రేణుకా ఫిలిమ్స్ పతాకంపై స్వీయ దర్శకత్వంలో సంగీతాన్ని కూడా అందించి కథానాయక పాత్ర పోషించి ‘త్యాగయ్య’గా ప్రేక్షకుల్ని మెప్పించిన నాగయ్య నటునిగా, నిర్మాతగా అందించిన రెండవ చిత్రం ‘నా ఇల్లు’ దీనిని ఆవరిండియా పతాకంపై తెలుగు, తమిళ భాషల్లో నిర్మించారు.
రెండు భాషల్లోనూ హీరోగా నాగయ్య, కథానాయిక పాత్రలో సౌందర్యరాశి టి. ఆర్. రాజకుమారి (సంధ్య సోదరి), ఇతర ముఖ్యపాత్రల్లో దొరస్వామి, లింగమూర్తి, రామశర్మ, గిరిజ, ఛాయాదేవి కనిపిస్తారు.
Click Here to go to Naa Illu (1953) Movie Page.
బ్యాంకు ఉద్యోగి శివరాం భార్యతో, ఇద్దరు బిడ్డలతో సుఖజీవనం సాగిస్తుంటాడు. ఆ దంపతులకు సంగీతం అంటే అభిమానం. తమ పిల్లలకు సంగీతం అబ్బితే బాగుందని దానికి తగ్గ ప్రయత్నాలు చేస్తారు. బ్యాంకు వ్యవహారంలో బొంబాయినుంచి డబ్బు తెచ్చిన శివరాం దుర్మార్గుడు ధనరాజ్ పన్నాగంవల్ల లీల అనే వగలాడి వలలో చిక్కుకోవడంతో డబ్బు పోగొట్టుకొని జైలుపాలవుతాడు. తిరిగి వచ్చేసరికి కుటుంబ పరిస్థితులు తారుమారవుతాయి. జీవనయానం కోసం శివరాం పాకీపనికి కూడా సిద్ధపడతాడు. ఈలోగా శివరాం పిల్లలకు బాలానంద సంఘంనుంచి ప్రోత్సాహం లభిస్తుంది. వారు ప్రయోజకులవుతారు. ధనరాజ్, లీల పన్నాగం బయటపడి శివరాం భార్యాపిల్లలను కలుసుకుంటాడు. కథ సుఖాంతమవుతుంది.
కొంచెం వయసు మళ్ళిన పాత్రను నాగయ్య ధరించటం ఈ చిత్రంతోనే మొదలైంది. ఈ చిత్రంలో సంగీతానికి పెద్దపీట వేశారు నాగయ్య. ఆయనే సంగీతం దర్శకత్వం వహించగా అద్దేపల్లి రామారావు సహకరించారు. దేవులపల్లి కృష్ణశాస్త్రీ రచన చేశారు. విశేషమేమంటే బొంబాయిలో జరిగిన కథ భాగానికి సంబంధించిన చిత్రీకరణలో రెండు హిందీ పాటల్ని పెట్టారు. తెలుగు సినిమాలో హిందీ పాటలు ఏమిటా అని ఆశ్చర్యపోవచ్చు. కానీ కథాపరంగా అవి సహజమనిపిస్తాయి. ఆ పాటల్ని మీనాకపూర్ పాడగా తెలుగు పాటల్ని నాగయ్యతోపాటు ఎం.యల్. వసంతకుమారి కూడా గానం చేశారు. చిత్రంలో ఎం.ఏ.రెహ్మాన్ ఛాయాగ్రహణం చెప్పుకోదగ్గది.
అటు రచనాపరంగాను, ఇటు సంగీతపరంగాను ఎన్నదగిన పాట “అదిగదిగో గగనసీమ, అందమైన చందమామ ఆడెనోయీ” సారంగా రాగంలో రూపొందించిన ఈ పాట అపురూపం అని సంగీత విశ్లేషకులు వి.ఏ.కె. రంగారావు ప్రశంసించారు. ఆర్థికంగా ‘త్యాగయ్య’ స్థాయిలో విజయం సాధించకపోయినా “నీ ఇల్లే పూల వనం, నీ సర్వం ప్రేమధనం, మరువకోయి ఈ సత్యం” అంటూ ప్రేమపూరిత సంసార జీవితంలోని మధురిమలను తెరపై అపురూపంగా ఆవిష్కరించిన చిత్రం ‘నా ఇల్లు’.
Source: 101 C, S V Ramarao