లక్ష్మీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మితమైన ‘ఇలవేలుపు’ చిత్రానికి నిర్మాత యల్. వి. ప్రసాద్, అయన వ్యక్తిగత జీవితానికి, ఈ చిత్రకథకు కొంత సంబంధం ఉంది. ఆయన అనారోగ్యంతో ఉన్నప్పుడు భీమవరం ప్రాంతంలోని ప్రకృతి ఆశ్రమంలో కొంతకాలం చికిత్స పొందారు. ‘ఇలవేలుపు’ కథలోని ప్రధాన దృశ్యాలకు అంకురార్పణ జరిగింది ప్రకృతి ఆశ్రమంలోనే!
Click Here to go to Ilavelpu (1956) Movie Page.
సహజత్వానికి మరికొంత రసవత్తరమైన కల్పనతో ప్రేమకథను జోడించి చిత్రకథను తయారుచేశారు సదాశివబ్రహ్మం. పినిశెట్టి శ్రీరాముమూర్తి, దీనికి పినిశెట్టి మాటలు రాశారు. ప్రసాద్ శిష్యుడు డి.యోగానంద్ దర్శకత్వం వహించారు. కలనారి అబ్బాయి శేఖర్ (అక్కినేని) ప్రకృతి ఆశ్రమంలో చికిత్స పొందుతున్న తన స్నేహితుడ్ని (చలం) చూడడానికి వస్తాడు. ఆక్కడ సేవలందించే శారద (అంజలిదేవి)ని అభిమానిస్తాడు. ఆమె కూడా అతని చిలిపిచేష్టల్ని కసురుకుంటూనే మానసికంగా దగ్గరవుతుంది. ఒకరిపై మరొకరికి అనురాగం ఏర్పడుతుంది. ఇంతలో శేఖర్ కు విదేశాలకు వెళ్ళే అనకాశం వస్తుంది. తిరిగి వచ్చాక పెళ్ళి చేసుకుందామనుకుంటారు.
అయితే శేఖర్ బంధువుల ఆమ్మాయి లక్ష్మి (జమున) తో అతని పెళ్ళి జరిగితే బాగుంటుందని బంధువులు అనుకంటారు.ఆశ్రమంలో శారద, విమానంతో ప్రయాణం చేస్తున్న శేఖర్, అతడ్ని చేసుకోవాలనుకున్నలక్ష్మీ… ఈ ముగ్గురూ చందమామను ఉద్దేశించి ‘చల్లని రాజా ఓ చందమామా’ అనే పాట పాడుకుంటారు. దురదృష్టవశాత్తూ శేఖర్ ప్రయాణం చేస్తున్న విమానం మంటల్లో చిక్కుకుని ప్రమాదానికి గురి అవుతుంది. అక్కడ శేఖర్ తండ్రి (గుమ్మడి), అశ్రమంలో శారద, శేఖర్ మరణవార్త విని తల్లడిల్లిపోతారు.
శారద తండ్రి, శేఖర్ తండ్రి పొలంపనులు చూస్తుంటాడు. ఓసారి శారదను వెంటబెట్టుకుని శేఖర్ ఇంటికి వెళ్ళి అక్కడ పరస్థితుల్ని చూసి చలించిపోతాడు. శేఖర్ తమ్ముళ్ళు, చెల్లెళ్ళ ఆలనాపాలనా చూసేవారులేన అందులో ఒకరికి పోలియో, ఈ వ్యవహారాలు చక్కదిద్దడానికి కొడుకు పోయిన బాధన దిగమింగడానికి శారదతో పెద్దాయన పెళ్ళి జరిగితే మంచిదని అందరూ భావిస్తారు. ఆ ప్రకారం శేఖర్ తండ్రితో శారద పెళ్ళి జరుగుతుంది.
విమాన ప్రమాదంలో బతికి బైటపడ్డ శేఖర్ ఆశ్రమానికి వచ్చి శారదను కలుసుకుని ఆమెకు పెళ్లయ్యిందని తెలుసుకొని నిష్డారంగా మాట్లాడి ఆమె భర్తను అంతం చేస్తానంటాడు. ఆగ్రహంతో శారద శేఖర్ పై చేయి చేసుకుంటుంది ఇంటికి వచ్చిన శేఖర్ శారద తన సవితి తల్లి అని తెలుసుకొని బాధపడతాడు. అదేవిధంగా శారద కూడా వేదనకు గురయినా నిగ్రహంతో వుంటుంది. శేఖర్ మనశ్శాంతికోసం తాగుడుకు అలవాటుపడతాడు. అతన్ని బాగుచేయడం కోసం లక్ష్మితో పెళ్ళి జరిపిస్తారు. శేఖర్, లక్ష్మిల సంసార జీవితం సజావుగా సాగుతున్న తరుణంలో లక్ష్మికి శేఖర్, శారదల ఆశ్రమకథ తెలస్తుంది. ఆమెలో అనుమాన బీజం మొదలై శేఖర్ను మాటలతో హింసిస్తుంది. బాధతో శేఖర్ ఇల్లు వదిలి వెళతాడు. శేఖర్ తండ్రి కుమిలిపోతాడు.
శారద భర్తతో కలిసి తీర్థయాత్రలు చేస్తూ ఒక గుడివద్ద అసహాయస్థితిలో వున్నశేఖర్ ని చూసి ఇంటికి తీసుకువెళుతుంది. అయితే శేఖర్ కు శారద సపర్యలు చేయరాదని లక్ష్మి ఆంక్ష విధిస్తుంది. శేఖర్ ఆరోగ్యంకోసం శారద ఉపవాసాలు చేస్తూ దేవుణ్ణి ప్రార్థిస్తుండగా శేఖర్ కళ్ళు తెరుస్తాడు. కానీ శారద కన్నమూస్తుంది.
ఈ కథను ప్లాష్ బ్యాక్ లో చెప్పిస్తారు.
సెంటిమెంటు ప్రాధాన్యతగల ఈ కథలో హాస్యానికి కూడా పెద్దపీట వేశారు. రేలంగి, రమణారెడ్డి, కృష్ణకుమారి. డాక్టర్ శివరామకృష్ణయ్య, సూర్యకాంతం ఈ అయిదుగురికీ చెందిన హాస్య ఉపకథ బాగా రక్తికట్టింది.
సుసర్ల దక్షిణామూర్తి అందించిన సంగీతం కర్ణపేయంగా వుంటుంది. రఘునాధ పాణిగ్రాహి పాడిన ‘చల్లని రాజా ఓ చందమామ’ నేటికి శ్రోతల్ని అలరిస్తూనే వుంది. ‘నీమము వీడి అజ్ఞానముచే పలు బాధలు పడనెల’, స్వర్గమన్న వేరే కలదా’, ‘ఏనాడూ కనలేదు ఈ వింత సుందరిని’, ‘జనగణమంగళదాయక రామం’ అన్న పాటలు, రేలంగికి దక్షిణామూర్తి పాడిన ‘చల్లని పున్నమి వెన్నెలలోనే” అన్న గీతం కథాపరంగా రక్తిగట్టటమేగాక వీనుల విందుగా వుంటాయి.
అంతవరకూ విలన్ వేషాలు వేసిన ఆర్.నాగేశ్వరరావు ఇందులో ఆశ్రమ పెద్ద ‘నాన్నగారు’ వేషాన్ని గంభీరంగా పోషించారు. ఆ విధంగా ఎన్నో ప్రత్యేకతలతో 21.6.1956న విడుదలయి ప్రేక్షకాదరణ పొందిన ప్రసాద్ మార్కు చిత్రం ‘ఇలవేలుపు’.
అంతవరకూ హిట్ పెయిర్ గా పేరొందిన అక్కినేని, అంజలీదేవి ఈ చిత్రంలో మొదట ప్రేయసీప్రియులుగా తరువాత తల్లీకొడుకులుగా నటించి మెప్పించడం కత్తిమీద సాము వంటిది, అందులో వారిద్దరూ తమ పాత్రలకు పరిపూర్ణ న్యాయం చేవారు. ఇదే చిత్రాన్ని మీనాకుమారి కథానాయికగా స్వియదర్శకత్వంలో యల్.వి.ప్రసాద్ హిందీలో నిర్మించినపుడు కథానాయకుని పాత్రకోసం దిలీప్ కుమార్, దేవానంద్ ని ప్రయత్నించినా వారు అంగీకరించలేదు. పృథ్విరాజ్ కపూర్ కుటుంబంతో ప్రసాద్ కు వున్న గత పరిచయం రీత్యా రాజ్కపూర్ కథానాయకుని పాత్ర పోషించారు. ఆ ‘శారద’ చిత్రం ప్రసాద్ ఇమేజిను పెంచడమేగాక కనకవర్షం కురిపించింది.
Source: 101 C, S V Ramarao