May 4, 2020

Illarikam (1959): Silver Jubilee Blockbuster #TeluguCinemaHistory

Illarikam (1959): Silver Jubilee Blockbuster #TeluguCinemaHistory

1959న విడుదలయిన పి.ఏ.పి. వారి ‘ఇల్లరికం’ చిత్రవిజయాన్ని కొంచెం లోతుగా విశ్లేషిస్తే ఇందులో.. ఇరవైశాతం పెళ్ళికిముందు జరిగే హీరో హీరోయిన్ల పరిచయాలు, జగడాలు, అవి ప్రేమగా మారే సన్నివేశాలు, ఇరవైశాతం పెళ్ళయ్యాక బంధువుల మధ్యగల ఆప్యాయతలు, అనురాగాలు, సెంటిమెంట్లతో కూడిన సన్నివేశాలు ఇరవైశాతం భార్యాభర్తల మధ్య వచ్చే అనుమానాలు, అపార్థాలూ, దెప్పిపొడుచుకోవటాలు పదిహేనుశాతం తిట్లకి దోహదపరిచే దిశగా దుష్టులు చేసే ప్రయత్నాలు చాపకింద నీరులా తిన్నఇంటికే ఎసరు పెట్టే పన్నాగాలు, పదిహేనుశాతం కథతో ముడిపడ్డ హాస్యం,మిగతా పదిశాతం హీరో మారువేషాలు, ఫైట్లు, థ్రిల్స్ విటన్నిటిని కలబోసి, సంగీత సాహిత్యాలను మేళవించి, అనుభవజ్ఞులైన నటీనటులచే తెరపై ఆవిష్కరించటం. పైన పేర్కొన్న రీతిలో సదాశివబ్రహ్మం కథను వండితే దానిని జనరంజకంగా మలిచిన దర్శకుడు తాతినేని ప్రకాశరావు.

Click Here to go to Illarikam (1959) Movie Page.

కథ విషయానికి వస్తే ఒక జమీందారు (గుమ్మడి) మైకా గనులకు యజమాని. ఆయన కూతురు రాధ (జమున), కాలేజిలో జరిగిన సాంస్కృతిక పోటీల్లో ఆమెతో పోటీకి దిగి గెలిచిన కుర్రాడు వేణు (అక్కినేని). వీరిద్దరి మనుసులు కలుసుకొని పెళ్ళి చేసుకోవాలనుకుంటారు. దీనికి రాధ తల్లి (హేమలత) ఇష్టపడదు. అయినా పెళ్ళి జరుగుతుంది. అయితే వేణు ‘ఇల్లరికం’ వెళ్ళాల్పొస్తుంది. ఆక్కడ జమీందారుగారి ఆఫీసు వ్యవసారాలు చూస్తుంటాడు. ఆయనకు వరసకు బావమరిది సి.యస్పార్. ఈయన కొడుకు దుష్టుడయిన శేషగిరి (ఆర్.నాగేశ్వరరావు) పూర్వాశ్రమంలో ఇతను వేణు చెల్లెల్ని (గిరిజ) పెళ్చి చేసుకొని మోసగించాడు.

ఆమె నాట్యం చేస్తూ బతుకుతుంటుంది. ఒకసారి ఆ నాట్యాన్ని చూసిన వేణు ఆమెను మందలిస్తాడు. ఈ సన్నివేశాన్ని దూరంనుంచి చూసిన రాధ వారిద్దరినీ అనుమానిస్తుంది దాంతో భార్యాభర్తల మధ్య దూరం పెరుగుతుంది. ఈలోగా రాధ బలవంతం మీద జమీందారు ఆస్తి రాధ పేర రాసి మరణిస్తాడు.

భర్తపై అనుమానాన్ని పెంచుకొన్న రాధ ఆఫీసు వ్యవహారాల్ని తిరిగి శేషగిరికి అప్పజెబుతుంది. ఒక సందర్భంలో రాధను బలాత్కారం చేయబోయిన శేషగిరికి ముసుగు మనిషి వేషంలో బుద్ధిచెబుతాడు వేణు. ముసుగుమనిషి హెచ్చరికతో శేషగిరి భార్యను ఇంట్లోనే వుంచుకుంటాడు. అనువమానం పెరిగిన రాధ భర్తను తీవ్రంగా అవమానిస్తుంది. రాధ తల్లి అల్లుణ్ణి రౌడీల చేత కొట్టించాలని ఆలోచిస్తుంది. ఆమె అన్న ఇచ్చిన సలహా దీనికి ప్రేరణ.

క్లయిమాక్స్ లో రాధను, మారువేషంలో వచ్చిన వేణును దుర్మార్థులు చెట్టుకు కట్టేస్తారు. రాధలో అప్పుడు పశ్చాత్తాపం ప్రారంభమవుతుంది. అన్నా చెల్లెళ్ళ బంధాన్ని గ్రహిస్తుంది. ఆప్పుడు వేణు శేషగిరి ముఠాతో పోరాడతాడు. చివరకి బావ గాబట్టి హీరో క్షమించి వదిలేస్తాడు.

 సదాశివబ్రహ్మం తయారుచేసి ఈ కథలో రమణారెడ్డికి ఇల్లరికం వచ్చిన అల్లుడు రేలంగి. వీరిద్దరికీ మధ్య జరిగే హాస్య సన్నివేశాలు కనువిందు చేస్తాయి. మరో ఇల్లరికపుటల్లుడు పేకేటి శివరాం. కథకుతగ్గ రసవత్తరమైన సంభాషణల్ని రాశారు ఆరుద్ర. ప్రధాన పాత్రల్లో అక్కినేని, జమున హుషారు సన్నివేశాల్లోనూ, సీరియస్ సన్నివేశాల్లోనూ తమ పాత్రల్ని పండించారు.

టి.చలపతిరావు సంగీత దర్శకత్వంలో రూపుదిద్దుకొన్న పాటలన్నీ సూపర్ హిట్టయ్యాయి. చిత్రం మొదట్లో వచ్చే సవాలు పాట “అడిగిందానికి చెప్పి”, హీరో సోలో “ఎక్కడి దొంగలు అక్కడనే గప్చిప్”, యుగళగీతం “నేడు శ్రీవారికి మేమంటే పరాకా”, గిరిజ నృత్యగీతం “మధుపాత్ర నింపవోయి”, కొసరాజు హాస్యగీతం “భలే ఛాన్సులే, ఇల్లరికంలో వున్న మజా’, పిక్నిక్ సాంగ్ “చేతులు కలిసిన చప్పట్లు, ముచ్చట్లు’ అన్ని సందర్భోచితంగా పున్నాయి. కొసరాజు రాయగా హీరో మారువేషంలో నాయికను టీజ్ చేస్తూ పాడిన “నిలువవే వాలుకనులదానా” సూపర్ హిట్, నవరసాలు సమపాళ్లలో కుదిరిన చిత్రం ‘ఇల్లరికం’. అందుకే ఎల్.వి.ప్రసాద్ దీనిని హిందీలో ‘ససురాల్’ పేరిట నిర్మించి హిట్ కొట్టారు.

Illarikam was one of the very few earlier day Telugu films to run for 50 days in Hyderabad. Lead actors and technicians participated in the celebrations held in theatres all over the Telugu country for 50 days, 100 days (in 18 centres) and in the silver jubilee functions.

Source: 101 C, S V Ramarao

Spread the love:

Comments