March 15, 2020

Malliswari (1951): Evergreen Epic on Celluloid #TeluguCinemaHistory

Malliswari (1951): Evergreen Epic on Celluloid #TeluguCinemaHistory

“వందేమాతరం” చిత్ర నిర్మాణానికి హంపీ వెళ్లి విరూపాక్ష దేవాలయాన్ని దర్శించిన కళాశ్రేష్ఠ బి. ఎన్. రెడ్డి తీవ్రమైన అనుభూతికిలోనై ఎప్పటికైనా విజయనగర సామ్రాజ్య వైభవానికి సంబంధించిన కథను రూపొందించాలని నిర్ణయించుకున్నారు. అయితే అది అమలు కావడానికి దశాబ్దం పట్టింది. ఇలస్ట్రేటెడ్ వీక్లీలో పడ్డ ఓ కథ, బుచ్చిబాబు రాసిన రేడియో నాటకం ఈ రెండూ ‘ మల్లీశ్వరి’ రూపకల్పనకు స్ఫూర్తినిచ్చాయి. అప్పటికే రచయితగా లబ్దప్రతిష్టులైన దేవులపల్లి కృష్ణశాస్త్రికి తొలిసారిగా చిత్ర రచన బాధ్యతలను అప్పచెప్పారు బి.ఎన్. అలాగే సంగీత బాధ్యతను సాలూరు రాజేశ్వరరావు, అద్దేపల్లి రామారావులకు అప్పజెప్పారు. ఘంటసాల గానం సరేసరి. ఇక ఎ.కె. శేఖర్ నాటి రాయల సామ్రాజ్య వైభవానికి తగ్గట్టు సెట్ స్కెచ్లను రూపొందించారు. బి.ఎన్.కొండారెడ్డి ఛాయాగ్రహణం. తెరవెనుక హేమాహేమీలు చేసిన కృషికి తెరపై ప్రాణం పోశారు భానుమతి, యన్. టి. రామారావు, ఋష్యేంద్రమణి, శ్రీ వాత్సవ, కుమారి, టీ.జి.కమలాదేవి, దొరస్వామి, వంగర మొదలగువారు. ఫలితంగా తెలుగువారు సగర్వంగా ఇది మా తరగని చెరగని ఆస్తి అని చెప్పుకోదగ్గ అద్భుత కళా ఖండం, ‘EVER GREEN EPIC ON CELLULOID’ గా ‘ మల్లీశ్వరి’ ఆవిర్భవించింది.

Click Here to go to Malliswari (1950) Movie Page.

విజయనగర సామ్రాజ్య పరిధిలోని వీరాపురం గ్రామం లోని ప్రజలకు బట్టల నేత ప్రధాన కులవృత్తి, మేనత్త, మేనమామల పిల్లలు నాగరాజు, మల్లీశ్వరి. ఒకరంటే మరొకరికి వల్లమాలిన అభిమానం. వీరిద్దరూ ఒకరినొకరు ఉడికించి కొంటూ ఆ అల్లరిలోనే పెరిగి పెద్ద వారవుతారు. ఆర్థికంగా కొంచెం స్థాయిగల మల్లీశ్వరి తల్లి నాగమ్మకు వారిద్దరికి మనువు జరగటం ఇష్టం లేదు. ఇది గ్రహించిన నాగరాజు సిరి సంపదలు సంపాదించడానికి నగరం వెళ్తాడు. ఈలోగా ఒకానొక సందర్భంగా వర్షపు రాత్రి సత్యంలో మల్లీశ్వరి నాట్యాన్ని రాయలు ప్రచ్ఛన్న వేషంలో తిలకించి మల్లీశ్వరికి రాణివాసపు పల్లకి పంపించి పిలిపించికుంటాడు. సంపదతో నాగరాజు తిరిగి వచ్చేసరికి ‘ మల్లీశ్వరి’ రా నివాసానికి వెళ్లి పోయి ఉంటుంది. ఇక నాగరాజు పిచ్చివాడై మల్లీశ్వరి రూపాన్ని శిల్పాలుగా చెక్కుతాడు. అది చూసిన ఆస్థాన శిల్ప చారి నాగరాజును నర్తనశాల నందనోద్యానవనంలో శిల్పాలను చెక్కడానికి నియమిస్తాడు. అక్కడ మల్లీశ్వరి రాణివాసపు ‘ బంగారు పంజరం’లో బాధతో కుమిలిపోతూ ఉంటుంది.

అదృష్టవశాత్తూ ఒకసారి తోటలో అనుకోకుండా ఇద్దరు కలుసుకుంటారు. ఆ తరువాత ఇద్దరూ పారిపోవాలను కొంటారు. సరిగ్గా అదే సమయానికి మల్లీశ్వరి ఉషాపరిణయం నృత్య గానంలో పాల్గొనాల్సి వస్తుంది. సాహసించి మందిర ప్రవేశం చేసిన నాగరాజుని సైనికులు బంధించి చెరసాలలో పెడతారు. సభా స్థలి లో విచారణ జరిపిన రాయలు పెద్ద మనసుతో వారిద్దరికీ స్వేచ్ఛా జీవితం ప్రసాదిస్తారు. ఇదీ కథ.

చిత్రం మొదట వినిపించే వ్యాఖ్యానాన్ని, ‘ లంబోదర లకుమికరా’ గీతాన్ని అందించారు నాగయ్య. ‘ ఇది వాహిని తో వారికి గల అనుబంధాన్ని గుర్తు’.

‘ మల్లీశ్వరి’ పేరు చెప్పగానే గుర్తు వచ్చేది అందులోనే అపురూపమైన సంగీత సాహిత్యాలు. ప్రతి గీతం ఒక ఆణిముత్యం.

కోతి బావకు పెళ్ళంట పాటలు బాకా బాజా, డోలు, సన్నాయి అంటూ పెళ్లి వాతావరణాన్ని సంగీతపరంగా వినిపిస్తారు. ” కురియు నా కన్నీరు గుండెలో దాచుకుని వానజల్లుగా కురిసిపోవ. అనవాలుగ బావమ్రోలా” అంటూ నాయిక మేఘాల ద్వారా ప్రియునికి సందేశం పంపిన వైనం గమనిస్తే కాళిదాసు ప్రభావం కృష్ణశాస్త్రి పై ఉందనిపిస్తోంది. ” నల్లని మబ్బులు గుంపులు గుంపులు తెల్లని కొంగలు బారులు బారులు” అన్న దృశ్యం రసజ్ఞ చిత్రీకరణకు కుంచెకు పని కల్పించే అద్భుత భావం.


” ఎన్నాళ్లకి బతుకు పండెనో, ఎంత హాయి ఈ రేయి నిండెనో” అన్న గీతంలో విరహోత్కంఠితయైన మల్లీశ్వరి అంతరంగాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు దేవులపల్లి. ఈ గీతంలో ” గడియయేని ఇక విడిచిపోకుమా, ఎగసిన హృదయము పగలనీయకుమా” అన్న చరణం వింటే ప్రియ సమాగమం తో బరువెక్కిన ఆమెకు వియోగం విధించిన శిక్ష ఫలితాన్ని సూచిస్తుంది. ‘ బాలానందం’ అన్నయ్య న్యాపతి రాఘవరావు ఇందులో ఆస్థానకవిగా నటించడం ఓ ప్రత్యేక విశేషం. నటనా పరంగా ఎంతో నిగ్రహాన్ని ప్రదర్శించారు, భానుమతి, రామారావు. వీరిద్దరూ ఆ పాత్రలో నటించారనటంకంటే జీవించారు అనటం సబబు. సన్నివేశాలు, వాతావరణం అణువుణువుగా సహజత్వంతో కనువిందు చేస్తాయి.

స్వర విరించి సాలూరు రాజేశ్వరరావు, సాహితీ వనమాలి దేవులపల్లి, పద్మ భూషణుడు బి.యన్.రెడ్డి వీరిలో ఎవరు ఎవరికి రుణపడ్డారో లేక రసజ్ఞ ఆంధ్రదేశమే వారికి రుణపడిందో వివరించటానికి వీలులేని పజిల్ ‘మల్లీశ్వరి’ చిత్రం. చైనాలో జరిగిన ఏషియన్ ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్షింపబడ్డ ఈ చిత్రానికి ప్రశంసలు లభించాయి.

20.12.1951న విడుదలై నేటికీ రసజ్ఞ శ్రోతలకు, ప్రేక్షకులకు రసానుభూతుల్ని అందిస్తూ వారి మనస్సులో మల్లెలు పూయించే మనోజ్ఞ చిత్రం ‘మల్లీశ్వరి’.

Source: 101 C, S V Ramarao

Spread the love:

Comments