విజయవంతమైన చిత్రానికి కథకంటే కథనం గొప్పది అని ఆనాడే నిరూపించిన వాహిని చిత్రం ‘గుణసుందరి కథ’.
వాహినీ స్టూడియో నిర్మించిన తొలి దశలో ఈ చిత్రానికి మూలం షేక్స్పియర్ మహా కవి రాసిన ‘కింగ్ లియర్’ నాటకం. దానిని సినిమా కథగా మలచిన శిల్పి పింగళి నాగేంద్రరావు. దర్శకులు కె.వి.రెడ్డి సహాయకులు కమలాకర కామేశ్వరరావు కథకథనాన్ని రూపొందించారు.
Click Here to go to Gunasundari Katha (1949) Movie Page.
ఉగ్రసేన మహారాజుకు రూపసుందరి, హేమసుందరి, గుణసుందరి అని ముగ్గురు కూతుళ్లు. పెద్ద కూతుళ్లు ఇద్దరూ తండ్రే సర్వస్వం అంటారు. మూడో కూతురు గుణసుందరి భర్త సర్వస్వం అంటుంది. దీనికి ఆగ్రహించిన రాజు ఒక అష్టావక్రుణ్ణి తెచ్చి ఆమె పెళ్లి జరిపిస్తాడు. అతడే దైవాధీనం ( కస్తూరి శివరావు ). శాపవశాత్తూ ఆ రూపం పొందిన ఒక రాజకుమారుడు ( ఈ పాత్రను వల్లభజోస్యుల శివరాం పోషించారు) విధివశాత్తూ మహారాజుకు రాచపుండు వస్తుంది. మహేంద్రమణిని తాకిస్తే అది నయమవుతుంది అంటారు వైద్యులు. దానిని తేవటానికి పెద్ద అల్లుళ్లిద్దరు ( హారమతి, కాలమతి), దైవాధీనం బయలుదేరుతారు.
సింహద్వారం, మకర ద్వారం, కమల ద్వారం దాటాక మహేంద్రమణి ఉండే ప్రదేశం వస్తుంది దైవాధీనం తెలివితేటలతో అక్కడ ఉండే యక్ష కన్యలను జయించి మణి తెస్తాడు. కానీ పెద్దాళ్ళుళ్లు దాన్ని తస్కరిస్తారు . శాపవశాత్తూ దైవాధీనం ఎలుగుబంటి గా మారతాడు. శివానుగ్రహం వల్ల శాపము తీరిపోతుంది.
మహేంద్రమణిని పలికించడం తెలియని అల్లుళ్లు రాజు ఆగ్రహాన్ని చవిచూస్తారు. దైవాధీనం వల్ల మణి ప్రభావంతో రాచపుండు మాయమవుతుంది.
రాజదర్బారు, యక్షణిలోకం , శివ లోకం ఇలా భారీ సెట్టింగులు కనిపిస్తాయి. మార్కస్ బార్లేట్ ఫోటోగ్రఫీ కనువిందు చేస్తుంది. ఓగిరాల రామచంద్రరావు సమకూర్చిన సంగీతం, ముఖ్యంగా లీల ఆడిన భక్తి పాటలు శ్రీ తులసి జయ తులసి జయమునీయవే, ఉపకరుగుణాలయవై ఉన్నావు గదే మాతా, దైవాధీనం పాడిన ‘ఓహోరి బ్రహ్మదేవుడా’ పాత శాంతకుమారి, మాలతి పాడిన ‘చల్లని దొరవేరా చందమామ, కళకళ ఆ కోకిలేమో’ పాట పాపులర్ అయ్యాయి.
హాస్యనటుడు శివ రావు కథానాయకుని పాత్రలో నట విశ్వరూపం చూపించాడు నాయికగా శ్రీరంజని మహిళా హృదయాల్ని దోచుకుంది. ఇతర పాత్రల్లో గోవిందరాజుల సుబ్బారావు, రేలంగి, గోబెరు సుబ్బారావు, మాలతి, శాంతకుమారి నటించారు. పింగళి నాగేంద్రరావు రచన, కె.వి.రెడ్డి దర్శకత్వ ప్రతిభ చిత్ర విజయానికి దోహదం చేశాయి. సినేరియో రూపొందించటంలో సహకరించారు కమలాకర కామేశ్వరరావు.
ప్రముఖ గాయని పి. లీల ఈ చిత్రం ద్వారా తెలుగు సినీ రంగానికి పరిచయమయ్యారు.

Source: 101 C, S V Ramarao