ప్రతి సినిమాకు కథాగమనాన్నిబట్టి ఒక మూడ్ వుంటుంది. తెలివైన దర్శకుడు ఆ మూడ్ ను టైటిల్స్ దగ్గర్నుంచే క్రియేట్ చేయటానికి ప్రయత్నిస్తాడు. ఆ కోవలో తొలిసారిగా కథను గూర్చి ఆసక్తి కలిగించే విధంగా టైటిల్స్ రూపొందించిన చిత్రం ‘ఏది నిజం’. చిత్ర కథ గ్రామీణ వాతావరణానికి, చిట్టడవి నేపథ్యంతో కొండలు, గుట్టలు ఆయువుపట్టుగా కొనసాగుతుంది. ఆ భావం ఎస్టాబ్లిష్ చెయ్యాటానికి కుండ పెంకులపైన, పల్లెటూరి రోడ్లపైన, కొండగుట్టలమీద టైటిల్స్ వస్తాయి. దీంతో ప్రేక్షకుల్లో ఏం జరగబోతుందో అనే ఆసక్తిని రేకెత్తించారు దర్శకుడు ఎస్.బాలచందర్.
Click Here to go to Edi Nijam (1955) Movie Page.
ఇక్కడ బాలచందర్ గూర్చి కొద్దిగా చెప్పుకోవాలి. ఈయన వైణిక విద్వాంసుడు. వందలాది వీణ కచేరీలు చేశారు. చక్కని నటుడు. ఏ.వి.యం. వారి ‘సంఘం’లో కథానాయకుడు యన్.టి.ఆర్.కు స్నేహితునిగా నటించారు. అంతే కాదు ఆ చిత్రంలో పితాపురం నాగేశ్వరరావు పాడిన “పెళ్ళిపెళ్ళి’ పాట ఈయనపై చిత్రీకరించారు. ఈయనకు జోడి వైజయంతిమాల.
అరవైమూడోయేట (1927-1990) కన్నుమూసిన బాలచందర్ ఆణిముత్యాల వంటి అరడజను (అయిదు తమిళ) చిత్రాలకు దర్శకత్వం వహించగా వాటిల్లో యెన్నదగినది ఒకేఒక తెలుగు చిత్రం ‘ఏది నిజం’.
ప్రతిభా పతాకంపై ఘంటసాల కృష్ణమూర్తి నిర్మించిన ఈ చిత్రానికి సుంకర సత్యనారాయణ రచన చేయగా, మాస్టర్ వేణు సంగీతాన్ని అందించారు. ‘ప్యూజిటిర్’ అనే ఇటాలియన్ చిత్రం ఈ చిత్రానికి మాతృక.
ఓ పల్లెటూళ్ళో కూలిపని చేసుకొని బతికే సామాన్యుడు కొండయ్య. అతన్ని అభిమానించి పెళ్ళిచేసుకొన్న యువతి రామి. వీరిది అన్యోన్య దాంపత్యం. మునసబు తేనెపూసిన కత్తి, మెత్తని మాటలతో గొంతులు కోసే నీచుడు. అతనికి వంతదారులు ఓ నాటు డాక్టరు. మరో పూజారి. తిరుపతి కొండయ్యకు స్నేహితుడు. అతను ఆవేశపరుడు, మునసబు అన్యాయాన్ని పరోక్షంగా విమర్శిస్తూ కడిగి పారేస్తుంటాడు.
ఆ మునసబు కన్ను రామిమీద పడుతుంది. ఆమెను లొంగదీసుకోవాలని శతవిధాల ప్రయత్నిస్తాడు. ఇది తెలిసిన తిరుపతి మనసబుకు ఎదురు తిరుగుతాడు. మునసబు తెలివిగా తిరుపతిని అడవిలో హతమార్చి ఆ నేరం కొండయ్య మీద పడేలాచేస్తాడు. పూజారి, డాక్టరు మునసబుకు వత్తాసు పలుకుతారు. ఫలితంగా కొండయ్యకు జైలుశిక్ష పడుతుంది. శిక్ష పూర్తయ్యాక తిరిగి వచ్చిన కొండయ్య నిజం తెలుసుకొని మునసబుకు దేహశుద్ధి చేస్తాడు. పోలీసులకు నిజం తెలిసి కొండగుట్టల్లో తలదాచుకొన్న మునసబును వెంటాడి అరెస్టు చేస్తారు.
అత్యంత సహజమైన పాత్రలతో, సన్నివేశాలతో చిత్రాన్ని తీర్చిదిద్దారు దర్శకుడు బాలచందర్. కథానాయకుడు కొండయ్య పాత్రలో నాగభూషణం నిజంగా జీవించాడు. అతని సహచరి రామి పాత్రలో జానకి నటించింది. మునసబుగా గుమ్మడి వెంకటేశ్వరరావు నిజంగా తేనెపూసిన కత్తి అనిపించారు. డాక్టరుగా రమణారెడ్డి, పూజారిగా వంగర తిరుపతిగా జోగారావు, ఇతర పాత్రల్లో సీతారాం, పి.హేమలత నటించగా పేకేటి శివరాం, జగ్గయ్య గెస్ట్ ఆర్టిస్టులుగా పాల్గొన్నారు. విచిత్రమేమిటంటే ఈ చిత్రంలో తిరుపతి (జొగారావు) హత్య చేయబడతాడు. సినిమా విడుదలయిన కొద్దిరోజులకే నటుడుగా ఎదుగుతున్న జోగారావును విధి కబళించివేసింది.
ప్రేక్షకుల్ని ఆలోచింపజేసి ఓ కొత్త తరహా అనుభూతిని అందించిన ‘ఏది నిజం’ చిత్రానికి కేంద్ర ప్రభుత్వ ప్రశంపత్రం లభించింది.

Source: 101 C, S V Ramarao