ఒక మెయిన్ విలన్ (ఒకప్పుడు నాగభూషణం, తరువాత సత్యనారాయణ, రావుగోపాలరావు మొ”) అతనికి వంతపాడే మరో ఇద్దరు లేక ముగ్గురు సహాయ దుష్టులు. (గిరిబాబు, మిక్కిలినేని, చలపతిరావు, ఇలా ఎవరున్నా లిటిగేషన్ సలహాలు చెప్పే అల్లు రామలింగయ్య తప్పనిసరి). వీరంతా దుష్టత్రయం లేక దుష్టచతుష్టయమై స్థాయినిబట్టి గ్రామాల్ని, నాగరాల్ని, దేశాన్ని దోచుకోవటం వీరి లక్ష్యం. ఈ తరహా వ్యవహారానికి సినిమాలో నాంది పలికింది వాహినివారి ‘పెద్దమనుషులు’. అంతమందు భక్తిరస చిత్రాలను, జానపద చిత్రాలను హిట్ చేసిన దర్శకులు కె.వి. రెడ్డికి ఇది తొలి సాంఘిక చిత్రం. సమాజానికి మూలస్థంభాలైన వ్యక్తులే సమాజాన్ని దోచుకోవటం అనే మౌలిక అంశాన్ని తీసుకొని ఇబ్సన్ రాసిన నాటకం ‘పిల్లర్స్ అఫ్ ది సొసైటీ’ని తెలుగు వాతావరణానికి అనుగుణంగా తీర్చిదిద్దారు రచయిత డి.వి.నరసరాజు. వారు ఈ చిత్రం ద్వారానే సినీరంగానికి రచయితగా పరిచయమయ్యారు.
Click Here to go to Peddamanushulu (1954) Movie Page.
ఆ మునిసిపాలిటీకి చైర్మన్ ధర్మారావు (గౌరినాథశాస్త్రీ), అతనికి సహచరులు, కాంట్రాక్టరు నాగోజి (ఎ.వి.సుబ్బారావు), వ్యాపారి శేషావతారం (చదలవాడ కుటుంబరావు), సిద్ధాంతి(వంగర). ఈ నలుగురు దుష్టచతుష్టయం అని చెప్పుకోవచ్చు. వీరు చేసే అన్యాయాలను, అక్రమాలను ప్రజల్లో వెల్లడి చేస్తూ అల్లరి పెట్టె అమాయకుడు తిక్క శంకరయ్య (రేలంగి). ఇతను స్వయానా ధర్మారావుకు తమ్ముడు. చేసిన అల్లరికి బహుమతిగా హౌస్ అరెస్ట్ చేయబడి అన్నగారి చేతిలో దెబ్బలు తింటుంటాడు.

‘ప్రజాసేవ’ పత్రిక నడిపే రామదాసు (లింగమూర్తి) ఉత్తముడు. ధర్మారావు అంటే సదాభిప్రాయం ఉన్న వ్యక్తి. ఆ కారణంగా ధర్మారావు చేసిన హత్యను తన మీద వేసుకొని ధర్మారావును కాపాడి తానూ జైలు శిక్ష అనుభవిస్తాడు. తిరిగి వచ్చిన రామదాసుకు ధర్మారావు ఇంటర్వ్యూ కూడా ఇవ్వడు. అప్పుడు రామదాసుకు ధర్మారావు నిజస్వరూపం అర్థమౌతుంది. రామదాసు కూతురు (శ్రీరంజని) అంధురాలు. ధర్మారావు కొడుకు (రామచంద్ర కశ్యప) డాక్టరు. అతడు ఆమెను ప్రేమించి కళ్ళు తెప్పించే ప్రయత్నం చేస్తాడు. అది సినిమాకు సంబంధించిన ప్రేమ కథ. ఆ ఊరి గుళ్లో గర్భాలయంలో గుప్తనిధులు ఉన్నాయని ఆ నలుగురూ దానిని తవ్వి,ఆ ప్రయత్నంలో రాళ్ళూ మీద పది హతులౌతారు. ఎవరు తీసుకున్న గోతిలో వారిపడతారన్న సామెతను నిజం చేస్తారు. ప్రజలకు పెద్దమనుషుల నిజస్వరూపం తెలుస్తుంది. సూక్ష్మంగా ఇది కథ.
దర్శకులు కె.వి.రెడ్డి రచయిత నరసరాజు దీనిని తెరపై అనువదించిన విధానం చాల గొప్పది. పలు సన్నివేశాల్లో సంభాషణలు ఆర్థోక్తిలో వుండి, వ్యంగంగా ధ్వనించి నూతనశైలిలో ప్రేక్షకుల్ని ఆకట్టుకొన్నాయి. ఇందులో నటీనటులు కనిపించరు, పాత్రలే కనిపిస్తాయి. రామదాసు పాత్రలో లింగమూర్తి ప్రదర్శించిన సాత్విక అభినయానికి ప్రభుత్వం తరపున బహుమతి లభించింది. ఈ చిత్రానికి సంబంధించినంతవరకు అమాయకుడుగా, పిచ్చివాడుగా ముద్రపడ్డ తిక్కశంకరయ్య పాత్ర రేలంగి వెంకట్రామయ్య నటజీవితంలో చెప్పుకోదగ్గది.
ఊటుకూరి సత్యనారాయణ, చాలాకాలం తర్వాత గీత రచయితగా పునఃప్రవేశం చేసిన కొసరాజు రాఘవయ్య పాటలు రాశారు. కొసరాజు రాయగా, ఘంటసాల పాడగా రేలంగి మీద చిత్రీకరించిన ‘శివశివమూర్తివి గణనాధా నీవు శివుని కుమారుడవు గణనాధా” అన్న పాట చిత్రం మొదట్లో వచ్చే ‘నందామయా గురుడ నందామయా’ మకుటం గల పాట చరణాల్లో ‘స్వాతంత్ర్య గౌరవము సంతలో తెగనమ్ము స్వార్థమూర్తులు అవతరించారాయ” అంటూ స్వార్థరాజకీయ ప్రహసనాన్ని ఆనాడే కొసరాజు తన రచనలో ఎండగట్టారు. ఆ రోజుల్లో సినిమాల్లో వీలైనంతవరకు చిన్నపిల్లలపై ఒక పాట లేక నృత్య నాటి ఉండేది. ఇందులో కూడా ‘నాన్నా పులి’ కథను చక్కని నృత్య నాయికగా తీర్చిదిద్దారు. జంట సంగీత దర్శకులు ఓగిరా రామచంద్రరావు, అద్దేపల్లి రామారావు హాయిగొలిపే బాణీలను సమకూర్చారు. బి.యెన్.రెడ్డిగారి సోదరులు బి.కొండారెడ్డి ఈ చిత్రం ద్వారా కెమెరామెనుగా పరిచయమయ్యారు.
ఆ సంవత్సరమే కేంద్ర ప్రభుత్వం ఉత్తమ చిత్రాలను బహుమతులతో ప్రోత్సహించడం మొదలుపెట్టింది. వాహినీ ప్రతిష్టను పెంచిన ‘పెద్దమనుషులు’ చిత్రానికి కేంద్ర ప్రభుత్వం ఉత్తమ ప్రాంతీయ భాషా చిత్రంగా రజిత కమలాన్ని ఇచ్చి ప్రశంసించింది.
Source: 101 C, S V Ramarao