‘పాతాళభైరవి’ సినిమా విజయానంతరం విజయా సంస్థ వరకట్న సమస్యను హాస్యంతో రంగరించి ఎల్.వి. ప్రసాద్ నేతృత్వంలో అందించిన సాంఘీక చిత్రం ‘పెళ్లిచేసిచూడు’. నిర్మాతలలో ఒకరైన చక్రపాణి స్క్రిప్ట్ రూపొందించగా పింగళి నాగేంద్రరావు పాటల్ని రాశారు. ఘంటసాల వెంకటేశ్వరరావు సంగీతాన్ని అందించగా మార్కస్ బార్ట్లే ఫోటోగ్రఫీ నిర్వహించారు.
సామాన్య కుటుంబికురాలు రత్తమ్మ, ఆమె కొడుకు రాజు స్కూలు టీచరు. కూతురు అమ్మడు. రాజు ఎంతసేపు పిల్లల్ని పోగేసుకొని నాటకాలాడుతుంటాడు. తల్లి మందలింపుతో అమ్మడుకు సంబంధం చూసి వస్తానని బయల్దేరి అనుకోకుండా ఎక్స్ జిల్లా బోర్డుమెంబర్ పంచాయతీ బోర్డు ప్రెసిడెంటు ధూపాటి వియ్యన్న కూతురు సావిత్రిని పెళ్లి చేసుకుంటాడు. ఆ వియ్యన్న ఒక్కపుడు ఘనంగా బతికిన మనిషి ఆయనే పూనుకొని అమ్మడుకు ఒక సంబంధం ఖాయం చేస్తాడు. అది వేంకటపతి కొడుకు రమణతో, అయితే ఘరానా కబుర్లు చెప్పితీరా పెళ్లి సమయంలో వెంకటపతి కట్నంకోసం నిలదీయగా వియ్యన్న తాపీగా ప్రోనోటు చేతిలో పెడతాడు. అప్పటికే రమణ అమ్మడు మెళ్ళో మూడుముళ్లు వేసేస్తాడు. కోపించిన వెంకటపతి పెళ్లి మంటపం నుంచి కొడుకుతో సహా వెళ్ళిపోతాడు.
Click Here to go to Pelli Chesi Choodu (1952) Movie Page.

అయితే ఆంతర్యంలో రమణకు అమ్మడు పట్ల, వారి కుటుంబంపట్ల సానుభూతి ఉంటుంది. వియ్యన్న, రాజు చేసిన కృషి ఫలితంగా రమణ అత్తింటికి వచ్చి అమ్మడితో కాపురం చేస్తాడు. రత్తమ్మకు వరసకు అన్నయ్య ప్రైవేటు గోవిందయ్య. అతను తన కూతురు చిట్టిని ముందుగా రాజుకు, ఆ తరువాత రమణకు ఇచ్చి పెళ్ళిచెయ్యాలని ప్రయత్నించి భంగపడతాడు. చిట్టి ఆ ఊళ్లోని భీమన్నను పెళ్లిచేసుకుంటుంది. దానికి సపోర్టు ఇస్తాడు వియ్యన్న. అమ్మడును ఒక నర్సుగా తన ఇంటికి తీసుకువెళ్తాడు రమణ. ఆ వేషంలో మామ వేంకటపతి సేవలు చేస్తూ ఆయన అభిమానం పొందుతుంది అమ్మడు. టౌనులో ఉద్యోగానికి వెళ్లి రమణ అమ్మడుతో కాపురం పెడతాడు. ఈలోగా గోవిందయ్య వాళ్ళ సంగతి తెలుసుకొన్న వేంకటపతి టౌనుకు వెళ్లి ముందుగా ఘర్షణపడి తరువాత శాంతించి కొడుకు, కోడల్ని (మనవడితో సహా) ఆశీర్వదిస్తాడు. ఇందులో వరకట్న సమస్యను వాస్తవ దృక్పముతో చిత్రీకరించారు.
ఏ చిత్రంలో అంతర్లీనంగా హాస్యం మిళితమైంది. మారువేషాలున్నాయి. పిల్లలపై చిత్రీకరించిన మూడు గీతాలు చెప్పుకోదగ్గవే. చిత్రం మొదట్లో వచ్చే ‘ఓ బ్రహ్మయ్య’ పాటల్లోనూ తరువాత వచ్చే పాటల్లోనూ బాలనటుడు కుందూ ఎంతో హుషారుగా నటిస్తాడు. బాలనటి కూడా అందుకు తగ్గట్టుగానే నటించింది. ఇందులోని అమ్మా నొప్పులే పాటలో పాల్గొన్న కందమొహన్ ఐ.ఏ.ఎస్. ఆఫీసర్ గా రిటైర్ అయ్యారు.
ఘంటసాల వెంకటేశ్వరరావు స్వరకల్పనలో చిత్రంలో పాటలన్నీ లలితగీతాల కోవలో ప్రేక్షకుల్ని అలరించాయి. ఎవరో, ఎవరో పెళ్లిచేసుకొని ఇల్లుచూసుకొని, ఓ మనసా నేనెవరో నీకు తెలుసా, రాధనురా నీ రాధనురా’ గంభీర విషాదగీతం ‘పోవమ్మా బలికావమ్మా’ ఒక తరహాలో హాయి గొలిపితే జోగారావుపై చిత్రీకరించిన ‘పెళ్ళిచేసిచూపిస్తాం’ అన్న పాట సావిత్రిలో ఊహాలోకంలో సాగిన ప్రియా ప్రియా హ్యాపీయా ప్రియా’ గీతం మహాంకాళీ వెంకయ్య (భీమన్న) పై చిత్రీకరించిన ‘భయమెందుకు చిట్టి, ఎవడొస్తాడో చూస్తాగా, వదినా మరదళ్లు (జి.వరలక్ష్మి, సావిత్రి)పై చిత్రీకరించిన ఉయ్యాల పాట గిలిగింతలు పెడతాయి.
నటనాపరంగా నాయకుడు యన్.టి.రామారావు, నాయిక పాత్రలో జి.వరలక్ష్మి ఎంతో సహజంగా నటించారు. సహజంగా ఉదాత్త గంభీర పాత్రలు ధరించే దొరస్వామి ఇందులో విలనిటచ్ ఉన్న ప్రైవేటు గోవిందయ్య పాత్రని సమర్థవంతంగా పోషించటం విశేషం. పద్మనాభం డైలాగులు లేని రెండు పాత్రల్నిపోషించటం మరో విశేషం. జోగారావు, సావిత్రి కాంబినేషన్ వారి శోభనం సన్నివేశం ఏంటో రక్తికట్టాయి. చాలాకాలం తరువాత డాక్టర్ శివరామకృష్ణయ్య వేంకటపతి పాత్రలో రాణించారు. ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన పాత్ర ధూపాటి వియ్యన్న దీనికి ముక్కుపుటాలెగరవేసే మేనరిజాన్ని జోడించి కొత్త తరహాలో దీన్ని ఆవిష్కరించారు. యస్.వి.రంగారావు ఇతర పాత్రల్లో బాలకృష్ణ, పుష్పలత, సూర్యకాంతం, మహంకాళి వెంకయ్య రాణించారు.
29.2.1952న విడుదలయి శతదినోత్సవాలు జరుపుకున్న ‘పెళ్లిచేసి చూడు’ విజయాపతాకంపై నాగిరెడ్డి చక్రపాణి అందించిన ఆణిముత్యం.

Source: 101 C, S V Ramarao