ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన నవలల్లో ఒకటి విక్టర్ హ్యూగో రాసిన ‘ లే మిజరబుల్స్’ కథ. ఆద్యంతమూ పేదల బతుకు పోరాటాలకు, ఆకలి బాధలకు, ఫలితంగా జరిగే దొంగతనాలు, పోలీసులు వేధించే పద్ధతి, అందునా స్వాతంత్ర్యానికి పూర్వం కరుడుగట్టిన పోలీసు వ్యవస్థ ఈ కథ తో ముడిపడి ఉంటాయి. దీనిని భారతదేశ స్థితిగతులకు తగ్గట్టుగా శుద్ధానందభారతి స్క్రీన్ ప్లే సమకూర్చారు. పక్షిరాజా పతాకంపై నిర్మితమైన ఈ చిత్రానికి కెమెరామెన్ గా ప్రసిద్ధుడైన కె. రామనాథ్ దర్శకత్వం వహించారు.
Click Here to go to Beedala Patlu (1950) Movie Page.
పేదరికంలో ఉన్న కొడుకు అక్క కూతురి ఆకలి బాధ తీర్చడం కోసం దుకాణం నుంచి మిఠాయి దొంగిలిస్తాడు. ఫలితంగా జైలు పాలవుతాడు. అక్కడినుంచి తప్పించుకొన్నందుకుగాను ఇన్స్పెక్టర్ జావర్ మళ్లీ అరెస్టు చేయడంతో పదేళ్లు కారాగార శిక్ష పడుతుంది.

వరదల వల్ల కొండ డి గుడిసె కొట్టుకుపోవడంతో భార్య నిరాశ్రయురాలై బిచ్చగత్తె గా మారి ఒక దుర్మార్గుడి వల్ల వంచింపబడుతుంది. జైలు నుంచి విడుదలైన కొండడు ఒక సాధువు ఉపదేశం వల్ల జీవిత మార్గాన్ని మార్చుకుని కరుణాకరన్ గా అవతారమెత్తుతాడు. ఓ అద్దాల ఫ్యాక్టరీ నడుపుతాడు. అందులోనే అతని భార్య పనిచేస్తూ భర్తను గమనించి దూరమవుతుంది. కరుణాకరన్ ను అనుమానించి వెంటాడుతాడు జావర్. అతనిపై దాడి చేసిన కరుణాకరణ్ తప్పించుకొని పురుషోత్తం గా మరో అవతారం ఎత్తి ఆ నగరానికి మేయర్ అవుతాడు. విపత్కర ఈ పరిస్థితుల్లో ఉన్నజావర్ను రక్షించటానికి ప్రయత్నిస్తాడు పురుషోత్తం. అయితే అంతఃక్లేశాన్నికి లోనైనా జావర్ ఆత్మహత్య చేసుకుంటాడు.
దుర్భర సామాజిక పరిస్థితుల్లో ఉన్నవాడిని, లేనివాడు దోచుకోవటం నేరంగా పరిగణించాలా! అన్న ముఖ్య అంశం పై ఆధారపడి కథా కథనం రూపొందించారు. ప్రధాన పాత్రల్ని నాగయ్య, సీతారామన్ పోషించారు. ఆ తరువాత ఆయన ప్రముఖ రచయిత జావర్ సీతారామన్ గా ఖ్యాతినొందారు. ఇందులో టీ.ఎస్. బాలయ్య, ఎం. ఆర్. జానకి, ఎం.ఎన్.రాజం, లలిత, పద్మిని ప్రముఖ తమిళ నటులు నటించారు. ఈ చిత్రంలోని ‘నీ పెళ్లెప్పుడయ్యా చిలకరాజా ‘ అన్న పాట ద్వారా ఆరుద్ర గీత రచయితగా పరిచయమయ్యారు. సంగీతాన్ని అశ్వత్థామ, సుబ్బయ్య నాయుడు అందించగా నాగయ్య పర్యవేక్షించారు. నాగయ్య విశిష్ట నటనతో 1950లో విడుదలైన ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ఘన విజయం సాధించింది.

ఇదే కథను, ఇదే టైటిల్ తో బి.విఠలాచార్య స్వీయదర్శకత్వంలో అక్కినేని కథానాయకుడిగా నిర్మించారు. కానీ నిర్మాత ఆశించిన ఫల ప్రాప్తి లభించలేదు.
Source: 101 C, S V Ramarao