“పొలాలనన్ని హలాదులన్నీ ఇలా తలంలో హేమాంపిండగ” అన్న శ్రీశ్రీ గీతాన్ని “చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా గతమెంతో ఘనకీర్తి గలవోడా” అన్న వేములపల్లి శ్రీకృష్ణ గీతాన్ని యధాతథంగా వాడుకొని జనావళిని ఉత్తేజపరచిన మహత్తర చిత్రం పీపుల్స్ ఆర్ట్స్ పతాకంపై నిర్మించిన “పల్లెటూరు”.
Click Here to go to Palletooru (1952) Movie Page.
అదొక పల్లెటూరు. యువజన నాయకుడు యన్.టి.ఆర్., సావిత్రిని ప్రేమిస్తాడు. ఆ వూళ్ళో జనానికి అప్పు ఇచ్చి పీడించే పెద్దమనిషి యస్.వి. రంగారావు. అతనికి వత్తాసుగా ఒక బ్రోకర్ రమణారెడ్డి. ఆ ఊళ్ళోనే మరొక ఆవేశంగల నిజాయితీపరుడు నాగభూషణం. గ్రామ ప్రజలకు పనికివచ్చే గ్రంథాలయం వున్న స్థలంలో గుడి కట్టాలని ప్రయత్నించటమేగాక గ్రామమంతా కరువుకోరల్లో చిక్కుకుంటే ధాన్యాన్ని నిలువవుంచి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తాడు. నాగభూషణం టి.జి. కమలాదేవిలది అన్యోన్య దాంపత్యం.

అయితే రంగారావు పన్నాగం వల్ల నాగభూషణం భార్యని అనుమానిస్తాడు. రంగారావు సావిత్రిని కూడా లొంగదీసుకోవాలని ప్రయత్నిస్తాడు. ఎదిరించి న్యాయం కోసం పోరాడిన కథానాయకుడు అరెస్టు చేయబడతాడు. అయితే కోర్టులో ధర్మం జయించి దుష్టుడు గణపతి (రంగారావు జైలు పాలవుతాడు. చంద్రం (రామారావు)కు నాయికతో పెళ్లవుతుంది.
గ్రామాల్లో జరిగే సంక్రాంతి సంబరాలు, చెడుగుడు పోటీలు అతి సహజంగా చిత్రీకరించారు. సుంకర, వాసిరెడ్డి రచన చేశారు. ఘంటసాల సంగీతాన్ని అందించారు. ‘వచ్చెను సంక్రాంతి, దేశసేవకుల హృదయం’ పాటలు సందర్బోచితంగా ఉంటె ‘ఆ మనసులోన, ఆ నడకలోన పరుగులెత్తే మృదుల భావనా మాలికల అర్థమేమిటో దెల్పురూ’ అన్న ఘంటసాల గీతం లలితగీతాల స్థాయిలో హాయిగా ఉంటుంది.
1952లో సహజత్వానికి పెద్దపీట వేసి తొలి చిత్రంతోనే సమర్ధుడు అనిపించుకున్న దర్శకుడు తాతినేని ప్రకాశరావు ఈ చిత్రంతో నిజంగా గురువు (ఎల్.వి. ప్రసాద్)కు తగ్గ శిష్యుడనిపించుకున్నాడు.

Source: 101 C, S V Ramarao