‘మల్లీశ్వరి’ చిత్రం ద్వారా చిరాయశస్సు నార్జించిన బి.యెన్. రెడ్డి వాహినీ పతాకంపై నిర్మించిన మరో మహత్తర చిత్రం ‘బంగారుపాప’. జార్జ్ ఇలియట్ రచన ‘సిలాస్ మేరినర్’ దీనికి ఆధారం. ఈ చిత్రం ద్వారా మాటల రచయితగా పాలగుమ్మి పద్మరాజును సినీరంగానికి పరిచయం చేశారు బి.యెన్.
Click Here to go to Bangaru Papa (1955) Movie Page.
ఆ పల్లెటూళ్ళో ఏ వేడుక జరిగినా హుషారుగా పాల్గొనే భక్తుడు కోటయ్య. నీతినిజాయితి మంచితనం మూర్తీభవించిన కోటయ్య కమ్మరికొలిమి నడుపుతుంటాడు. మనసు పడ్డ రామిని పెళ్లిచేసుకొంటాడు. అయితే ఆ వూరు వచ్చిన కపట గురువు గోపాలస్వామి రామిని లొంగదీసుకుంటాడు. ఆమె కూడా కోరి చేసుకున్న కోటయ్యను వంచించి స్వామితో లేచిపోతుంది. వారిద్దరూ పన్నినకుట్ర ఫలితంగా అమాయకుడైన కోటయ్య జైలుకు వెళతాడు.
జైలునుంచి తిరిగి వచ్చిన కోటయ్య పక్కా రౌడీగా తాగుబోతుగా మారతాడు. అతనిలో ప్రతీకారజ్వాల పరాకాష్టకు చేరుతుంది. ఆ రోజు ఊళ్లోకి ఆస్తులు అమ్ముకోవటానికి రాబోయే గోపాలస్వామిని అంతమొందించాలని కత్తి నూరతాడు కోటయ్య. ఆ తుఫాను రాత్రి కోటయ్య పెట్టిన ముహూర్తానికి ఓ పసిబిడ్డ ఆర్తనాదం వినిపిస్తుంది. ఒకవైపు ప్రతీకారేచ్ఛ మరోవైపు అనాధ శిశువు ఆక్రన్దన. ఆ సంఘర్షణలో అతనిలో మానవత్వం దానవత్వాన్ని జయిస్తుంది. కత్తిని విసిరేసి పాపను పోత్త్రిల్లోకి తీసుకొంటాడు. ఇంతకూ ఆ పాప ఎవరో కాదు ఆ వూరి జమీందారు కొడుకు మనోహర్కు అతను ప్రేమించిన శాంతకు పుట్టినది. బిడ్డకు జన్ననిచ్చిన శాంత చనిపోతుంది. మనోహర్ మరో పెళ్లిచేసుకొంటాడు.
కోటయ్య రౌడీ జీవితానికి స్వస్తి చెప్పి పాపను పెంచటంతో తన జీవితాన్నిమరో మలుపు తిప్పుకుంటాడు. పాపను నిద్రబుచ్చటానికి ‘తాదిమితకధిమి తోల్ బొమ్మా దీని తమాష చూడవే మాయబొమ్మ’ అంటూ తత్వం పాడతాడు. ఆ పాట సారాంశంలో కోటయ్య పాత్ర గతాన్ని ప్రస్తావిస్తూ ‘నాలుగు దిక్కుల నడిమి సంతలో తూలే తుళ్ళే తోల్ బొమ్మా, ఎవరికెవ్వరో ఏమౌతారో యివరము తెలుసా కిల్బొమ్మా’ అంటాడు. (దీని సిచినగా చిత్రం ముందు సన్నివేశాల్లో తాగిన రౌడికోటయ్య ఓ వస్తాదును ఓడించటం చూపిస్తారు) పెరిగి పెద్దదయిన పాపను మనోహర్ మేనల్లుడు శేఖర్ ప్రేమిస్తాడు. ఈ సంగతి తెలిసిన జమిందారు కోటయ్యను పిలిచి ఉగ్రుడౌతాడు. ఆ పరిస్థితిలో మనోహర్ మౌనం వీడి కోటయ్య వద్ద పెరిగిన ‘పాప’ తన కూతురుగా వివరిస్తాడు. అప్పుడు శేఖర్ కు, కోటయ్య కూతురుకు వివాహం కాగా తన పాప ఆనంద జీవితం చూసిన కోటయ్య కళ్లు చెమరుస్తాయి. సూక్ష్మంగా ఇదీ కథ.

ఇందులో ప్రధాన పాత్ర కోటయ్య, ఆమాయక భక్తునిగా, రౌడీగా, శాంతమూర్తిగా మూడు దశల్లోనూ ఆపాత్ర తాలూకు అంతరంగ, బాహ్యభావాలను అద్భుతమనిపించే స్థాయిలో తన నటనద్వారా ఆవిష్కరించారు మహానటుడు యస్వీరంగారావు ఆయన నటించిన అద్భుతమైన భూమికల్లో ‘బంగారు పాప’ కోటయ్య పాత్ర కలికితురాయి వంటిది. ఇహ పాప భూమికలో కృష్ణకుమారి అమాయకత్వంతో చక్కగా ఆ పాత్రకు న్యాయం చేసింది. ఇతర ముఖ్య పాత్రలో జగ్గయ్య, జమున, వంగర, రమణారెడ్డి రామశర్మ, రామన్న పంతులు, విద్యావతి నటించారు పద్మరాజు తొలి ప్రయత్నంలో రచయితగా సఫలీకృతులయ్యారు. దేవులపల్లి కష్ణశాస్త్రి రాసిన పాటల్ని రసరంజకంగా స్వరపరిచారు అద్దేపల్లి రామారావు, పైన పేర్కొన్న ‘తాధిమి తకధిమి’ పాటను మాధవపెద్ది సత్యం పాడి ఆ సన్నివేశానికి ప్రాణం పోశారు. ఆయన గానం, రంగారావు నటన కలిసి ప్రేక్షకుడికి దివ్యానుభూతిని అందిస్తాయి. నాయికానాయకుల పై చిత్రీకరించిన ‘పండువెన్నెల, మనసు నిండా వెన్నెల జీవనమధురవనిలో పచ్చని తీగల పుయ్యాల, ఏ కొరనోములు ఏమి నోచెనో కన్నదేవకికి కన్నీరా’ అన్న పాటలు అర్థవంతంగా పుండి శ్రోతల్ని అలరించాయి.
బి.యన్.రెడ్డి సోదరుడు కొండారెడ్డి కెమేరా నిర్వహించారు. ఎ.కె.శేఖర్ కళా దర్శకత్వం నిర్వహించారు. బి.యన్.దర్శకత్వం, యస్.వి. రంగారావు నటనతో రూపొందిన వాహినీవారి ఆణిముత్యం ‘బంగారు పాప’కు కేంద్ర ప్రభుత్వం రజిత కమలం లభించింది.
B. N. Reddy personally considered it as his best cinematic work.
Source: 101 C, S V Ramarao