పాతిక లక్షల ఖర్చుతో, దేవేంద్ర లోకం, సువిశాల రాజ భవంతి, అందాల పూదోట, రాజవీధుల వంటి భారీ సెట్టింగులతో కనులు మిరుమిట్లు గొలిపే దుస్తులతో దేవకన్యల నాట్యాలతో అత్యంత వ్యయప్రయాసలగూర్చి విజయ వారు కమలాకర కామేశ్వరరావును దర్శకునిగా పరిచయం చేస్తూ నిర్మించిన జానపద చిత్రం ‘ చంద్రహారం’.
Click Here to go to Chandraharam (1954) Movie Page.
చందన రాజు ప్రాణం అతని మెడలోని హారంలో ఉంటుంది. అతను ఒక చిత్రాన్ని గీసి ఆ ఊహాసుందరి( గౌరీ)నే పెళ్లి చేసుకుంటానంటాడు. ఆ రాజ్యాన్ని సొంతం చేసుకోవాలనుకున్న దూమకేతు తన సలహాదారైన నిక్షేపరాయున్ని పంపి ఆ పోలికలు ఉన్న అమ్మాయిని లేకుండా చేయాలనుకుంటాడు. ఇలా ఉండగా రాకుమారుని పాట విని యక్ష కన్య చంచల వచ్చి తనను ప్రేమించమని కోరి, భంగ పడి అతని మెడలోని చంద్రహారాన్ని తీసుకునిపోతుంది. ఫలితంగా అతను మరణిస్తాడు. మరో యక్షిని సహాయంతో మళ్ళీ జీవిస్తాడు. ఈ జీవస్మరణ సమస్యతో వున్న చెందిన రాజు గౌరిని చూసి వివాహం చేసుకుంటాడు. చివరకు ఆమె పాతివ్రత్య మహిమలే చంచలకు ఓటమి, యువరాజుకు ప్రాణగండం తప్పటం జరిగి కథ సుఖాంతమౌతుంది.
ఎన్. టీ. రామారావు, శ్రీరంజని, సావిత్రి, సూర్యకాంతం, ఎస్వీ. రంగారావు, రేలంగి, జోగారావు ముఖ్య పాత్రలు పోషించారు. పింగళి నాగేంద్రరావు రచన చేయగా ఘంటసాల సంగీతాన్ని సమకూర్చారు. ‘ ఎవరివో, యచనుంటివో, ఇది నా చెలి ఇది నా సఖి, ఏమి శిక్ష కావాలో కోరుకొనవే ప్రేయసి, ఏనాడూ మొదలిడితివో ఓ విధి, ఏం చేస్తే అది ఘనకార్యం’ వంటి పాటలు చెప్పుకోదగ్గవి.
అంతకముందు ‘పాతాళ భైరవి’లో సాహసాలు చేసి అదరగొట్టిన రామారావు ఇందులో చిత్రం ఆద్యంతం మరణావస్థలో ఉండడాన్ని ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోయారు. చిత్రం ఫెయిల్ అయిన మార్కస్ బార్ట్లే ఫోటోగ్రఫీ మాత్రం కనువిందు చేస్తుంది.
ఆ రోజుల్లో విజయ వారి నిర్వహణలో కినిమా అనే పత్రిక వచ్చేది దానిలో ” చంద్రహారం” గూర్చి విపరీతమైన పబ్లిసిటీ ఇచ్చారు. ఆంధ్ర దేశంలోని ప్రముఖ హోటళ్ల వద్ద ఈనాటి టీవీ సైజులో విద్యుత్ కాంతులతో ఆ చిత్రంలోని స్టిల్స్ ను ప్రదర్శించారు. ఇన్ని చేసినా చిత్రం పరాజయం పొందక తప్పలేదు. నిర్మాతల్లో ఒకరైన చక్రపాణి చిత్ర పరాజయానికి కారణం వివరిస్తూ “, అవును హీరో మాట మాటకీ చస్తుంటే ఎట్టా సుత్తారు” అని తన సినిమా మీద తానే జోక్ వేసుకున్నారు.

Source: 101 C, S V Ramarao