నవరసాల్లో హాస్యానికి సముచిత స్థానం ఉంది. దానిని తెరకు అనువదించడం ఆషామాషీ వ్యవహారం కాదు. ఈ రహస్యాన్ని జీర్ణించుకున్న తొలితరం దర్శకులు చిత్తజల్లు పుల్లయ్య. ఆయన బరువైన, కరుణరస ప్రధానమైన ‘సావిత్రి’, ‘లవకుశ’ వంటి చిత్రాలను తొలినాళ్లలో రూపొందించిన హాస్యానికి పెద్దపీట వేసి, గిలిగింతలు పెడుతూ, అశ్లీలానికి తావులేకుండా హాస్యనటున్ని (రేలంగి వెంకట్రామయ్య) కథానాయకుణ్ణి చేసి అందించిన చిత్రం ఈస్టిండియా ఫిలిం కంపెనీవారి ‘పక్కింటి అమ్మాయి’.
Click Here to go to Pakka Inti Ammayi (1953) Movie Page.
1952లో బెంగాలీలో సుధీర్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందించిన హాస్యరస ప్రధాన చిత్రం ‘పాషేర్ బరీ’. ‘బెంగాలీ చిత్రాలు విరివిగా నిర్మితమయ్యే కలకత్తాలోనే ఉన్న సంస్థ ఈస్టిండియా ఫిలిం కంపెనీ. అంతకుముందే ఆ సంస్థ సి. పుల్లయ్య దర్శకత్వంలో తెలుగులో అనేక హిట్ చిత్రాల్ని నిర్మించింది. పైన పేర్కొన్న ‘పాషేర్ బరీ’ ఆధారంగా ఆ సంస్థ తెలుగులో నిర్మించిన చిత్రమే ‘పక్కింటి అమ్మాయి’. తరువాత దీనిని ‘పడోసన్’ పేరుతో హిందీలో నిర్మించగా సూపర్ హిట్టయ్యింది. అటుపిమ్మట చాలా ఏళ్లకు తెలుగులో కె. వాసు దర్శకత్వంలో రూపొందించిన ‘పక్కింటి అమ్మాయి’ కూడా విజయాన్ని చవిచూసింది.
ఇక కథ విషయానికి వస్తే అనగనగా చదువు ఏమాత్రం అబ్బని ఓ బడుద్దాయి. పేరు సుబ్బారాయుడు. అతని ఇంటిపక్కనే ఉంటుంది కథానాయిక అంజలీదేవి. ఆమెకు నాట్యం అంటే వల్లమాలిన అభిమానం. ఆ కారణంగా ఆమె నృత్యరీతుల కనువుగా సంగీతాన్ని చెప్పే మాస్టార్ని (అద్దాల నారాయణరావు) పెట్టుకుంటుంది. పక్కఇంట్లో నివసించే సుబ్బారాయుడు చేష్టలు ఆమెకు నచ్చవు. అయితే ఆమెను ఆటపట్టించటానికి ఆమె పరీక్షకు వెళ్తుంటే పిల్లిని చంకలో పెట్టి ఎదురుగా వెళ్లి ‘పిల్లిదుశ్శకునము’ అని ఆమెను ఉడికిస్తాడు. ఆమెపై మనసు పారేసుకున్న సుబ్బారాయుడు తన మిత్ర బృందం ‘గ్యాస్ లాడ్జి’ సభ్యుల సలహా మేరకు తాను సంగీతం వచినట్టు పోజు పెడతాడు. ఆమె తన గురువును సుబ్బారాయుడి మీదకు ఉసిగొల్పుతోంది. సుబ్బారాయుడు తన గురువు సలహా మేరకు మరో మిత్రుడు రాజు పాట పాడుతుంటే దానికి తగ్గట్టు నటిస్తూ పెదాలు కదుపుతూ సుబ్బారాయుడు అద్భుతంగా అభినయిస్తాడు. దాంతో కథానాయిక కూడా సుబ్బారాయుడ్ని ప్రేమించే దాకా వస్తుంది.
అయితే అసలు గాయకుడు రాజు అని, సుబ్బారాయుడు కాదని తెలుసుకున్న నాయిక తన మనసు మార్చుకుంటుంది. సుబ్బారాయుడ్ని రక్షించుకోవడానికై మిత్రుడు పన్నిన వ్యూహంలో భాగంగా సుబ్బారాయుడు చచ్చినట్టు నటిస్తాడు. కథానాయిక మనసు మార్చుకొని సుబ్బారాయుడి ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. క్లుప్తంగా ఇదీ కథ.
అయితే దీనిని అనన్యసామాన్యరీతిలో చెక్కిలిగింతలు పెట్టేలా తీర్చిదిద్దిన శిల్పి సి. పుల్లయ్య, ముద్దుకృష్ణ రచన చేయగా అశ్వర్థామ సంగీతాన్ని అందించారు. ఏ. యం. రాజు పాడిన ‘కలయేమో ఇది నాజీవిత ఫలమేమో’ అన్న పాట మరువలేనిది. ఇందులో గ్యాస్ లాడ్జి లీడరుగా సుప్రసిద్ధ దర్శకులు సి. యస్. రావు, ఇతర మిత్రులుగా తాతాచారి, ఆర్. కె. రావు, ప్రముఖ గాయకుడు ఏ. యం. రాజు నటించారు. కె. వాసు తీసిన చిత్రంలో ఏ. యం. రాజు పాత్రను ప్రముఖ గాయకులూ ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం పోషించగా, పోటీ గాయకుని పాత్రను సంగీత దర్శకుడు చక్రవర్తి, కథానాయికగా జయసుధ, హీరోగా చంద్రమోహన్ నటించారు.’హాస్య నటచక్రవర్తి’గా రేలంగిని మహోన్నతస్థాయిలో నిలబెట్టిన నాటి చిత్రం ‘పక్కింటి అమ్మాయి’.

Source: 101 C, S V Ramarao