నటి అంజలీదేవి, భర్త సంగీత దర్శకుడు పి.ఆదినారాయణరావు ‘అంజలి పిక్చర్స్’ పతాకంపై తొలిసారిగా తెలుగు, తమిళ భాషల్లో నిర్మించి 14.1.1953 సంక్రాంతి రోజున విడుదల చేసిన చిత్రం ‘పరదేశి’. పల్లెటూరు వాతావరణం అందునా కొండ ప్రాంత నేపథ్యం చిత్రానికి ఓ తరహా కొత్తదనం, నిండుదనం తెచ్చిపెట్టింది.
చంద్రం అనే పట్నపు యువకుడు ఆరోగ్యం కోసం శీతగిరి వచ్చి అక్కడ పూలు అమ్ముకునే లక్ష్మి ని ప్రేమిస్తాడు. ఇద్దరూ గాంధర్వ వివాహం చేసుకుంటారు. వెంటనే చంద్రం స్వగ్రామం వెళ్లాల్సి వస్తోంది. కొన్ని పరిస్థితులరిత్యా మరణించిన తన స్నేహితుని భార్య సుశీల, ఆమె కుమారుడు ఆనంద్ లకు చంద్రం ఆశ్రయం ఇవ్వాల్సి వస్తుంది. ఈ సంగతి తెలిసిన లక్ష్మి చంద్రం తనను మోసం చేశాడని, సుశీల అతని భార్య అని అపోహపడి ఆ విషయం తండ్రి రంగడికి చెబుతోంది.ఆ షాక్ తో రంగడు ఆత్మహత్య చేసుకుంటాడు. చంద్రం వివరంగా ఉత్తరం రాసిన ఆమె పూర్తిగా చదవదు.
Click Here to go to Paradesi (1953) Movie Page.
తిరిగి శీతగిరి వచ్చిన చంద్రంను అవమానించి పంపేస్తుంది లక్ష్మి. అప్పటికే ఆమె గర్భవతి. ఆమె ఉన్న ఇల్లు దుర్మార్గుల పన్నాగం వల్ల కాలిపోగా ఆమె మరో ఊరికి వెళ్ళిపోతుంది. అక్కడ ఆమెకు ఆడబిడ్డ కలుగుతుంది.
16 ఏళ్ల తరువాత చంద్రం వద్ద పెరిగిన ఆనంద్, పల్లెటూరికి వచ్చి అక్కడ, లక్ష్మి కూతురు తారను చూసి ప్రేమిస్తాడు. ప్రేమ విషయం తెలిసిన లక్ష్మి తన కథను కూతురుకు చెప్పి హెచ్చరిస్తుంది. ఈ కథ తెలుసుకున్న ఆనంద్ తిరిగి చంద్రంకు చెప్పగా లక్ష్మీ బతికే ఉందని తెలుసుకొని పల్లెటూరుకు వస్తాడు. లక్ష్మికి ఎంత చెప్పినా వినకపోయేసరికి కొండమీదనుంచి దూకి ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాడు చంద్రం. సుశీల వల్ల నిజం తెలుసుకున్న లక్ష్మీ బాధపడుతుంది. తార ప్రయత్నం వల్ల చంద్రం ఆత్మహత్యా ప్రయత్నం విరమిస్తాడు.తారా-ఆనంద్ ల వివాహం, లక్ష్మి- చంద్రం అపోహలు తొలగి ఏకం కావడం తో కథ సుఖాంతమౌతుంది.
వయసులో ఉన్నప్పుడు, వయసు పెరిగాక వృద్ధులుగాను నాయికానాయకులుగా అంజలి దేవి, నాగేశ్వరరావు పాత్రోచితంగా నటించారు. ముఖ్యంగా పతాక సన్నివేశంలో అక్కినేని చూపిన నటన చిరస్మరణీయమైనది. కూతురుకు హితవు చెప్పే సన్నివేశంలో అంజలి దేవి నటనలో పరిణితి కనిపిస్తుంది. లక్ష్మి తండ్రి రంగడిగా ఎస్. వి. రంగారావు, సుశీలగా పండరిబాయి, తారగా వసంత ఆనంద్ గా శివాజీ గణేషన్, గాజులవాని పాత్రలో రేలంగి నటించారు.

సన్నివేశాలను హృదయాలకు హత్తుకునేలా తెరకు అనువదించడం లో దర్శకులు ఎల్.వి.ప్రసాద్ కృతకృత్యులయ్యారు. మల్లాది వెంకట కృష్ణశర్మ రచన చేయగా కమల్ ఘోష్ ఛాయాగ్రహణం నిర్వహించారు.
ఆదినారాయణ రావు సంగీత దర్శకత్వంలో రూపొందించిన “జీవితమే హాయి, నేనెందుకు రావాలి ఎవరికోసమో, పిలిపించి కలువపువ్వు పలికింది మల్లెపూవు” అన్న పాటలు హాయిగా ఉంటాయి. అక్కినేని- అంజలీ లపై చిత్రీకరించిన శకుంతల దుష్యంతుల ప్రణయం గీతం స్లో మోషన్ లో తీయటం చిత్రం లోని ప్రత్యేకత. దీనికోసం ప్రత్యేకమైన కెమెరాని పంపి సహకరించారు ప్రముఖ హిందీ చిత్ర దర్శకులు వి. శాంతారామ్. ఆనాటి అంజలి, అక్కినేని క్రేజీ కాంబినేషన్ కు ఉదాహరణగా చెప్పుకోదగ్గ చిత్రం ‘పరదేశి’.

Source: 101 C, S V Ramarao