March 29, 2020

Devadasu (1953): There’s only one Devadas, that’s ANR!! #TeluguCinemaHistory

Devadasu (1953): There’s only one Devadas, that’s ANR!! #TeluguCinemaHistory

బెంగాలీ సాహిత్యాన్ని తన రచనలతో సుసంపన్న చేసిన విశిష్ట రచయిత శరత్ చంద్ర ఛటర్జీ 1917లో రాసిన నవల ‘దేవదాసు’. ఈ నవల ఆధారంగా ఇంతవరకు భారతీయ భాషల్లో ఓ డజన్ చిత్రాలు తయారయ్యాయి.

Click Here to go to Devadasu (1953) Movie Page.

వంగ రాష్ట్రానికి చెందిన నితీష్చంద్రమిత్ర  1928లో ఈస్టరన్ ఫిలిం సిండికేట్ పేరిట ఈ కథను తొలిసారిగా వెండి తెరపై మూకీచిత్రంగా నిర్మించారు. టాకీలు వచ్చిన తరువాత పి.సి. బారువా, న్యూథియేటర్స్ పతాకంపై 1935లో హిందీ, బెంగాలీ భాషల్లో నిర్మించారు. బెంగాలీ చిత్రంలో ఆయనే ప్రధాన పాత్ర పోషించగా, హిందీలో నాటి ప్రముఖ గాయకుడు కుందన్ లాల్ సైగల్ హీరోగా నటించారు. రెండు భాషల్లోనూ ఆనతి ప్రముఖ వంగ నటి జమున కథానాయిక పాత్రను నిర్వహించారు. ఈ రెండు చిత్రాలకు ఆర్.సి. బొరాల్, పంకజ్ మల్లిక్ సంగీతం అందించారు. 1936లో ఇదే కథను తమిళంలో పి.వి. రావు స్వీయ దర్శకత్వంలో నిర్మించి ప్రధాన పాత్ర పోషించారు. 1953లో వినోద పతాకంపై నిర్మాత డి. ఎల్. నారాయణ ఈ కథను తెలుగు, తమిళ భాషల్లో వేదాంతం రాఘవయ్య దర్శకత్వంలో నిర్మించారు.

ANR, Savitri

1955లో బిమల్ రాయ్ (ఈయన సైగల్ చిత్రానికి ఛాయాగ్రాహకులు) స్వీయ దర్శకత్వంలో హిందీలో దిలీప్ కుమార్, సుచిత్ర సేన్, వైజయంతిమాల కాంబినేషన్ లో నిర్మించారు.

1974లో విజయనిర్మల దర్శకత్వంలో విజయకృష్ణ పతాకంపై తెలుగులో కృష్ణ కథానాయకునిగా నిర్మించారు. తిరిగి 1979లో బెంగాలీ భాషలో దిలీప్ రాయ్, 1989లో మలయాళంలో ఓ. మణి నిర్మించారు. ఇటీవల షారుఖ్ ఖాన్ తో హిందీలో చాలా రిచ్ గా తీశారు. ఇన్ని సార్లు ఒకే కథా వస్తువును సినిమాగా తీసారాంటె దాని సత్తా ఏమిటో ఊహించ వచ్చు. ఇక ఆ కథ స్పూర్తితో తయారైన చిత్రాల గూర్చి వేరే చెప్పక్కర్లేదు.

అయితే వీటన్నిటిలోకి తలమానికంగా, గొప్పగా ఉందన్న ఖ్యాతి ఒక్క వినోదా వారి దేవదాసుకు మాత్రమే దక్కింది. అందుకు ముఖ్యకారణం ఆ కథను అంతకుముందే చక్రపాణి తెలుగులోకి అనువదించటంవలన ప్రేక్షకులకు మరింత దగ్గర కాగలిగింది.

రావులపర్రు జమీందారు నారాయణరావు. ఆయనకు ఇద్దరు కొడుకులు. పెద్దకొడుకు ద్విజదాసు, రెండో కొడుకు దేవదాసు. వారి పొరుగున ఉన్నది నీలకంఠం కుటుంబం. ఆయన కూతురు పార్వతి. దేవదాసు, పార్వతి ఒకే స్కూల్లో చదువుకుంటారు. ఒకరంటే మరొకరికి వల్లమాలిన అభిమానం. ఆటపాటల్లో శ్రద్ధచూపే దేవదాసుకు టౌన్ లో విద్యకై పంపిస్తాడు జమీందారు. విద్య పూర్తయి పల్లెటూరుకు వచ్చిన దేవదాసు, పార్వతి పాతజ్ఞాపకాల్ని నెమరువేసుకుంటూ పరస్పరం ప్రేమించుకుంటారు. పార్వతివైపు పెద్దలు వారిద్దరికీ పెళ్లి జరిగితే బాగుంటుందని ఆశిస్తారు. అయితే ఇందుకు దేవదాసు తండ్రి జమీందారు నారాయణరావు అంగీకరించడు. పెళ్లి మాటలకు వచ్చిన పార్వతి తండ్రి నీలకంఠంను అవమానిస్తాడు. పౌరుషంతో వెళ్ళిపోయినా నీలకంఠం మరో వృద్ధ జమీందారుకు రెండో భార్యగా పార్వతితో వివాహాన్ని నిశ్చయంచేస్తాడు.

తండ్రి మాటకు ఎదురు చెప్పలేని దేవదాసు టౌన్‌కు వెళ్లి మిత్రుడు భగవాన్ హెచ్చరికతో తిరిగి ఇంటికిరాగా అప్పటికే పార్వతి పెళ్లయి అత్తవారింటికి వెళ్తుంది. ప్రేమలో విఫలుడైన దేవదాసుకు మనశ్శాంతి కోసం ఆల్కహాల్‌ను అలవాటు చేస్తాడు భగవాన్. ఆ తరువాత చంద్రముఖి అనే వేశ్యతో పరిచయమవుతుంది. దేవదాసువల్ల ఆమె జీవన విధానంలో మార్పు వస్తుంది. అయితే దేవదాసు పక్కా తాగుబోతుగా మారుతాడు. ఇది తెలిసిన పార్వతి ఎంతగానో కుమిలిపోతుంది.

ఆరోగ్యం దెబ్బతిన్న చివరిదశలో పార్వతి వున్నా దుర్గాపురం వచ్చి ఆమె ఇంటివెనుక ఆమె రాకకై ఎదురు చూసి నిరాశతో ప్రాణం విడుస్తాడు.

ఈ కథను అసమాన ప్రతిభతో తెరకు తగ్గట్టుగా మలిచిన శిల్పులు. దర్శకుడు వేదాంతం రాఘవయ్య; రచయిత సముద్రాల రాఘవాచార్య, సంగీతకర్త సి.ఆర్.సుబ్బరామన్, మేకప్ మంగయ్య, ఛాయాగ్రాహకుడు బి.ఎస్. రంగా ఇందులోని పాటలన్ని ఉదాత్త సంగీత సాహిత్యాలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకొన్నాయి. రసజ్ఞ శ్రోతల గుండెల్లో నేటికీ అవి చిరంజీవులే, ఇందులోని పాటల్ని ఘంటసాల, ఆర్. బాలసరస్వతీ దేవి, కె. రాణి, జిక్కి ఆలపించారు. సుబ్బరామన్ మరణానంతరం విశ్వనాథన్, రామమూర్తి రీరీకార్డింగ్ పూర్తిచేసాడు.

దేవదాసు పాత్ర అక్కినేని నటజీవితాన్ని ఓ మలుపు తిప్పింది. తెలుగు, తమిళ దేశాల్లో ఆయన ‘దేవదాసు’గా గుర్తుండిపోయారు. పార్వతి పాత్రకు మొదట జానకిని అనుకున్నా సావిత్రికి ఆ పాత్ర దక్కటం ఆమె అదృష్టం. ఇతర ముఖ్య పాత్రల్లో చంద్రముఖిగా లలిత, జమిందారుగా ఎస్.వి. రంగారావు, పార్వతి తండ్రిగా దొరస్వామి, భర్తగా సి.ఎస్.ఆర్. ఆంజనేయులు, స్నేహితుడు భగవాన్ గా పేకేటి శివరాం, ధర్మన్నగా సత్యనారాయణ, బండివాడుగా సీతారాం ఆయా పాత్రల్లో జీవించారు.

ఇతర పాత్రల్లో సురభి కమలాబాయి, ఆర్. నాగేశ్వరరావు, జర్నలిస్టు జి.వి.జి. నటించారు. తరాలు మారినా మరువలేని విలువలతో రూపొందిన ‘దేవదాసు’ నిజంగా ప్రేమ కథాచిత్రాల్లో చిరస్మరణీయమైంది.

Dilip Kumar, who portrayed Devadas in the 1955 film directed by Bimal Roy, admitted that Nageswara Rao’s performance as the character was better than his own remarking, “There is only one Devadas (1953), and that is Akkineni Nageswara Rao.

Sr Pingali

Source: 101 C, S V Ramarao

Spread the love:

Comments