‘పలికెడిది భాగవతమట, పలికించెడు వాడు రామభద్రుండట’ అంటూ భాగవతాన్ని తేట తెలుగులో అందించిన కవి, యోగి పుంగవుడైన బమ్మెర పోతనామాత్యుని చరితను చలన చిత్రంగా మలిచారు వాహినీ వారు. ఈ చిత్రాన్ని అజరామర దృశ్యకావ్యంగా తీర్చిదిద్దే బాధ్యతను చేపట్టారు తొలిసారిగా దర్శకత్వం వహించిన కె.వి.రెడ్డి. మొదట్లో గుండు చేయించుకోవలసి వచ్చిందే అన్న బాధతో అయిష్టంగానే అంగీకరించినా మేకప్ చేయించుకున్న తర్వాత నిజంగానే నటుడు నాగయ్యను పోతన ఆ వహించాడా అన్న భావం కలిగిందట ఆ టీం సభ్యులకు. ఈ యజ్ఞంలో పాల్గొన్న ఇతర మహామహులు రచయిత సముద్రాల రాఘవాచార్య, కళాదర్శకుడు ఎ.కె. శేఖర్ , కెమెరామెన్ కె. రామనాథ్, దీనికి సంగీత బాధ్యతల్ని స్వయంగా నాగయ్యే నిర్వహించారు.
Click Here to go to Bhakta Potana (1943) Movie Page.

కథ అందరికీ తెలిసిందే! సామాన్య రైతు కుటుంబానికి చెందిన పోతనకు శ్రీరామచంద్రుడు కలలో కనిపించి భాగవతాన్ని తెనిగించమనటం . అందుకు నూతన శ్రీకారం చుట్టడం. అతని బావమరిది శ్రీనాథ మహాకవి ఆ కృతిని రాజులకి అంకితమివ్వమనటం . అతనికి సరస్వతి సాక్షాత్కారం- ఇది భక్తి ముక్తిదాయకమైన పోతన కథ.
ఇందులో గౌరీనాథశాస్త్రి శ్రీనాధునిగా నటించగా, టంగుటూరి సూర్యకుమారి సరస్వతి గా నటించారు. ఇతర ముఖ్య పాత్రల్ని మాలతి, హేమలత, వనజ, జయమ్మ, లింగమూర్తి పోషించారు.
‘సర్వమంగళ నామా సీతారామా, కాటుక కంటి నీరు, ఎవ్వనిచే జనించు, నిధి చాలా సుఖమా రాముని సన్నిధి చాల సుఖమా, పావన గుణ నామ, ఏ తీరుగ నను దయ చూచెదవో, ఇది మంచి సమయము రారా’ మొదలైన పాటలు ఎంతో ప్రాచుర్యం పొందాయి.
ఆ రోజుల్లో జెమినీ చిత్రాలకు, వాహినీ చిత్రాలకు గట్టి పోటీ ఉండేది, పోతన విడుదల సమయంలోనే జెమినీ వారి బాలనాగమ్మ విడుదలైంది. బెంగుళూరులో పబ్లిసిటీ లో భాగంగా ‘బాలనాగమ్మ’ గా కాంచనమాలది పెద్ద కటౌట్ పెడితే ఆ పక్కనే ‘ పోతన’ లోని హనుమంతుని విగ్రహాన్ని మరో కటౌట్ రూపంలో పక్కనే నిలబెట్టారు.
ఆ తర్వాత వచ్చిన భక్తజన, చక్రధారి, మీరా మొదలైన అనేక భక్తిరస చిత్రాలకు స్ఫూర్తినిచ్చింది భక్త పోతన. తొలి ప్రయత్నంలోనే ఘన విజయం సాధించిన కె.వి.రెడ్డి దర్శకత్వ ప్రతిభకు, నాగయ్య బహుముఖ ప్రజ్ఞ ప్రతిరూపమే ‘ భక్త పోతన’.
ఈ చిత్రానికి చెందిన మరో విశేషం కూడా ఉంది. ముమ్మిడివరం లో ఒక పశువుల కాపరి ‘ పోతన’ సినిమా చూశాక బాలయోగిగా మారారంటారు .
నాగయ్య గారి ” పోతన” చూసిన ముమ్మిడివరం బాలయోగికి తాను నటించిన “పోతన” చిత్రం చూపిస్తే ఆయన సమాధి నుంచి బయటకు వస్తారని గుమ్మడి వెంకటేశ్వరరావు చమత్కరిస్తుంటారు.
Source: 101 C, S V Ramarao