1953-54 ప్రాంతాల్లో బెంగాలీ రచయిత మణిలాల్ బందోపాధ్యాయ రచన ‘స్వయంసిద్ధ” అదే పేరుతో ‘ ఆంధ్ర సచిత్ర వార పత్రికలో దానికి అనువాదంగా ప్రచురితమైన పాఠకలోకాన్ని పరవశింపజేసింది. చాలామంది దాన్ని సినిమాగా నిర్మించాలని ప్రయత్నించినా చివరకు ఆ హక్కులు రాగిని పిక్చర్స్ అధినేత, నిర్మాత, దర్శకుడు పి.పుల్లయ్యకు దక్కాయి. ఫలితంగా తెలుగు, తమిళ భాషల్లో ‘ అర్ధాంగి’ చిత్రం రూపుదిద్దుకుంది.
Click Here to go to Ardhangi (1955) Movie Page.
మా ఊరికి ఓ జమిందారు (గుమ్మడి), ఆయన రెండో భార్య రాజేశ్వరి (శాంతకుమారి). వారికి ఇద్దరు కొడుకులు. మొదటి భార్యకు పుట్టిన కొడుకు రాఘవేంద్రరావు (అక్కినేని) ఆలనా పాలనా లేక ఆయా పెంపకంలో నల్లమందు ప్రభావంతో అమాయకుడిగా పెరుగుతాడు. రెండో భార్య సంతానమైన నాగు (జగ్గయ్య) విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ వ్యసనపరుడవుతాడు. శిస్తు వసూలు కోసం వెళ్లిన పొగరుబోతు నాగుకు తగిన విధంగా బుద్ధిచెబుతుంది, పల్లెటూరి పిల్ల పద్మ (సావిత్రి). జమీందారు ఆమెను ప్రశంసించి తన రెండో కోడలుగా చేసుకోవాలనుకుంటాడు. దీనిని వ్యతిరేకించిన రాజేశ్వరి ” అంతగా మీకు ఇష్టమైతే మీ పెద్ద కొడుక్కిచ్చి చేసుకోండి. ఆ మతి లేనివాడికి ఈ గతిలేని దానికి సరిపోతుంది” అని సలహా ఇస్తుంది. మాట తప్పని జమీందారు రఘుతో పద్మకు వివాహం జరిపించాడు. పెళ్లి పీటల మీద తన భర్త వెర్రిబాగుల వాడు అని తెలుసుకున్న కథానాయక పద్మ తరువాత ఆత్మసంయమనంతో వ్యవహరిస్తుంది. తూలనాడిన మరిది నాగుకు బుద్ధి చెబుతుంది. మరోవైపు భర్తను ప్రయోజకునిగాను, సంస్కారవంతునిగాను తీర్చిదిద్దుతుంది. ఈ సంగతి గమనించిన జమిందారు తృప్తిగా కన్నుమూస్తాడు.వేశ్యాసంగత్యంలో మునిగి తేలుతున్న నాగూకు డబ్బు అవసరమై అన్నపై ధ్వజమెత్తుతాడు. చివరకు కన్నతల్లి పై చేయి చేసుకోవడానికి కూడా వెనుకాడడు. రఘు త్యాగబుద్ధితో ఆస్తిని వదులుకుంటాడు. నిజానిజాలు గ్రహించిన జమిందారిని రాజేశ్వరి రఘు ఔదార్యాన్ని, నాగు నిజస్వరూపాన్ని గ్రహించి కొడుక్కి బుద్ధిచెబుతుంది.
అక్కినేని, సావిత్రి ఈ చిత్రానికి ప్రాణప్రదమైన పాత్రలకు తమ నటన ద్వారా ప్రాణం పోశారు. అమాయకుడిగా అక్కినేని అభినయం అపూర్వం. సావిత్రి మొదట చిలిపిగానూ తర్వాత గాంభీర్యాన్ని సంతరించుకుని నిండుగాను నటించింది. శాంతకుమారి కంటే వయసులో 9 సంవత్సరాలు చిన్నవాడైనా గుమ్మడి మేకప్ మహత్యంతో ఆమె భర్తగా, సమవుజ్జీగా, గంభీరంగా నటించారు.
నాగు పాత్రలో జగ్గయ్య, అతని ప్రేయసిగా సురభి బాలసరస్వతి పాత్రోచితంగా నటించారు. ఇతర ముఖ్య పాత్రల్ని కోడూరి అచ్చయ్య, డాక్టర్ శివరామకృష్ణ, వక్కలంక కామరాజు, గంగారత్నం, చదలవాడ కుటుంబరావు, నాగభూషణం, దొరస్వామి, బి. ఎన్. ఆర్ సమర్థవంతంగా పోషించారు.
ఈ చిత్రంలో మాటల రచయితగానూ, పాటలరచయితగానూ ఆచార్య ఆత్రేయ తన విశ్వరూపాన్ని ప్రదర్శించారు.” మునసబుగా వెళ్లి ముద్దాయిగా వచ్చాను” అంటారు గుమ్మడి. ఒక్క డైలాగులో కథ సారాంశం ఇమిడిపోయేలా రాశారు. ఆత్రేయ రచనతో బి.ఎన్. ఆర్ స్వరరచనతో ప్రాణం పోసుకున్నాయి చిత్రంలోని గీతాలు. ” పెళ్లి ముహూర్తం కుదిరిందా పిల్లా నీ పొగరానిగిందా, రాధను రమ్మన్నాడు, ఎక్కడమ్మా చంద్రుడు, రాకరాక వచ్చావు చందమామ, ఏడ్చేవాళ్లను ఏడవని” వంటి పాటలన్నీహిట్ అయ్యాయి.
ఈ చిత్రం తమిళ వెర్షన్లో అక్కినేని పాత్రను జెమినీగణేశన్, జగ్గయ్య పాత్రను శివాజీగణేశన్ పోషించారు. అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రిల నటజీవితంలో మైలురాయిగా చెప్పుకోదగ్గ ‘అర్థాంగి’ చిత్రం 26.1.1955న విడుదలై విజ్ఞుల ప్రశంసలు పొందటమేగాక ఆర్థికంగా గణనీయమైన విజయాన్ని సాధించింది.

Source: 101 C, S V Ramarao