1950 ప్రాంతాల్లో గ్లామరస్ స్టార్ గా వెలుగొందిన నటీమణీ జి. వరలక్ష్మి. అయితే అందుకు భిన్నంగా పూర్తిగా డీగ్లామర్డ్ పాత్రలో అక్కినేని నాగేశ్వరరావుకు, నంబియార్ కు తల్లిగా వయసుమళ్ళిన పాత్రలో నటించి ప్రేక్షకుల్ని మెప్పించిన చిత్రం ‘కన్నతల్లి’ స్వీయ దర్శకత్వంలో కె.ఎస్.ప్రకాశరావు తెలుగు తమిళ భాషల్లో ఈ చిత్రం నిర్మించారు.
నాటి సినీ సాహిత్య రంగంలో దిగ్గజాలు గా పేరొందిన తాపీ ధర్మారావు, శ్రీశ్రీ, ఆత్రేయ, ఆరుద్ర, సుంకర, వాసిరెడ్డి ఇలా ఆరుగురు రచయితలు ఈ చిత్రానికి రచన చేయడంలో ఓ ప్రత్యేకత. నటిగా రాజసులోచన గాయనిగా పి.సుశీల ఈ చిత్రం ద్వారా సినీ రంగానికి పరిచయం కావటం మరో ప్రత్యేకత. పెండ్యాల నాగేశ్వరరావు సంగీతాన్ని అందించారు.
Click Here to go to Kanna Talli (1953) Movie Page.
ఇహ కథ విషయానికి వస్తే అప్పటికే హిందీలో విడుదలయిన విజయవంతమైన మెహబూబ్ చిత్రం ‘ఔరత్’ న్యూథియేటర్స్ వారి ‘సౌగంద్’ చిత్రం. ఈ రెండు కథలు కలిపి తెలుగుకోసం పైన పేర్కొన్న రచయితలు ఈ కథను తయారుచేశారు.
శాంత (జి. వరలక్ష్మి), చలపతి (ఆర్. నాగేశ్వరరావు)ని పెళ్లాడుతుంది. వారికి రాము (నాగేశ్వరరావు) శంకర్ (నంబియార్) ఇద్దరు పిల్లలు. కుటుంబాన్ని పోషించలేని చలపతి భార్యాబిడ్డల్ని వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోతాడు. శాంత కుటుంబభారాన్ని మోస్తూ విస్తళ్ళు కుట్టి రాము ద్వారా అమ్మిస్తుంది. ఆ సొమ్ముతో టౌన్లో శంకర్‌ను ఉంచి చదివిస్తుంది. రాము కట్నం తీసుకొని పెళ్లి చేసుకొని ఆ డబ్బు కూడా తమ్ముడికి పంపిస్తాడు. తమ్ముడు శంకర్ టౌన్లో చేదు అలవాట్లకు బానిస అవుతాడు. శంకర్‌ను పల్లెటూరులో ఉండే గౌరి ప్రేమిస్తుంది.
శాంత కొడుకును మంచి దారిలో పెట్టాలని టౌన్ కు వెళ్లేసరికి శంకర్ తన ఉంపుడుగత్తెను చంపి పారిపోతాడు. ఇది చూసిన శాంత తన కొడుకును రక్షించటానికి ఆ హత్యానేరం తనపై వేసుకుంటుంది. జైలులో ఆమె తన భర్త చలపతిని కలుసుకొని జరిగిన కథ చెబుతుంది. అక్కడికి వచ్చిన రాము త్యాగబుద్ధితో హత్యానేరం తనపై వేసుకొంటానంటాడు. కానీ తల్లి వారించి శంకర్ ను గౌరికి పెళ్లి జరిపించమని కోరుతుంది. అపరాధిగా చట్టానికి చిక్కిన కన్నతల్లి శాంతను సుదూరతీరాలకు తరలిస్తారు పోలీసులు.
సాత్విక నటనకు అవకాశమున్న రామూ పాత్రలో అక్కినేని, విలన్ టచ్ వున్న శంకర్ పాత్రలో తమిళ విలన్ నంబియార్, టైటిల్ పాత్రలో జి.వరలక్ష్మి రాణించారు. ఆర్. నాగేశ్వరరావు, పేకేటి శివరాం, సి. వరలక్ష్మి, కోడూరు అచ్చయ్యచౌదరి, సుధాకర్, మోహన్ సహాయ పాత్రల్ని సమర్థవంతంగా పోషించారు.
చిన్న మార్పులతో ఇదే కథ స్పూర్తితో హిందీలో మెహబూబ్, నర్గిస్ ప్రధాన పాత్రల్లో ఎంతో రసవత్తరంగా ‘మదర్ ఇండియా’ పేరుతో నిర్మించారు. దానినే తిరిగి తెలుగులో జమున ప్రధాన పాత్రలో ‘బంగారు తల్లి’గాను, ఆ తరువాత జయసుధ ప్రధాన పాత్రలో ‘శక్తి’ పేరుతోనూ నిర్మించారు.
గాయనిగా పి.సుశీల ఈ చిత్రం ద్వారా సినీ రంగానికి పరిచయం కావటం మరో ప్రత్యేకత. పెండ్యాల నాగేశ్వరరావు సంగీతాన్ని అందించారు.

Source: 101 C, S V Ramarao