ఆ రోజుల్లో ఆంగ్ల సాహిత్య ప్రభావం సినిమారంగంపై ఎంతోవుండేది. ఫలితంగా అలెగ్జాండర్ డ్యూమాస్ రచన ‘కార్సికాన్ బ్రదర్స్’ స్ఫూర్తిగా తీసుకొని జెమినీ వారు ‘అపూర్వ సహోదరులు’ చిత్రం తీసి ఘనవిజయం సాధించారు. ఇందులో కవలపిల్లలది ప్రధానభూమిక. (దానినే తిరిగి తెలుగులో ‘అగ్గిపిడుగు’ పేరుతో నిర్మించారు). ఆ చిత్రంలో కథానాయిక పాత్ర ధరించిన విదూషీమణి భానుమతి. ఆ ప్రేరణతో కథానాయిక ద్విపాత్రాభినయం కేంద్రబిందువుగా తీసుకొని తానె కథ తయారుచేసి, దర్శకత్వం వహించి రెండుపాత్రలను తానె పోషించి, సంగీత దర్శకత్వం వహించిన సి.ఆర్.సుబ్బరామన్కు సూచనలిచ్చి భరణీ పతాకంపై భానుమతి తీర్చిదిద్దిన చిత్రం ‘చండీరాణి’.
Click Here to go to Chandirani (1953) Movie Page.
వీరసింహ మహారాజు (అమర్నాథ్) తన పుట్టినరోజు వేడుకల్లో ఒక నర్తకిపై మనసుపడతాడు. ఆమెపై కన్నువేస్తాడు సేనాని ప్రచండుడు (యస్.వి. రంగారావు), రాజు ఆ నర్తకిని చేపట్టగా వారికి కవలపిల్లలు జన్మిస్తారు. సేనాని విషప్రయోగంతో నర్తకిని అంతమొందించి రాజుని చెరసాలలో పెడతాడు. ఆ కవలపిల్లల్లో ఒకరిని కోట దాటిస్తాడు మంత్రి. మరొకరు రాజభవంతిలో మిగిలి పోతాడు. ఇది తెలిసిన సేనాని మంత్రిని కూడా హతమారుస్తాడు. ప్రచండుడు రాజుగా పాలన సాగిస్తాడు.
రాజభవంతిలో చంప, అడవిలో చండీరాణి ( భానుమతి ద్విపాత్రాభినయం), మంత్రి కుమారుడు కిశోర్ (యన్. టి. రామారావు) పెరిగి పెద్దవారవుతారు. ప్రచండుడు కొడుకు ముకుంద్ (రేలంగి) చంపారాణిని పెళ్లి చేసుకోవాలని తాపత్రయపడతాడు. చంపారాణి, కిశోర్ల మధ్య ప్రేమ చిగురిస్తుంది. అడవికి వచ్చి చంపారాణి గూర్చి తెలుసుకుంటాడు కిషోర్. అతన్ని ప్రేమిస్తుంది చండీరాణి. కోతకు వెళ్లి ముకుంద్ సహాయంతో తండ్రిని కలుసుకొని తిరిగివచ్చిన చండీరాణి తన సోదరి చంపారాణి, కిశోర్ల ప్రణయగీతం వింటుంది. వారి ప్రేమను గూర్చి తెలుసుకుంటుంది. ఈలోగా ప్రచండుడు కిషోర్ను బంధిస్తాడు. చండీరాణి ప్రజల సహాయంతో ప్రచండుడిపై తిరుగుబాటు చేస్తుంది. ఆ పోరాటంలో ప్రచండుడు చండీరాణిని, ఆమె ప్రచండున్నీ సంహరించుకుంటారు. చంపా, కిశోర్లను కలిపి చండీరాణి మరణిస్తుంది.
చిత్రం అంతా భానుమతి అర్థవంతమైన డామినేషన్ కనిపిస్తుంది. చండీరాణి వీరోచితంగా పాత్ర. ఈ పాత్ర పరంగా ఆమెకు పులితో పోరాటం కూడా ఉంటుంది. రెండోది సాత్విక ప్రధానమైన చంపారాణి. ఈ రెంటినీ వైవిధ్యభరితంగా పోషించారు భానుమతి. హీరోగా రామారావు తన పాత్రకు న్యాయంచేశారు. ఇతర సహాయపాత్రల్లో హేమలత, విద్యావతి, ఆర్.నాగేశ్వరరావు, దొరస్వామి, రేలంగి నటించారు.
సముద్రాల సీనియర్ రచన చేయగా సెల్వరాజ్ ఫోటోగ్రఫీ నిర్వహించారు. సుబ్బరామన్ మరణానంతరం సంగీత బాధ్యతను విశ్వనాథన్ స్వీకరించారు. ఇందులోని పాటలన్నీ మేలిముత్యాలే, ‘కిలా కిలా నవులా కురిసే వెన్నెల’, ఎవారాలకింతురు నా మొర’, ఈ రోజు భలేరోజు ఇదే ప్రేమ ఇదేనే’ అన్న పాటలు చెప్పుకోదగ్గవి. కాగా ఈ చిత్రంలో ‘ఓ తారకా నవ్వులేల ననుగని’ అని ఘంటసాల, భానుమతి ఆలపించిన యుగళగీతం చిరస్మరణీయమైన తేనెలు చిలికే మధుర గీతంగా పేర్కొనాలి.
18.8.1953న విడుదలైన ఈ చిత్రాన్ని తమిళ, హిందీ భాషల్లో కూడా నిర్మించారు. ఈ మూడుభాషల్లోనూ భానుమతి, యన్.టి.రామారావు, యస్వీఆర్ ప్రధాన పాత్రల్ని పోషించారు. తెలుగు చిత్రం విడుదలైన పదిరోజుల తరువాత 28.8.1953న తమిళ,హిందీ చిత్రాలు విడుదలయ్యాయి.
Source: 101 C, S V Ramarao