స్వాతంత్ర్యానికి పూర్వం దేశభక్తులు, రాజకీయ నాయకులు పడ్డ అగచాట్లను పోలీసు అధికారుల దౌష్ట్యాన్ని నేపథ్యంగా ఎంచుకుని శోభనాచల పతాకంపై ఎల్.వి.ప్రసాద్ దర్శకత్వంలో మీర్జాపురం రాజా నిర్మించిన చిత్రం ‘మన దేశం’.
Click Here to go to Mana Desam (1949) Movie Page.
అగ్రహారం లో నివసిస్తున్న రామనాథం, జానకి దంపతులకు ఒక్కడే కొడుకు నెహ్రూ. రామనాథం సవితి తల్లి యశోధర, ఆమె కొడుకు మధు కూడా అక్కడే ఉంటుంటారు. మధు దేశభక్తి, రాజకీయ అవగాహన ఉన్నవాడు. జానకి పినతండ్రి బారిస్టర్, ఆయన కూతురు శోభ అగ్రహారానికి వస్తారు. కాంగ్రెస్ వ్యవహారాలు శోభకు నచ్చవు. సిద్ధాంత రీత్యా మధు తో విభేదించినా అతన్ని అభిమానిస్తుంది శోభ.
వారు తిరిగి మద్రాసు వెళతారు. అక్కడ పోలీసుల చేతుల్లో యువతరం ఎట్లా చిత్రహింసలు పడుతున్నది కళ్లారా చూస్తుంది శోభ. మనసు మార్చుకుని తాను కూడా రాజకీయాల్లో ఉత్సాహంగా పాల్గొంటుంది. మధు పై జరిగిన లాఠీఛార్జి తో అతను మతిస్థిమితం, జ్ఞాపకశక్తి కోల్పోతాడు. రామనాథంను, యశోదను పోలీసులు అరెస్టు చేస్తారు. జానకి మరణిస్తుంది. భారతావనికి తొలుత స్వాతంత్య్రం లభిస్తుంది. రామనాథం మొదలగు వారికి జైలు నుంచి విముక్తి లభిస్తుంది. శోభ సహకారంతో మధు ఆరోగ్యం క్రమేపి కుదుటపడుతుంది. అందరూ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటారు. క్లుప్తంగా ఇది కథ.
ఈ కథను తెరకు మలచడం కత్తి మీద సాము వంటిది. ఇది దర్శకుడు ఎల్.వి.ప్రసాద్ కు నాలుగవ చిత్రం. అయినా ప్రతి సన్నివేశం నిండుగా అర్థవంతంగా తీర్చిదిద్దారు.
ముఖ్య పాత్రల్ని నాగయ్య, నారాయణ రావు, రేలంగి, వంగర, రామనాథ శాస్త్రి, కృష్ణవేణి, కాంచన, హేమలత, సురభి బాలసరస్వతి పోషించారు. యన్ .టి. రామారావు తొలిసారిగా ఈచిత్రంలో ఒక పోలీసు ఇన్స్పెక్టర్ పాత్రలో చిత్రరంగానికి పరిచయమయ్యారు.
సముద్రాల రాఘవాచార్య మాటలు, పాటలు రాశారు. కథలో కొంత భాగం శరత్ నవల ‘ విప్ర దాసు’ ప్రభావం ఉందని విమర్శకుల అభిప్రాయం.
రేలంగి, బాల సరస్వతి మీద చిత్రీకరించిన హాస్య గీతం ‘ పంచదార వంటి పోలిసెంకటసామి నిను నేను మరువలేనురా’ బాగా పాపులర్ అయింది. ‘ జయ జనని పరమ పావని, జయ జయ జయ భారత జనని, వెడలిపో వెడలిపో తెల్ల దొర మా దేశపు ఎల్ల దాటి వెడలిపో’ అనే దేశభక్తి గీతాలు ఎం. యస్. రామారావు, కృష్ణవేణి పాడిన ‘ ఏమిటో ఈ సంబంధం’ అనే యుగళగీతం కూడా చెప్పుకోదగ్గవే!
ఎం. ఏ. రెహమాన్ తన ఫోటోగ్రఫీలో నాటి రాజకీయ వాతావరణాన్ని కళ్ళకు కట్టినట్లు చిత్రీకరించారు. ఎన్నో ప్రాధాన్యతలు సంతరించుకున్న నాటి రాజకీయ చిత్రం ” మన దేశం”.
Source: 101 C, S V Ramarao