జీవితమే ఒక నాటకం అన్న ఒక్క అంశం భాస్కర్ ప్రొడక్షన్స్ వారి ‘బ్రతుకు తెరువు’కు స్ఫూర్తినిచ్చిన కధాంశం. కోవెలమూడి భాస్కరరావు భాస్కర్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రానికి దర్శకుడు భరణీ రామకృష్ణ, సి. ఆర్. సుబ్బరామన్ సంగీతం అందించి నిర్మాణదశలో కీర్తిశేషుడవటంతో కొన్ని గీతాలకు ఘంటసాల స్వరాల్ని సమకూర్చారు.
Click Here to go to Brathuku Teruvu (1953) Movie Page.

మోహన్ పల్లెటూరి యువకుడు. పెళ్లి అయింది. ఒకరిద్దరు పిల్లలకు తండ్రి కూడా అయ్యాడు. బి.ఎ. చదివినా ఉద్యోగం రాలేదు. ఇంటి వద్ద తల్లి, అక్క కోటమ్మ, బావ లోకయ్య. గంపెడు సంసారం. ఉద్యోగం దొరక్కపోవడంతో టౌనులో ఒక స్నేహితుని సలహా మేరకు పెళ్లి కాలేదని చెప్పి ఒక కోటీశ్వరుడు రావుబహదూర్ వద్ద ఉద్యోగం సంపాదిస్తాడు. అయన కూతురు కథానాయకుడి అందచందాలు, వ్యక్తిత్వం చూసి మనసు పారేసుకుంటుంది. నిజం తెలిస్తే ఉద్యోగం ఊడుతుందని హీరో డబల్ గేమ్ ప్లే చేస్తాడు. కుటుంబ పోషణ కోసం ఇంటికి డబ్బు పంపితే దానిని అక్క చక్కగా కాజేస్తుంది.
సంసారాన్ని సాకలేని క్లిష్టపరిస్థితుల్లో కుటుంబం అంతా టౌనుకు వస్తారు. డ్రెమాటిక్ గా కొన్ని సన్నివేశాలు జరిగాక జమిందారుకు, అయన కూతురికి హీరో నిజం చెప్పి బ్రతుకుతెరువు కోసం ఈ నాటకం ఆడక తప్పలేదని వివరించి క్షమించమంటాడు.
ఈ కథలో కమర్షియల్ ఎలెమెంట్స్కు, సెంటిమెంట్స్ కు పుష్కలంగా అవకాశాలున్నాయి. అందుకే సూపర్ హిట్ అయింది. కథానాయకుని పాత్రలో అక్కినేని నాగేశ్వరరావు, భార్యగా శ్రీరంజని, జమిందారుగా యస్.వి. రంగారావు, అయన కుమార్తెగా సావిత్రి, ఇతర ముఖ్య పాత్రల్లో రేలంగి, సూర్యకాంతం నటించారు.
సంగీతపరంగా బ్రతుకుతెరువు పేరు చెప్పగానే ప్రేక్షకుల మనసులో మెదిలే మొదటి పాట ‘అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం.’ రచయితగా జూనియర్ సముద్రాలకు ఇది తొలిగీతం. దీన్నిఘంటసాల ఆలపించగా కథానాయకునిపై చిత్రీకరించారు. తిరిగి లీల పాడగా సావిత్రిపైన చిత్రీకరించారు. ఏదో మత్తుమందు జల్లిమాయలు చేసి, దారి తెన్నూ కానగరాని లోకాన, పదరాపదరా రాముడు అన్న పాటలు చెప్పుకోదగ్గవి.

Source: 101 C, S V Ramarao