచుకొన్న పాత్రలో యస్.వి.రంగారావు గంభీరంగా కన్పించారు. సహాయ పాత్రల్లో డాక్టర్ శివరామకృష్ణయ్య, ఆర్.నాగేశ్వరరావు పేకేటి శివరామ్, చదలవాడ కుటుంబరావు, బాలకృష్ణ, అల్లు రామలింగయ్య, సురభి కమలాబాయి, బాల నటించగా కథకు కీలకమయిన రాధారాణి పాత్రలో రాజసులోచన చక్కగా నటించారు. రమణారెడ్డి అతని భార్యగా ఛాయాదేవి చక్కని హాస్యాన్ని పండించారు.
పింగళి రాయగా ఘంటసాల స్వరపరచిన గీతాలు హాయిగొలిపేలా వుంటాయి. ‘శ్రీమంతురాలివై చెలువొందుమాత’ అంటూ ఆంధ్రదేశ ప్రశస్తిని వివరించే గీతం జమునపై చిత్రీకరించిన ‘బృందావన చందమామ ఎందుకోయి తగవు’, అక్కినేనిపై చిత్రీకరించిన ‘వెన్నెలలోనే వేడియేలనో’ రాజసులోచనను గూర్చి అక్కినేని వూహలో చిత్రీకరించిన ‘ఏమో తెలియక పిలిచితినోయీ’, ‘రావే ముద్దుల రాధా’ అన్న నృత్యగీతాలు చెప్పుకోదగ్గవే!
రాష్ట్రపతి రజిత పతకాన్నిపొందిన ‘పెళ్ళినాటి ప్రమాణాలు’ చిత్రం 17.12.1958న విడుదలకాగా దాని తమిళ వెర్షన్ ‘వాళ్క్కై ఒప్పందం’ 4.9.1959న విడుదలయ్యింది.


K.V. wanted to name the film, Bharya Bharthalu. Since it was registered by someone, he had opted for Pellinaati Pramanalu.
Source: 101 C, S V Ramarao