జానపద చిత్రాలకు డిక్షనరీగా చెప్పుకోదగ్గది విజయావారి ‘పాతాళభైరవి’. చక్కని, చిక్కని కథ, కథనం దీనికి ప్రాణం. దానికి తగ్గట్టు నటన, సంగీతం, ఛాయాగ్రహణం, కళాభైరవం అన్నీ కుదిరాయి. వాటిని ఆ విధంగా మలుచుకున్న శిల్పి – దర్శకుడు కె. వి. రెడ్డి.
దీనికి అరేబియన్ నైట్స్ కథల్లోని అల్లావుద్దీన్ అండ్ వండర్ ల్యాండ్ మూలం. దాన్ని తెలుగులో కాశీమజిలీ కథల ధోరణిలో తెరకు అద్భుతంగా మలచిన మహామహులు రచయిత పింగళి నాగేంద్రరావు. దర్శకులు కె. వి. రెడ్డి, సహాదర్శకులు కమలాకర కామేశ్వరరావు.
Click Here to go to Pathala Bhairavi (1951) Movie Page.
వనవిహారానికి వచ్చిన ఉజ్జయినీ రాకుమారి ఇందుమతిని ప్రేమిస్తాడు సామాన్యుడైన తోటరాముడు. సాహసించి కోటదూకి రాకుమారి మందిరం ప్రవేశించి తన ప్రేమని వెల్లడిస్తాడు. అయితే రాణీగారి తమ్ముడు వీరాధీరశూరసేనుడి కుట్రవల్ల రాముణ్ణి బంధిస్తారు సైనికులు.

రాకుమారిని అంతకుముందే పాముకాటు నుండి తప్పిస్తాడు రాముడు. రాకుమారిని భయంకరమైన పీడకల వస్తుంది. వీటిని గూర్చి విన్న మహారాజు జైలులో వున్న రాముణ్ణి కలిసి, సిరిసంపదలు సంపాదించి తరువాత తన కూతురి సంగతి ప్రస్తావించమని హెచ్చరించి వదిలేస్తాడు. ఇలావుండగా, నేపాళమాంత్రికుడు అన్ని శక్తులను మించిన పాతాళభైరవిని వశం చేసుకోవాలంటే యోజనగిరి కొనలోని మంత్రాలమర్రి కింద యక్ష నిక్షిప్తమైన ఆ శక్తికి సాహసవంతుడైన యువకుని లేదా తనవంటి మంత్రసిద్ధుని బాలి ఇవ్వాలని తెలుసుకొని అందుకు రాముణ్ణి తగినవాడుగా దుర్భిణిలో చూస్తాడు. విజయలక్ష్మి వరిస్తుంది, రాకుమారి లభిస్తుంది అన్న మాంత్రికుని మాటవిని అతని వెంట నడిచి పాతలబిలంలో బొట్టు దేవరును బద్దలుకొట్టి, కత్తుల బోనులో నడిచి, మొసలిని సంహరించి అసలు విషయం తెలుసుకొని తెలివిగా మాంత్రికున్ని సంహరిస్తాడు రాముడు. ఇక్కడితో కథ అయిపోయినట్టే. అయితే మాంత్రికుని శిష్యుడు సంజీవని స్పర్శతో గురువును బతికించుకోవడం, రాముడు ఇందుమతిని వివాహమాడే సమయానికి రాణీగారి తమ్ముడు అవివేకంవల్ల పాతాళభైరవి మాంత్రికునికి దక్కడం, వాడు రాకుమారితో, మాయమహాల్తో సహా మాయమవడం జరుగుతుంది. కథానాయకుడు ఆమెను వెతుక్కుంటూ వెళ్లడం, మాంత్రికుడు రాముణ్ణి ఎం చేస్తానో చూడు అంటూ హీరోని తన వద్దకు రప్పించి రాకుమారిని ఎదుట హింసిస్తాడు. స్నేహితుడు అంజి సహాయంతో రాముడు మాంత్రికుని వంచించి సంహరించి రాకుమారిని చేపడతాడు. సూక్ష్మంగా ఇది కథ.
ఇందులో మాంత్రికుని పాత్ర అద్భుత సృష్టి. దానికి ప్రాణం పోశారు యస్. వి. రంగారావు. సాహసం సేయరా డింభకా అంటూ నడకలో, నటనలో, వాచకంలో కొత్త ఒరవడిని సృష్టించి చిరస్మరణీయం చేశారు. యన్.టి.ఆర్. చూడముచ్చటగా సాహసోపేతమైన రాముడి పాత్రలో జీవించారు. కథానాయికగా మాలతి అందాలు ఓ ఆకర్షణ. ఇతర ముఖ్యపాత్రల్లో సి.యస్.ఆర్., రేలంగి, మోసం గురో అంటూ డింగరి పాత్రలో పద్మనాభం, అంజిగాడుగా బాలకృష్ణ, రాముడి తల్లిగా సురభి కమలాబాయి అమోఘంగా నటించారు. మాయమహల్ లోని ఒక నృత్యసన్నివేశంలో పాల్గొన్నారు సావిత్రి. ‘విచిత్రమేమిటంటే హాస్యనటునిగా వెలుగొందిన చదలవాడ కుటుంబరావు రెండుపాత్రల్లో కనిపిస్తారు. ఒకదానికి ఒకటే డైలాగు. రెండోదానికి కేవలం రియాక్షన్ మాత్రమే.
పింగళి నాగేంద్రరావు రచన చిత్రానికి ప్రాణం. కొత్తతరహాలో అయన రాసిన మాటలన్నీ జనంలో ప్రాముఖ్యం పొందాయి. ఇక పాటలు సరేసరి. ఆయన రాయగా ఘంటసాల స్వరపరచిన పాటలన్నిసూపర్ హిట్. తీయని ఊహలు హాయిని గొలిపే వసంత గానం, కలవరమాయే మదిలో, ఎంత ఘాటు ప్రేమయో, హాయిగా మనకింకా స్వేచ్ఛగా, కనుగొనగాలనో లేదో, ప్రేమకోసమై వలలో పడనే పాపం పసివాడు (గానం పి.జె. వర్మ) టి.జి. కమలాదేవి గానం చేసి,నటించిన బుర్రకథ, రేలంగి పాడిన వినవె బాల నా ప్రేమగోల అన్నీ హిట్ అయ్యాయి. మాధవపెద్ది గోఖలే – కళాధర్ వేసిన సెట్స్ అన్ని నాటి ఉజ్జయిని వాతావరణాన్ని తలపించగా మాంత్రికుడు గుహ సెట్ భయోత్పాతాన్ని కలిగిస్తుంది. వాటిని చక్కని ఎఫెక్ట్ తో చిత్రీకరించారు కెమరామెన్ మార్కస్ బార్ట్లే.
15.3.1951న తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ఈ చిత్రం 28 కేంద్రాలలో వందరోజులు ప్రదర్శింపబడింది. 1952లో మనదేశంలో జరిగిన అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రదర్శించబడిన ఏకైక తెలుగుచిత్రం ఇది. విజయవంతమైన ఈ చిత్రానికి నాగిరెడ్డి-చక్రపాణి నిర్మాతలు.

Source: 101 C, S V Ramarao