హిందీలో నిర్మాత యస్.యు.సున్నీ, దిలీప్ కుమార్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం మేలా (1948). దిలీప్ కుమార్, అశోక్ కుమార్, నర్గీస్ కాంబినేషన్తో దర్శకుడు నితిన్ బోస్ అందించిన ముక్కోణవు ప్రేమకథా చిత్రం దీదార్ (1951), ఈ రెండూ విజయవంతమయిన చిత్రాలే! ఈ చిత్రాల కథను ఒకటిగా మలిచి విషాదాంత ప్రేమకథాచిత్రం ‘చిరంజీవులు’ అందించిన ఘనత వినోదా సంస్థకు దక్కింది. నిర్మాత డి.యల్.నారాయణ అంతకుముందే ‘దేవదాసు’ నిర్మించి సంచలనం సృష్టించారు.
Click Here to go to Chiranjeevulu (1956) Movie Page.
మల్లాది రామకృష్ణశాస్త్రి పని (మాటలు-పాటలు) చేసిన ఈ చిత్రం వేదాంతం రాఘవయ్య దర్శకత్వంలో మరపురాని మనోజ్ఞ చిత్రంగా మలచబడింది.
అదో పల్లెటూరు. మోహన్, రాధ ఇరుగు పొరుగున నివసించే పిల్లలు చిన్ననాటినుంచి వారిద్దరి మధ్య చెలిమి మాలిమి మొగ్గ తొడిగింది. రాధ తల్లిదండ్రులు కొంచెం సంపన్నులు మోహన్ తండ్రి మిఠాయిబండి నడిపేవాడు. కాలక్రమాన వారిద్దరూ పెరిగి పెద్దవారవుతారు. ఇద్దరికీ పెళ్ళి కూడా నిశ్చయమవుతుంది. అయితే అంతముందే రాధ మోహన్ కలిసి తిరునాళ్ళకు వెళతారు. ఆక్కడ డాక్టర్ కృష్ణ రాధను చూస్తాడు. మిలట్రినుంచి తిరిగివచ్చిన దుర్మార్గుడు రత్నం కూడా ఆ పల్లెటూళ్లోనే వుంటాడు.అతను రాధకు దూరపు బంధువు.
పెళ్లికోసం బంగారు వస్తువులు తేవటానికి వెళ్ళిన మోహన్ దురదృష్టవశాత్తూ కంటిచూపుకు దూరమవుతాడు. కొంతకాలం డాక్టరు దగ్గర వుండాల్సి వస్తుంది. సకాలంలో మోహన్ ఇంటికి రాలేకపోవటంవల్ల దానికి రత్నం చిలవలు పలవలు కల్పించి మోహన్ ను మోసగాడుగా చిత్రించి, రాధకు డాక్టర్ తో పెళ్లి జరిగే ఏర్పాటు చేస్తాడు.
మోహన్ ఇంటికి తిరిగివచ్చి రాధకు పెళ్ళి జరిగిపోయిందని తెలిసి బాధపడతాడు. తిరగి టౌనుకు వెళ్ళిన మోహన్ కు డాక్టర్ కృష్ణ ఆశ్రయమిచ్చి అతనికి కళ్లు తెప్పించే ప్రయత్నం చేస్తాడు. రాధకు అతన్ని పరిచయం చేయగా ఆమె మోహన్నుచూసి నిర్ఘాంతపోతుంది.
చూపు వచ్చిన మోహన్ పల్లెటూరికి తిరిగి వెళతాడు. అతన్ని వెతుక్కుంటూ రాధ వెళుతుంది. వారిద్దరూ చిన్ననాడు నిర్మించుకొన్న పొదరిల్లు వద్ద ప్రాణాలు విడుస్తారు.
కథానాయకుడు మోహన్ గా యన్.టి.రామారావు, కథానాయిక పాత్రలో జమున, డాక్టర్ గా గుమ్మడి వెంకటేశ్వరరావు తమ పాత్రలకు పరిపూర్ల న్యాయం చేకూర్చారు. ఇతర సహాయ పాత్రల్లో ఎన్.టి.ఆర్. తండ్రిగా ప్రముఖ సంగీత దర్శకుడు బి. యన్.ఆర్, జమున తల్లిదండ్రులుగా ఛాయాదేవి, సి.యస్.ఆర్., విలన్ రత్నంగా పేకేటి శివరామ్, అతను ప్రేమించిన పల్లెటూరి పిల్లగా సురభి బాలసరస్వతి, ఆమె తండ్రిగా మహంకాళి వెంకయ్య, డాక్టర్ సోదరిగా సూర్యకాంతం నటించారు.
చిత్రంలోని పాటలన్నీ ఆణిముత్యాలు. ఇందుకు గీతరచయిత మల్లాది, సంగీతకర్త ఘంటసాల చిరస్మరణీయులు. చిన్న పిల్లలపై చిత్రీకరించిన “కలవారి అమ్మాయి ఆంటునాటంగా”, జమున బృందంపై చిత్రీకరించిన “నల్లవాడే గొల్ల పిల్లవాడే యన్.టి.ఆర్., జమునపై చిత్రీకరించిన యుగళగీతాలు “ఎందాకా ఎందాకా, చికిలింత చిగురు సంపంగి గుబురు”, వారిద్దరిపై చిత్రీకరించిన విషాదగీతం “కనుపాప కరవైన కనులెందుకో”, యన్.టి.ఆర్.పై చిత్రీకరించిన “మనసు నీదే మమత నీదే” చెప్పుకోదగ్గవి. కాగా జముపై చిత్రీకరించగా లీల పాడిన “తెల్లవారవచ్చే తెలియక నా సామి” అన్నగీతం రచనాపరంగానూ, స్వరరచనాపరంగాను ఉన్నత స్థాయిలో వుండి నేటికీ శ్రోతల్ని అలరిస్తూనే వుంది. 15.8.1956న విడుదలయిన ‘చిరంజీవులు’ మొదటిసారి అంతగా విజయం పొందకపోయినా రిపీట్ రన్స్లో ప్రేక్షకులు విపరీతంగా ఆదరించారు.
ఈ చిత్రానికి సంబందించి చెప్పుకోదగిన అంశం ఒకటుంది యన్.టి.ఆర్.కు గుడ్డివాని ఎఫెక్టు రావటంకోసం ఓ ప్రత్యేకమైన లెన్స్ అమర్చారు ఆయన రైలు పట్టాలపై వెళుతుండగా గుమ్మడి వచ్చి రక్షించాలి. షూటింగ్ సమయంలో రామారావు పాత్రలో లీనమై సీరియస్గా వెళుతున్నారు. ఇంతలో నిజంగా రైలు రావటం ఆయన గమనించలేదు. గుమ్మడి వేగంగా వెళ్ళి యన్.టి.ఆర్.ను పక్కకు తప్పించటం, రైలు వెళ్లటం క్షణకాలంలో జరిగిపోయాయి. ఇప్పటికీ ఆ సన్నివేశం తల్చుకుంటే ఒళ్లు జలదరిస్తుందంటారు గుమ్మడి.

Source: 101 C, S V Ramarao