February 23, 2020

Drohi (1948): L V Prasad’s mark Technical Wizardry #TeluguCinemaHistory

Drohi (1948): L V Prasad’s mark Technical Wizardry #TeluguCinemaHistory

జానపదాలు రాజ్యమేలుతున్న రోజుల్లో ఒక వంక వాహిని, మరోవైపు సారధి ప్రయోజనాత్మక సాంఘిక చిత్రాలు నిర్మించగా ఆ సారధి తో సంబంధమున్న నటుడు కె. ఎస్. ప్రకాష్ రావు నిర్మాతగా మారి, చల్లపల్లి రాజావారి ప్రోత్సాహంతో స్వతంత్ర పిక్చర్స్ పతాకంపై ఎల్.వి.ప్రసాద్ దర్శకత్వంలో తీసిన ‘ద్రోహి’ చిత్రం పట్టుగల కథాకథనాలు సమ్మేళనంగా చెప్పొచ్చు. జమీందారు గంగాధరరావు కూతురు సరోజ అహంకారి.

Click Here to go to Drohi (1948) Movie Page.

తండ్రికి అండగా ఉండే దుష్టుడైన రాజారావును ప్రేమిస్తుంది. ఒకరోజు ఆమె కారు నడుపుతుండగా ఆక్సిడెంట్లో ఒక వృద్ధుడు చనిపోతాడు. అతని మనువరాలు సీత. ఆమెకు ఆశ్రయం కల్పిస్తాడు డాక్టర్ ప్రకాష్, ప్రజా సేవలో నిమగ్నమైన డాక్టర్‌కు సహకరిస్తుంది సీత. పరిస్థితులు రీత్యా సరోజకు ప్రకాష్ తో వివాహమవుతుంది. ఆ క్షణం నుంచి ఆమె సీతను మానసికంగా హింసించి, దొంగతనం నేరం మీద హాస్పిటల్ నుంచి పంపించి వేస్తుంది. సీత గ్రామం చేరుతుంది. ప్రకాష్ గ్రామస్థులకు వైద్యం అందిస్తాడు. ఇది సహించలేని గంగాధరరావు, రాజారావు, గ్రామాన్నితగలబెడతారు. ఆగ్రహించిన జనం వారిపై ప్రతీకారం కోసం బయలుదేరగా, సీత తన మంచితనంతో వారిని ఆపుతుంది. అయితే చివరికి ఆమె దుష్టుల తుపాకీ గుళ్లకు బలైపోతుంది. సీత మరణంతో మనసు మారిన సరోజ తండ్రిని, రాజారావును అరెస్టు చేయించి, తన సంపదను పేదలకు అందజేస్తుంది.

ఇందులో సరోజగా జి.వరలక్ష్మి, సీతగా లక్ష్మీరాజ్యం, డాక్టర్ ప్రకాష్ గా కె.ఎస్. ప్రకాశరావు. విల్లన్లు గంగాధరరావుగా రాళ్లబండి కుటుంబరావు, రాజారావుగా కోస ప్రభాకరరావు, మరో రౌడీ పాత్రలో దర్శకుడు ఎల్.వి.ప్రసాద్ కంపౌండర్ హాస్యపాత్రలో శివ రావు నటించారు.

Pendyala

ఈ చిత్రానికి తాపీ ధర్మారావు రచన చేయగా, శ్రీధర్ ఫోటోగ్రఫీ నిర్వహించారు. అంతకముందు సంగీత శాఖలో సహాయకునిగా పనిచేసిన పెండ్యాల నాగేశ్వరరావు సంగీత దర్శకునిగా పరిచయమయ్యాడు. ఇందులో హీరోయిన్ (జి. వరలక్ష్మి), విలన్ (కోస ప్రభాకరరావు)ల మీద ఒక విచిత్రమైన యుగళగీతం ఉంది. అది ‘పూవు చేరి పలుమారు తిరుగుచు పాట పాడునది ఏమో తుమ్మెద పాడునది ఏమో; రౌడీ పాత్రలో ప్రసాద్ పై చిత్రీకరించిన గీతం ‘నవ్వులైన నవ్వవటె బుల్బుల్’ సీతపై చిత్రీకరించిన ‘ఆలకించండి బాబు ఆలకించండి’ కాంపౌండరుపై చిత్రీకరించిన హాస్యగీతం ‘చెక్కెర కొట్టుకు వచ్చావే బల్ టక్కరి పిల్లవే చినదానా’ చెప్పుకోతగినవి. 

ఈ చిత్రానికి సంబంధించి మరో విశేషమేమిటంటే దర్శకులు ప్రసాద్ నటించిన సన్నివేశాలకు ఆయన శిష్యుడైన తాతినేని ప్రకాశరావు దర్శకత్వం వహించటం. అలాగే దుష్టద్వయంగా నటించిన రాళ్లబండి కుటుంబరావు, కోస ప్రభాకరరావు ఆ పాత్రల్లో అద్భుతమైన ప్రతిభ కనపరిచారు. అలాగే లక్ష్మీరాజ్యం, జి.వరలక్ష్మి పోటీపడి నటించారు.

నెగటివ్ పాత్రను (ద్రోహి) సినిమా టైటిల్గా ఎన్నుకున్నారంటే  ఆ రోజుల్లో చిత్రం పట్ల ఎంత ప్రగతిశీల భావాలుండేవో అర్థమౌతుంది. చిత్రవిజయానికి కథాకథనాలే ప్రధానం అని నిరూపించిన చిత్రం ద్రోహి.

Akkineni Lakshmi Vara Prasad, better known as L.V. Prasad, brought a whiff of fresh air into Telugu cinema with his brand of technical wizardry and perfect planning of shot division.

Source: 101 C, S V Ramarao

Spread the love:

Comments