26.2.1948న విడుదలైన ప్రతిభా బలరామయ్య అద్భుత సృష్టి ‘బాలరాజు’ చిత్రం. విజయవాడలో సంవత్సరం పైగా, మరో డజను కేంద్రాల్లో 200 రోజులకు పైగా ప్రదర్శింపబడి వసూళ్ల రీత్యా అంతకు ముందు ఉన్న అన్ని చిత్రాలను అధిగమించింది. అంతగా హిట్ అవడానికి అందులోని ప్రత్యేక విశేషాలను ఒకసారి పరిశీలిస్తే తెలిసేది మహిళా లోకాన్ని విపరీతంగా ఆకర్షించే కథ.
దేవలోకంలో యక్ష ప్రేమికులు ఇంద్రుడి శాపానికి గురై భూలోకంలో జన్మిస్తారు. యక్షిణి ఆయో నిజ సీతగా నాగటిచాలలో దొరుకుతుంది. యక్షుడు ప్రేమంటే ఎరుగని బాలరాజు. ఒంటి స్తంభం మేడలో మగగాలి సోకకుండా పెరిగిన సీతకు బాలరాజు తారస పడటం, అతను ప్రేమ అంటే నాకు తెలీదు మొర్రో అని గోల పెట్టినా సీత అతన్ని పతిగా చేసుకోవటం, శాపవశాత్తూ ఆ ప్రేమికులు విడిపోవటం, పాముగా మారిన భర్తను పుణ్యతీర్ధాలు సేవించి భర్తకు యథారూపం వచ్చేలా చేసుకుని సీత పతివ్రతగా పేరొందటం – సూక్ష్మంగా ఇదీ కథ. ఇందులో కథానాయకుని చెలికాడు ఎల్లమంద హాస్యం కూడా చిత్ర గమనానికి దోహదం చేస్తుంది.
Click Here to go to Balaraju (1948) Movie Page.
దేవలోకంలో యక్షిణిగా అంజలీదేవి నృత్యాలు, ప్రేమంటే ఎరుగని అమాయకుడిగా నాగేశ్వరరావు, అతనిని వలచిన సీతగా గంధర్వ గాయని ఎస్ వరలక్ష్మి గాన, నట, సౌందర్య సంపద, శివ రావు హాస్యం, గాలిపెంచల నరసింహారావు, ఘంటసాల వెంకటేశ్వరరావు సహాయంతో అందించిన అద్భుత సంగీతం, సముద్రాల రచన ఇవన్నీ ఈ చిత్రాన్ని సూపర్ హిట్ చేశాయి.
యక్ష లోకంలో యక్షిని పాడిన నవోదయం పాట, అంతకు మించ నర్తించిన ‘ తీయని వెన్నెల రేయి’ ఆ రోజుల్లో వేదికలపై రికార్డింగ్ డాన్సుల్లో తప్పనిసరి ఎస్ వరలక్ష్మి గొంతులో తీగలు సాగిన ‘ ఎవరినే నేనెవరినే, ఓ బాలరాజా ప్రేమే ఎరుగవా!, పతిరూపము నీయరామా, రాజరారా నా రాజరారా’ అన్న పాటలు, ఘంటసాల పాడిన చెలియాకనరావా ( అక్కినేని పాడినది రికార్డు చేశారు కానీ సినిమాలో ఘంటసాలది ఉపయోగించారు) గీతం ప్రజా హృదయాలని దోచుకున్నాయి. శివ రావు పాడిన ‘దేవుడయ దేవుడు’ మాస్ ని ఆకర్షించింది.
సెంటిమెంటు, పతిభక్తి, పాతివ్రత్యం ప్రధానంగా చక్కని ట్రీట్మెంట్ ఇచ్చిన దర్శక నిర్మాత ఘంటసాల బలరామయ్య ప్రతిభ నిరుపమానం. అందుకే మహిళా లోకం ఆ చిత్రానికి నీరాజనం పట్టింది. అంతేకాదు ఆ తర్వాత వచ్చిన ‘ సువర్ణ సుందరి’ వంటి అనేక జానపద చిత్రాలకు స్ఫూర్తిగా నిలిచింది. జానపదాలకు ప్రాణమైన మాంత్రికుని పాత్ర లేకపోయినా విధి లీల ప్రధానంగా సాగిన, విజయం సాధించిన చిత్రం ‘ బాలరాజు’.

The film was recorded as an Industry Hit at the box office and was the first Telugu Silver Jubilee film.
Source: 101 C, S V Ramarao