కథానాయికగా పరంగా కథ రూ పొందినప్పుడు ఆ తరహా టైటిల్ నే పెడితే మహిళా ప్రేక్షకులు కనక వర్షం కురిపిస్తారు. కనుకనే బి.ఎన్.రెడ్డి వాహినీ పతాకంపై తీసిన మూడవ చిత్రానికి ‘దేవత’ అని నామకరణం చేయటం, దాని ఫలితాలు బాగుండడం చేత అదే టైటిల్ తో పద్మనాభం ఒక చిత్రాన్ని 1965 లోనూ, రామానాయుడు ఒక చిత్రాన్ని 1982 లోనూ నిర్మించారు.
Click Here to go to Devata (1941) Movie Page.

విదేశాల్లో ‘లా’ చదివి ఇంటికి వచ్చిన కథానాయకుడు వేణు ఇంట్లోని పనిమనిషి లక్ష్మీ ప్రేమిస్తాడు. ఫలితంగా ఆమె గర్భవతి అవుతుంది. కాగా వేణుకి మరో ధనవంతురాలు విమల తో వివాహం జరుగుతుంది. ఆ విమల కవిగా చెప్పుకుని మురిసిపోయే వంచకుడు సుకుమార్ వలలో చిక్కుకుంటుంది. భార్య చేత వంచింపబడ్డ, నాయకుడు వేణు తిరిగి ఇంటికి వెళ్లేసరికి లక్ష్మి ఊరు విడిచి వెళ్ళిపోతుంది. ఆమె కోసం వెతికే ప్రయత్నం చేస్తాడు వేణు, లక్ష్మి ఒక వేశ్య గృహంలో ఉండటం, ఆమెపై హత్యానేరం మోపబబడటం, తర్వాత ఆమె నిర్దోషి అని తేలటం, ఆమె తనని ఉద్ధరించిన ‘దేవతగా’ కథానాయకుడు భావించడంతో కథ ముగుస్తుంది. ఇందులో ప్రధాన పాత్రలన్నీ నాగయ్య, కుమారి, బెజవాడ రాజారత్నం, సి.హెచ్.నారాయణరావు, లింగమూర్తి, టంగుటూరి సూర్యకుమారి పోషించారు. కెమెరా నిర్వహించిన కె. రామనాథ్ అప్పటివరకు ఉన్న చిత్రీకరణ విధానానికి స్వస్తి చెప్పి బరువైన సన్నివేశాల్ని కొత్త కోణాల్లో తెరపై ఆవిష్కరించారు.
సముద్రాల రాఘవాచార్య రచన చేయగా నాగయ్య సంగీతం అందించారు. రాజారత్నం గానం చేసిన ‘ అదిగో అందియలరవళి, ఎవరు మాకిక సాటి’ అన్న పాటలు టి. సూర్యకుమారి పాడిన ‘ వెండి కంచాలలో, క్రూర కర్మములు’ అన్న పాటలు బాగా పాపులర్ అయ్యాయి.
నిజానికి పై తరహా చిత్ర కథ ఆరోజుల్లో తీయడం సాహసమే! కథానాయిక వేశ్యగృహంలో ఉండటం ఆమెను నాయకుడు తరువాత సంస్కార హృదయంతో స్వీకరించడం గొప్ప విషయం. ఈ చిత్ర కథ నటుడిగా నాగయ్య జీవితంపై ఎంతో ప్రభావాన్ని చూపింది.
అంతకుముందు నాగయ్యగారు ఇద్దరు భార్యలు మరణించగా వారి ఇంట్లో పని చేసే జయలక్ష్మి తో సంబంధం ఏర్పడింది. దేవాలయంలో పెళ్లి చేసుకొని సరాసరి బి.ఎన్.రెడ్డి గారి వద్దకు వెళ్లి వారి ఆశీస్సులు పొందారు. నాటి నుంచి నాగయ్య మరణించే వరకూ ఆమె వారితోనే ఉంది.
ఊహాలోకం జనితం గాకుండా వాస్తవ సమస్యలతో నేల మీద నడిచే సహజ కథలను ప్రేక్షకులు ఆదరిస్తారనటానికి ‘దేవత’ చిత్రం ఒక ఉదాహరణ.
వాహినీ సంస్థకు మూలస్థంభాలు బి.ఎన్.రెడ్డి, కె.వి.రెడ్డి, మూలా నారాయణస్వామి; వీరితో పాటు కమలాకర కామేశ్వరరావు, రచయిత సముద్రాల రాఘవాచార్య, నటులు నాగయ్య, లింగమూర్తి – వీరంతా వాహినీ సంస్థ స్థాపించి తొలి దశకంలో (1939-49) చిత్రాలకు ఒక టీంగా సహకరించారు.
Source: 101 C, S V Ramarao