1943లో బాంబే టాకీస్ పతాకంపై గ్యాన్ ముఖర్జీ కథ రాసి దర్శకత్వం వహించి అశోక్ కుమార్, ముంతాజ్ కాంబినేషన్లో రూపొందించిన హిందీ చిత్రం ‘కిస్మత్’. అది ఆ రోజుల్లో సంచలనం సృష్టించి, ఒకే థియేటర్లో మూడు సంవత్సరాలు ప్రదర్శితమైంది.
Click Here to go to Bhale Ramudu (1955) Movie Page.
ఆ కథ ఆధారంగా నరసూ స్టూడియోస్ వారు వేదాంతం రాఘవయ్య దర్శకత్వంలో తెలుగులో ‘భలేరాముడు’ పేరిట, తమిళంలో ‘ప్రేమపాశం’ పేరిట నిర్మించారు. రెండు భాషల్లోనూ కథానాయిక సావిత్రే, తెలుగులో హీరో అక్కినేని కాగా, తమిళంలో ఆ పాత్రని జెమినీగణేశన్ పోషించారు.
జమిందారు నారాయణరావు (గౌరీనాధశాస్త్రి)కు ఇద్దరు కూతుళ్ళు రూప, తార వారిద్దరికీ నాట్యం నేర్పిస్తాడు. ఆ జమిందారు దగ్గర ఒక గుమస్తా (సి.యస్.ఆర్). ఆ గుమస్తా కొడుకు రాము. రూపకు ఓ తామరపువ్వు బహుమతిగా ఇస్తాడు. అది తీసుకునే ప్రయత్నంలో మేడమీద నుంచి కిందపడి అవిటిదవుతుంది.
ఆగ్రహించిన జమిందారు గుమస్తా కొడుకుని రివాల్వర్ తో కాలుస్తాడు. దెబ్బతిన్న రాము ఓ నదిలో పడిపోతాడు. పశ్చాత్తాపంతో జమిందారు పోలీసులకు భయపడి ఆస్తిని,తన పిల్లల పెంపకం బాధ్యతను గుమాస్తాకు అప్పచెప్పి అజ్ఞాతంలోకి వెళ్ళిపోతాడు.
కొన్ని సంవత్సరాల తరువాత…
నదిలో పడ్డ రాము దొంగగా మారి కృష్ణ పేరుతో నగరానికి వస్తాడు. అతనికి పరిచయమౌతాడు అప్పన్న. గుమస్తా క్రమంగా ఆస్తి కాజేసి, జనీందారుగా అధికారం చెలాయిస్తారు. జమిందారు కూతుళ్ళు రూప (సావిత్రి), తార (గిరీజ) పేదవారుగా మిగిలిపోతారు. రూప ఒక వర్షపు రాత్రి కృష్ణకు ఆశ్రయం ఇస్తుంది. వారి పరిచయం ప్రేమగా మారుతుంది. గుమాస్తా రెండోకొడుకు (చలం) తారను ప్రేమిస్తాడు. కృష్ణ రూప కాలు నయం కావడానికి ఆర్థికసహాయం అందజేస్తాడు. ఆ డబ్బు ప్రస్తుతం వున్న జమిందారు (అంటే అతని తండ్రి) ఇంట్లోంచి దొంగిలించింది. కృష్ణ దొంగ అని తెలిసిన రూప మనసు వికలమౌతుంది. పతాక సన్నివేశంలో పాత నేరస్థుడయిన నారాయణరావును పట్టుకోవడానికి ప్రస్తుత జమిందారు రూపాదేవి నాట్య ప్రదర్శన ఏర్పాటుచేస్తాడు. అక్కడ అందరూ కలుసుకుంటారు.
అంతకుముందే తారకు తన తమ్ముడితో వివాహం జరిపే ఏర్పాట్లు చేస్తాడు కృష్ణ, పోలీసులు పట్టుకునేలోగా తప్పించుకుని వెళ్ళి పెళ్ళి జరిపిస్తాడు. అక్కడ కృష్ణ చేతిపైనవున్న ‘రాము’ అన్న పుట్టుమచ్చ ఆధారంగా అతను గుమస్తా పెద్దకొడుకు రాము అని తెలుస్తుంది. రూప, కృష్ణల వివాహంతో కథ సుఖాంతంమవుతుంది.
ఇతర ముఖ్యపాత్రల్ని గుమ్మడి, పేకేటి, రాఘవన్, హేమలత, గాదిరాజు కేశవరావు పోషించారు. సదాశివబ్రహ్మం రచన చేయగా, యస్.రాజేశ్వరరావు సంగీతాన్ని ఆందించారు. లీల, ఘంటసాల పాడిన ‘ఓహో మేఘమాలా, నీలాల మేఘమాలా’ పాట సూపర్ హిట్. ఈరోజుకీ ప్రేక్షకులు మరిచిపోలేని పాట అది. ‘ఎందున్నావో మాధవా మురళీధరా హరే మోహనకృష్ణ’, ‘ఇంటింటను దీపావళి మా ఇంటను లేదా, పి.బి.శ్రీనివాస్ పాడిన ‘భయమేల ఓ మనసా’, ‘భారతవీరా’ అన్న ప్రబోధగీతం, ఇ.వి.సరోజపై చిత్రీకరించిన నృత్యగీతం చెప్పుకోదగ్గవి. నిజానికి అప్పన్న బంగారి పాత్రల్లో రేలంగి సీత అందించిన హాస్యం చిత్రానికి ప్రాణం పోసింది.
6.4.1956న విడుదలయిన ఈ చిత్రం ఆర్థికంగా ఘన విజయాన్ని సాధించి శతదినోత్సవం జరుపుకుంది. ఈ చిత్రంలో రేలంగి ఉపయోగించిన వూతపదం జూలకటక’ ఆ రోజుల్లో ఎంతో పాపులర్ అయ్యింది. తరువాత ఆ పేరుతో ఒక సినిమా కూడా తీసారు.

Source: 101 C, S V Ramarao